రేపు అర్ధరాత్రి నుంచి క్యాబ్ డ్రైవర్ల సమ్మె
ముషీరాబాద్: క్యాబ్ ట్యాక్సీ ధరల పెంపుతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ క్యాబ్ యజమానులు, డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ట్యాక్సీ క్యాబ్‌ల వారు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ క్యాబ్స్ యజమానులు, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు టి.సంతోషరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.బాగిరెడ్డిలు ప్రకటించారు.
బుధవారం వారు దోమలగూడలోని ఎస్‌ఎంఎస్‌లో సమ్మెకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతమున్న క్యాబ్స్ ట్యాక్సీ ధరలు గిట్టుబాటు కావడం లేదన్నారు. డీజిల్ ధరలు, డ్రైవర్ల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, రోడ్డు ట్యాక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగినా, ట్రాఫిక్ చలానాలు సైతం భారంగా మారినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. యజమానులకు ఫైనాన్స్ అప్పులు మిగిలి కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు.
గత నెల 20వ తేదీనే సమ్మె చేయాలని భావించినా సమస్యల పరిష్కారానికి వెండర్స్ హామీ ఇవ్వడంతో వాయిదా వేసుకున్నామన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో ప్రస్తుతం క్యాబ్ యజమానులకు, డ్రైవర్లకు ఇచ్చే మొత్తం తక్కువ చేయడమే కాకుండా బిల్లులు కూడా చెల్లించకుండా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
గత్యంతరం లేని పరిస్థితిలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నామని చెప్పారు. కంపెనీలు, వెండర్స్ చేసే బెదిరింపులకు క్యాబ్స్ ఓనర్లు, డ్రైవర్లు భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.యాదగిరి, పి.రవి, శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి కె.నర్సింహరెడ్డి పాల్గొన్నారు.