సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఫలితాలు వెలువడిందే తరువాయి క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. పలు మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడంతో చైర్మన్ అభ్యర్థులు శిబిరాలకు సన్నాహాలు చేస్తున్నారు. పోలింగ్ సరళిని విశ్లేషించుకొని హంగ్ తీర్పు వస్తుందని అంచనాకొచ్చిన ఆశావహులు మంగళవారం ఫలితాలు వెల్లడికాగానే విజేతలతో సంప్రదింపుల పర్వానికి తెరలేపారు. బహుముఖ పోటీ నెలకొనడంతో చాలా మండలాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
దీంతో మండల పీఠం దక్కించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకునేందుకు బేరసారాలకు దిగారు. ఈ క్రమంలో ఇతరులు, స్వతంత్రులకు ప్రధాన పార్టీలు గాలం వేస్తున్నాయి. మరోవైపు ప్రత్యర్థులకు గాలానికి చిక్కకుండా సొంత పార్టీ సభ్యులను కూడా విహారయాత్రలకు పంపే పనిలో బిజీగా మారారు. మండల, జెడ్పీ చైర్మన్ ఎన్నికలు వచ్చే నెలలో ఉండడంతో అప్పటివరకు వీరిని కాపాడేందుకు క్యాంపుల్లో ఉంచడం శ్రేయస్కరమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో అవసరమైన సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.
గెలిచిన అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రాల నుంచే నేరుగా తమ శిబిరాలకు తరలించి విందు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. వారి కోరికలను తీర్చేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడడం లేదు. ఇప్పటికే పూడూరులో ఎంపీపీ హంగ్ అవడంతో అక్కడ కీలకంగా మారిన ఇండిపెండెంట్ సభ్యుడిని మచ్చిక చేసుకునే పనిలో టీఆర్‌ఎస్ నిమగ్నమైంది. ఏకంగా కౌంటింగ్ హాల్ నుంచే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సదరు సభ్యుడిని కారెక్కించుకొని తీసుకెళ్లడం చూస్తే ఇక్కడ ఫలితం తారుమారయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆశావహులకే క్యాంపుల భారం
క్యాంపుల నిర్వహణ బాధ్యతను చైర్మన్ పదవి ఆశిస్తున్నవారికే అప్పగించారు. చైర్మన్ ఎన్నిక ముగిసేవరకు పార్టీ సభ్యులను కాపాడుకోవడమేకాకుండా.. వారిని సంతృప్తి పరిచే బాధ్యత కూడా వీరికే కట్టబెట్టారు. అధిష్టానం కూడా ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ అభ్యర్థులే శిబిరాల నిర్వహణ వ్యయాన్ని భరించాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ మేరకు నిధులను సమకూర్చుకున్నారు. మరోవైపు హంగ్ రావడంతో తమ పంట పండిందని భావిస్తున్న విజేతలైన స్వతంత్ర ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ‘అవన్నీ మేం చూసుకుంటాం. ముందైతే కారెక్కండి’ అంటూ ప్రధాన పార్టీల నేతలు స్వంతంత్రులను బుజ్జగిస్తున్న దృశ్యాలు అనేకం కౌంటింగ్ కేంద్రాల వద్ద దర్శనమిస్తున్నాయి.
టీఆర్‌ఎస్ జోరు
రాజకీయ శిబిరాల నిర్వహణలో మిగిలిన పార్టీల కంటే టీఆర్‌ఎస్ ఓ అడుగు ముందుంది. తెలంగాణ తదుపరి ప్రభుత్వం మాదేనంటూ స్వతంత్రుల డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధమంటూ హామీలిస్తూ అందిన వారిని ఎగరేసుకుపోతున్నారు. పార్టీలోకి వచ్చే వారందరికీ ప్రత్యేక స్థానం కల్పిస్తామని నచ్చజెప్తున్నారు. కీలకమైన పదవులు, ప్రయోజనాలు ఆశచూపుతున్నారు. జిల్లాలో తక్కువ స్థానాల్లోనే టీఆర్‌ఎస్ గెలుపొందినా హంగ్ ఏర్పడిన స్థానాలనైనా కైవసం చేసుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీటీసీలు గెలుపొందిన టీడీపీ, బీజేపీ అభ్యర్థులపై గులాబీ శిబిరం వల విసురుతోంది. ఏ పార్టీ అయితే బెటర్ అని ముందుగానే అంచనా వేసుకుంటున్న స్వతంత్రుల కూడా టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
కాంగ్రెస్ జోష్
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైంది. అధిష్టానం ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు కూడా క్యాంపుల నిర్వహణలో చురుగ్గా ఉన్నారు. కొందరు అభ్యర్థుల మద్దతిస్తే తమ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులను సొంతం చేసుకోవచ్చనుకున్న స్థానాల్లో స్వంతంత్రులను కాకా పట్టేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కారు పార్టీకి దీటుగా నజరానాలు ప్రకటిస్తున్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల్లో తెలంగాణ వ్యాప్తంగా తమ పార్టీకే ఎక్కువ స్థానాలొచ్చాయని, దీన్ని బట్టి సార్వత్రిక ఎన్నికల్లో కూడా మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు భరోసా ఇస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో భారీ ప్రయోజనాలు కల్పిస్తామంటూ విజేతలకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
శిబిరాలకు వేళాయే!
Published Wed, May 14 2014 1:06 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement