
సాక్షి, ఖమ్మంసహకారనగర్: శాసనసభ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లకు వల వేస్తున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సుమారు ప్రధాన అభ్యర్థులు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు నుంచి నలుగురు ఉండటంతో వారంతా ఓటర్లను ప్రసన్నం చేసుకోవటంతో పాటు వారికి ఓట్లు వేసేలా ఇప్పటి నుంచే గాలం వేస్తున్నారు. ఎవరికి తాము గెలవాలన్న ఉద్దేశంతో ఓటర్లను అధిక శాతం ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కీలకంగా ఆయా డివిజన్లు, ఆయా గ్రామాల్లోని కొద్దిమందిని ఎంపిక చేసుకొని వారి ద్వారా ఎన్నికల్లో గెలుపొందేందుకు తాయిలాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది మంది అభ్యర్థులు తమ అనుచరులకు ముందస్తుగానే తాయిలాలు అందించేందుకు సిద్ధం చేయగా, మరికొంతమంది ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రామస్థాయిలో వారే కీలకం ..
గ్రామస్థాయిలో గ్రామపెద్దలతో పాటు ఆ గ్రామంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తులను ఆయా పార్టీల అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం కలుస్తున్నారు. ఉదయం సమయాల్లో ప్రచారాల చేయగా, సాయంత్రం సమయాల్లో తాయిలాల మంతనాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నగరం, పట్టణాల్లో సామాజిక వర్గాల పరంగా...
మున్సిపాలిటీ, కార్పొరేషన్, నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రం ఓటర్లను ఆకర్షించేందుకు ఒక వైపు సామాజిక వర్గాలను ఉపయోగిస్తుండగా, మరో వైపు యువత వైపు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వీరందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే విజయం సాధ్యమవుతుందనిఎవరికి వారే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు యువతకు కానుకల రూపేణా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. యువతకు మాత్రం క్రికెట్ కిట్లు అందించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మహిళలు చీరలను కానుకగా ఇచ్చేందుకు, పురుషులకు మద్యంతో పాటు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసేందుకు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కీలకంగా విభాగాల వారిగా ఎంపిక చేసుకొని తాయిలాలు అందించేందుకు కసరత్తు ప్రారంభించారు.