
రైల్వే అధికారి ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ స్టేషన్‌లో రైళ్లు ఢీకొన్న ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం ఘటనాస్థలిని పరిశీలించిన దక్షిణమధ్య రైల్వే అధికారులు ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని గుర్తించారు. ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరగిందిని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే రైలును నిర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ సెక్షన్ 337, ర్యాష్‌డ్రైవింగ్ చేసి ఇతరులకు హానీ చేసినందుకు సెక్షన్ 338 కింద చంద్రశేఖర్‌పై పలు కేసులను నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైలు ఒక ట్రాక్‌పై వెళ్లాల్సిందిగా, మరో ట్రాక్‌పై తీసుకువెళ్లి పైలెట్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు. మరోవైపు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కాచిగూడ స్టేషన్‌కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ఉదయం ఢీకొట్టిన విషయం తెలిసిందే.( చదవండి: ఎంఎంటీఎస్‌లో తొలి ప్రమాదం)
పైలెట్ పరిస్థితి విషమం..
రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కేబిన్‌లో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఇంకా కోలుకోనట్లు వైద్యులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. సాయంత్రం 6.40 గంటలకు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగాయి.
Comments
Please login to add a commentAdd a comment