జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. కొందరు వ్యాపారులు అడ్డగోలు వడ్డీతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. అసలుకన్నా వడ్డీ ఎక్కువైనప్పుడు.. కట్టలేని పరిస్థితుల్లో అప్పు తీసుకున్నవారి ఇళ్లను, ప్లాట్లను, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు.
– సాక్షి, కామారెడ్డి
సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన రాజయ్య (పేరు మార్చాం) అవసరానికి ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. రాజయ్య వ్యాపారం దెబ్బతింది. తీసుకున్న అప్పు చెల్లించలేకపోయాడు. అప్పు తీర్చడానికి మరికొంత కాలం గడువు అడిగాడు. దీనికి సమ్మతించిన సదరు వడ్డీ వ్యాపారి.. 15 నెలలకు వడ్డీ లెక్కగట్టి అసలు, వడ్డీ మొత్తం రూ. 3.50 లక్షలు అయ్యిందని తేల్చాడు. ఇంత మొత్తం బాకీకి ఇంటికి సంబంధించిన కాగితాలు ఇవ్వాలనే షరతు పెట్టాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజయ్య ఇంటికాగితాలు చేతికిచ్చాడు. మరో ఏడాది గడిచింది. అప్పు వడ్డీలతో రూ. 5 లక్షలు దాటింది. ఇక లాభం లేదని ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని ఒత్తిడి తేవడంతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. వ్యాపారాల్లో నష్టాలే తప్ప లాభాలు రాకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. సదరు వడ్డీ వ్యాపారి పది నెలల తర్వాత మళ్లీ అసలు, వడ్డీ లెక్కేశాడు. అప్పు రూ. 7 లక్షలు దాటిందని.. వారం రోజుల్లో మొత్తం అప్పు తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించాడు. వారం తర్వాత పదిహేను మందిని తీసుకుని వచ్చాడు. ఎంత బతిమాలినా కనికరించకపోవడంతో రాజయ్య సామాన్లు సర్దుకుని, వేరే ఇంటికి మారాడు.
జిల్లా కేంద్రంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అమ్ముతూ నాలుగు పైసలు సంపాదించాలన్న ఆశతో ఓ ఆంధ్రా మేస్త్రీ తన దగ్గర ఉన్న డబ్బులను పెట్టుబడిగా పెట్టాడు. అవి సరిపోకపోవడంతో ఓ వడ్డీ వ్యాపారిని ఆశ్రయించాడు. ఎంత కావాలన్నా ఇస్తాను కాని, ప్లాటును తన పేరిటే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనే షరతు పెట్టాడు. దానికి సమ్మతించిన మేస్త్రీ.. రెండు ప్లాట్లను రిజస్ట్రేషన్ చేసి రూ. 5 లక్షల అప్పు తీసుకున్నాడు. ఇంటి నిర్మాణానికి డబ్బులు సరిపోకపోవడంతో మరో రూ. 5 లక్షల అప్పు అడిగాడు. ప్లాటు తన పేరిటే ఉండడంతో సదరు వ్యాపారి అప్పు ఇచ్చాడు. మేస్త్రీ ఆరు నెల ల్లో ఇంటి నిర్మాణాలను పూర్తి చేశాడు. మరో ఆరు నెలలైనా ఇళ్లను ఎవరూ కొనుగోలు చేయలేదు. తన సొంత డబ్బులుపోను రూ. 10 లక్షలు అప్పు గా తీసుకుని పెట్టిన పెట్టుబడికి సంబంధించి వడ్డీ లెక్కలు చూసుకున్నాడు. వడ్డీ వ్యాపారి డబ్బుల కోసం ఒత్తిళ్లు తేసాగాడు. ఓరోజు కూర్చోబెట్టి ‘‘నువ్వు తీసుకున్న అప్పుకు ఇప్పటికే రూ. 4 లక్షల మిత్తి అయ్యింది. అసలుతో కలిపి రూ.14 లక్షలు కట్టు’’ అని ఒత్తిడి తెచ్చాడు.
