చోరీకి వచ్చి దాడి.. ముగ్గురు మృతి, ఒకరికి తీవ్రగాయాలు
రఘునాథపల్లి: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు కుటుంబ సభ్యులను కిరాతకంగా హత్య చేసి బంగారు ఆభరణాలతో పాటు నగదుతో ఉడాయించారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెరుకు నర్సింహ అదే గ్రామంలో ఖిలాషాపురం క్రాస్ రోడ్డు వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇతని ఇంటికి కొంత దూరంలో సోదరుడు సత్తయ్య నివసిస్తున్నాడు. నర్సింహ సోదరుని వద్ద ఉంటున్న వారి తండ్రి ఆరురోజుల క్రితం మరణించాడు. సంప్రదాయాల ప్రకారం గురువారం ఐదవరోజు కార్యక్రమాలు నిర్వహించి రాత్రి నర్సింహ తన సోదరుడి ఇంటి వ ద్దనే భార్య రేణుకతో ఉండిపోయాడు. కుమారుడు హర్షవర్ధన్(08), కూతురు అఖిలానందిని(11), అత్త బూడిద లచ్చమ్మ (51), లచ్చమ్మ తల్లి లింగంపల్లి రాధమ్మ(71)లను ఇంటికి వెళ్లి పడుకోమని పంపాడు. వారు వచ్చి.. హోటల్‌లోని ఇంట్లో పడుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున దుండగులు ఇంటి వెనకాల తలుపును పైకి లేపి ఇంట్లో దూరారు.
మధ్య గదిలో ఉన్న బీరువాను తెరుస్తుండగా అలికిడికి కుటుంబ సభ్యులు లేవడంతో వారిపై దాడికి తెగ బడ్డారు. కత్తి, రాడ్‌లతో దాడి చేయగా లచ్చమ్మతో పాటు మనుమరాలు అఖిలానందిని అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న రాధమ్మను వరంగల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. తీవ్ర గాయాలతో ఉన్న హర్షవర్ధన్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దొంగలు లచ్చమ్మ, రాధమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకోవడంతో పాటు బీరువాలోని తొమ్మిది తులాల బంగారం, రూ.90 వేల నగదు ఎత్తుకెళ్లారు. అంతకు ముందు అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య ఇంట్లోకి దూరి రూ.11 వేల నగదు, మూడు గ్రాముల బంగారం అపహరించడంతో పాటు మరో రెండిళ్లను దోచుకోవడానికి యత్నించారు. వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, అడిషనల్ ఎస్పీ కె.శ్రీకాంత్ సంఘటనా స్థలిని సందర్శించారు.
దోపిడీ దొంగల కిరాతకం
Published Sat, Sep 13 2014 1:12 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement