వృత్తిపరంగా వచ్చే వ్యాధుల్లో క్యాన్సర్‌దే అగ్రస్థానం
శంషాబాద్: వృత్తిపరంగా వచ్చే వ్యాధుల్లో కేన్సర్‌ది అగ్రస్థానమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాదారుడు డాక్టర్ టీకే జోషి తెలిపారు. గ్రీన్‌టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్‌లో ‘ వృత్తిపర ఆరోగ్య సమస్యలు, అగ్నిప్రమాదాలు, భద్రత’పై కార్పొరేట్ స్థాయి పరిశ్రమ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీకే జోషీ మాట్లాడుతూ.. వృత్తిపరంగా వచ్చే వ్యాధుల్లో ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ బాధితులు 34 శాతం మంది ఉన్నారని తెలిపారు. ఈ వ్యాధి తర్వాత నడుమునొప్పి అతి ప్రధానమైందని చెప్పారు.
ఈ సమస్యతో బాధపడుతున్న శ్రామికులు, ఉద్యోగులు కంపెనీల నుంచి తగిన నష్టపరిహారాన్ని పొందేందుకు కూడా వెసులుబాటు ఉందన్నారు. వృత్తిపరంగా రొమ్ము కేన్సర్ వచ్చిన మహిళకు డెన్మార్క్ దేశంలో మొట్టమొదటి సారిగా నష్టపరిహారం అందించారని ఆయన గుర్తు చేశారు. అనంతరం వివిధ సంస్థల ప్రతినిధులు ఆరోగ్య, అగ్ని ప్రమాదాల భద్రతపై చర్చించారు. పారిశ్రామిక భద్రతకు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత కూడా తీవ్రంగా ఉందని జోషీ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ డైరక్టర్ జనరల్, సీఈఓ డాక్టర్ భాస్కర్ ఛటర్జీ, గ్రీన్‌టెక్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ కమలేశ్వర్, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.