ఇళ్లు అమ్ముడవకపోవడంతో మేస్త్రీ చేతులెత్తేశాడు. వ్యాపారి రెం డు ఇళ్లకు రూ. 18 లక్షలు లెక్కగట్టి.. తనకు రావాల్సిన రూ. 14 లక్షలు పోనూ మిగిలిన రూ. 4 లక్షలను మేస్త్రీ చేతిలో పెట్టాడు. తాను కష్టపడి దాచుకున్న సొమ్ము కూడా పోవడంతో ఆ మేస్త్రీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొంత కాలానికి ఆ వ్యాపారి ఒక్కో ఇంటిని రూ. 26 లక్షలకు అమ్ముకున్నాడు. కష్టపడ్డ మేస్త్రీకి మాత్రం కన్నీళ్లు మిగిలాయి. అవసరానికి అప్పు ఇస్తున్నామని చెప్పుకుంటూ కొందరు వడ్డీ వ్యాపారులు అప్పు తీసుకున్నవారి రక్తాన్ని పీల్చేస్తున్నారు. అడ్డగోలు వడ్డీలతో వారి నడ్డి విరుస్తున్నారు. ఇదే సమయంలో తమ దగ్గర తీసుకున్న అప్పును తీర్చలేని వారికి సంబంధించిన ఆస్తులను జబర్దస్తీగా స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో కొందరు వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరాయి. ఎలాంటి అనుమతులు, లెక్కా పత్రం లేకుండానే రూ. కోట్లల్లో వడ్డీల దందా నిర్వహిస్తున్నారు. అప్పుపై అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తున్నారు. అప్పు ఇచ్చే ముందు ఇంటి కాగితాలో, ప్లాటు కాగితాలనో తనఖా పెట్టుకోవడం, సకాలంలో అప్పు చెల్లించకుంటే ఆస్తులను ఆక్రమించుకోవడం పరిపాటిగా మారింది.
అడ్డగోలు వడ్డీలు...
వడ్డీ వ్యాపారం పేరుతో కొందరు చేస్తున్న దందా సామాన్యులను దివాలా తీయిస్తోంది. ప్రతి మని షికి ఏదో ఒక సందర్భంలో అప్పు చేయాల్సి వ స్తోంది. ప్రధానంగా పిల్లల చదువులకో, ఇళ్ల నిర్మా ణానికో, ప్లాటు కొనుగోలు కోసమో, పిల్లల పెళ్లి ళ్లు, ఫంక్షన్లు, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడుల కోసమో.. ఇలా ప్రతిదానికి అప్పు చేయాల్సిందే. ఇలాంటి సందర్భంలో వడ్డీ వ్యాపారులు ‘కొంద రు’ అడ్డగోలు వడ్డీలతో నడ్డివిరుస్తున్నారు. నూటి కి నెలకు రూ. 3 నుంచి రూ. 5 వరకు వడ్డీ వసూ లు చేస్తున్నారు. కొందరైతే మూడు నెలలకోసారి, మరికొందరు ఆరు నెలలకోసారి వడ్డీ లెక్కలు గ డుతున్నారు. కొందరు వడ్డీ వ్యాపారులు ముందుగానే ఆరు నెలల వడ్డీని తీసుకుంటున్నారు. వడ్డీ, అసలు కలిపి మళ్లీ కొత్త లెక్క రాసుకోవడం మూ లంగా అప్పుభారం ఏడాదిన్నర, రెండేళ్లలో రెట్టింపవుతోంది. వాయిదా ప్రకారం డబ్బు చెల్లించకుం టే వడ్డీలపై వడ్డీలు వేసి ఇబ్బంది పెడుతున్నారు.
తనఖా తప్పనిసరి
కొందరు వడ్డీ వ్యాపారులు అప్పు ఇచ్చేటపుడు ఏదైనా తనఖా పెట్టాలన్న షరతు విధిస్తున్నారు. ప్రధానంగా ఇంటికి సంబంధిం చిన డాక్యుమెంట్లుగాని, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు గాని వారి వద్ద తనఖా పెట్టుకున్న తరువాతనే అప్పులు ఇస్తున్నారు. అప్పులు చెల్లించని పక్షంలో వడ్డీ వ్యాపారులు తమ మనుషులను తీసుకెళ్లి ఇంటి ముందర నానా హంగామా చేయడం, అప్పుకట్టకుంటే ఆస్తులను స్వాధీనం చేసుకోవడం పరిపాటిగా మారింది. అప్పులు తీసుకున్నవారు చాలా మంది వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు కళ్లెం వేయాలని చిరువ్యాపారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment