
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణానికి సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించడమే కాకుండా వాటితోనే హైకోర్టును ఆశ్రయించారని ఓ బహుళ భవన నిర్మాణం కేసులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు మంజూరు చేసిన స్టే ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. కేసును విచారించిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీతారామమూర్తి.. భవనానికి సంబంధించి పూర్తి వివరాలివ్వాలని, ఆలోగా భవనం వ్యవహారాల్లో ఇతరులను హక్కుదారులు చేయొద్దంటూ బిల్డర్, ఇతరులకు మధ్యంతర ఆదేశాలిచ్చారు.
హైదరాబాద్ సీతాఫల్‌మండిలోని నామాలగుండు ప్రాంతంలో 1,000 గజాల స్థలం బహుళ అంతస్తుల భవనం (జీ ప్లస్ ఫోర్), 2 సెల్లార్ల నిర్మాణానికి అనుమతి కోసం 2013 జూలైలో జీహెచ్‌ఎంసీకి స్థల యజమానుల పేరుతో పి.రుక్మమ్మ సహా మరో నలుగురు, బిల్డర్ ఏడుకొండలు దరఖాస్తు చేసుకున్నారు. సెవెన్ హిల్స్ కన్‌స్ట్రక్షన్స్ పేరిట చేసుకున్న ఈ దరఖాస్తుకు జీహెచ్‌ఎంసీ అనుమతి ఇవ్వకపోవడంతో.. నకిలీ పత్రాలు సృష్టించి భవనం నిర్మించారు.
దీంతో 2016లో జీహెచ్‌ఎంసీ వారికి నోటీసులు జారీ చేసింది. అనుమతుల కోసం జీహెచ్‌ఎంసీకి రూ.60 లక్షలు వెచ్చించామని, నిర్మాణ అనుమతి పత్రాలు ఉన్నాయని బిల్డర్, యజమానులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. అయితే భవనానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్.. నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతి ఇవ్వలేదని, దరఖాస్తు తిరస్కరించామని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. భవనం నిర్మించిన స్థలం ప్రభుత్వ భూమి కాదని కలెక్టర్ ధ్రువపత్రం ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని, హైకోర్టుకూ ఆ పత్రాలే సమర్పించారని, కాబట్టి స్టే ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. దీంతో భవనానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఇరుపక్షాలను ఆదేశిస్తూ విచారణను జనవరి 2కు న్యాయమూర్తి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment