- భర్తే చంపాడంటున్న మృతురాలి అన్న
- డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు
- బిక్కాజిపల్లిలో విషాద ఛాయలు
బిక్కాజిపల్లి(దుగ్గొండి) : ఓ వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన బిక్కాజిపల్లిలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గీసుగొండ మం డలం చంద్రయ్యపల్లికి చెందిన పేర్ల ఎల్లమ్మ కూతురు రమ(35)కు, దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన కన్నెబోయిన సదయ్యకు 16 ఏళ్ల క్రితం వివాహం జరి గింది. వీరి దాంపత్య జీవితంలో శరత్, గణేష్ అనే ఇద్దరు కొడుకులు జన్మించారు. అయితే సోమవారం ఉదయం 10 గంటలకు సదయ్య నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లెలో ఉంటున్న తన అన్న సమ్మయ్య వద్దకు మరో అన్నయ్య ఓదేలుతో కలిసి వెళ్లాడు. వారు వెళ్లిన తర్వాత రమ నల్లబెల్లి గ్యాస్ కేంద్రంలో ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తానని కొడుకులకు చెప్పి బయటకు వెళ్లింది.
సాయంత్రం అయినా ఆమె, సదయ్య సైతం ఇంటికి రాలేదు. సాయంత్రం తన తల్లికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో పిల్లలు ఇద్దరే పడుకున్నారు. మంగళవారం ఉదయం శివాజీనగర్‌కు చెందిన కొండ్లె సదయ్య తన బావి వద్దకు పనులకు వెళ్లాడు. ఎస్సారెస్పీ డీబీఎం-38 కాలువ పక్కనే వ్యవసాయ బావి వద్ద పొదల మధ్య మహిళ శవం కనిపించింది. దీంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. మృతురాలి బంధువులు వెళ్లి చూడగా.. రమ మెడ భాగంలో మారణాయుధాలతో నరికి ఉండ టం..
రక్తపు మడుగు కట్టడంతో బోరున విలపించారు. భర్తకు సమాచారం ఇవ్వడంతో దస్తగిరిపల్లె నుంచి తన అన్నదమ్ములతో కలిసి వచ్చి మృతదేహాన్ని చూసి రోదించాడు. నర్సంపేట డీఎస్పీ మురళీధర్, రూరల్ సీఐ బోనాల కిషన్, దుగ్గొండి, నల్లబెల్లి ఎస్సైలు వెంకటేశ్వర్లు, హమీద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేశారు.
భర్త వద్దకు వెళ్లి ఆగిన డాగ్ స్క్వాడ్
కాగా, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలంలో పలుచోట్ల తిరిగి చివరికి మృతురాలి భర్త సదయ్య వద్దకు వెళ్లి అతడిని వాసన చూసి అక్కడే ఉంది. ఇలా రెండు మూడుసార్లు పరీక్షించారు. సంఘటన స్థలానికి కొంత దూరంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి మొక్కజొన్న చొప్ప కింద ఉన్న పారను పసిగట్టింది. దానిని తొలగించగా పార లభించింది.
రమను ఇనుప పారతోపాటు గొడ్డలి లాంటి పరికరంతో చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. మహిళ ఇంటికి వస్తుండగా రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరయినా తీసుకెళ్లి చంపి ఉంటారా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, మృతురాలి అన్న పేర్ల సుధాకర్ తన చెల్లి రమను కుటుంబ కలహాలను దృష్టిలో ఉంచుకుని భర్త సదయ్యతోపాటు అతడి బంధువులు చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కిషన్ తెలిపారు. కాగా, బిక్కాజిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వందలాది మంది ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు గంటలపాటు వారిని నిలువరించడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
వివాహిత దారుణ హత్య
Published Wed, Apr 15 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM
Advertisement