ఠాణాకు చేరిన ‘ముద్దు’ల రగడ!
గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రగులుతున్న ‘ముద్దుల’ రగడ గచ్చిబౌలి ఠాణాకు చేరింది. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ రామబ్రహ్మం ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై సోమవారం రాత్రి కేసు నమోదు చేశామని గచ్చిబౌలి సీఐ రమేశ్ తెలిపారు. ‘కిస్ ఆఫ్ లవ్’ పేరుతో విద్యార్థులు అశ్లీలంగా వ్యవహరించారని, క్యాంపస్ లోపలికి బయటి వ్యక్తులు ప్రవేశించారని రిజిస్ట్రార్ ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు.
నాలుగు రోజుల క్రితం కిస్ ఆఫ్ లవ్ యూనివర్సిటీలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంతో దీనిని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు క్యాంపస్ లోపలికి వెళ్లి నిరసన తెలిపిన విషయమూ విదితమే.
ముద్దులు పెట్టుకున్న విద్యార్థులతో పాటు ఇటు క్యాంపస్ లోపలికి అక్రమంగా ప్రవేశించిన బీజేవైఎం కార్యకర్తల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు వివిధ చానళ్ల ఫుటేజీలను పరిశీలించి బాధ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇరు వర్గాలపై ఐపీసీ 297, 447 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజ నిర్ధారణ కమిటీ..
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ‘కిస్ ఆఫ్ లవ్’ నిర్వహించారని ఏబీవీపీ, బయటి వ్యక్తులు క్యాంపస్ లోపలికి ప్రవేశించి ప్రశాంత వాతావరణానికి భంగం కల్గించారని ఎస్‌ఎఫ్‌ఐతో పాటు ఇతర విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడంతో ఘటనపై విచారణకు నిజ నిర్ధారణ కమిటీ నియమించారు.
కమిటీ ఛెర్మైన్‌గా స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ డీన్ ప్రొఫెసర్ అనంత కృష్ణన్, సభ్యులుగా ఫ్రొఫెసర్లు ప్రకాశ్ బాబు, మీనా హరిహరన్, వాసంతి, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు విన్సెంట్‌లు ఉన్నా రు. విచారణ జరిపి 20 రోజుల్లో వీసీ రామకృష్ణ రామస్వామికి నివేదిక అందజేస్తారు. కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుంటామని సీఐ ర మేశ్ తెలిపారు.