- ఇంటర్‌లో నిర్ణీత మార్కులుంటేనే ప్రవేశాలు..
- ఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల ప్రవేశాలపై సీబీఎస్‌ఈ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 2017 విద్యాసంవత్సరం నుంచి జాయింట్ ఎంట్రన్‌స ఎగ్జామినేషన్ (జేఈఈ)లో ర్యాంకుతోపాటు ఇంటర్ సెకండియర్‌లో 75 శాతం మార్కులు ఉండాలని సీబీఎస్‌ఈ(సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిబంధన విధించింది. 2017 నుంచి జేఈఈలో ఇంటర్ మార్కులకు వెయిటేజీని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే వెయిటేజీని రద్దుచేసినప్పటికీ నిర్ణీత శాతంలో మార్కులు సాధించిన వారికి మాత్రమే జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుందనే నిబంధన విధించింది.
ఇంటర్ సెకండియర్లో ఓసీలకు 75 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం మార్కులు ఉండాలని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్‌సకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైనా వెబ్‌సైట్లో ఆన్‌లైన్ దరఖాస్తు ఓపెన్ కావడం లేదని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణలో ఆధార్ అనుసంధానాన్ని ఈసారి తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు లేని విద్యార్ధులు వాటిని పొందేందుకు ప్రత్యేక కేంద్రాలను ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 7 పరీక్ష కేంద్రాలు
ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా 103 కేంద్రాల్లో జరుగుతుంది. విదేశాల్లో పరీక్షలు రాసే వారి కోసం మరో 8 కేంద్రాలు ఆయా దేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం... తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని 31 ఎన్‌ఐటీలు, 20 ఐఐఐటీలు, మరో 19 జాతీయ విద్యాసంస్థల్లోకి ఈ పరీక్షల ఆధారంగా ప్రవేశాలు చేపట్టనున్నారు.
రెండున్నర గంటలు ముందుగానే పరీక్షకేంద్రంలోకి..
జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ పరీక్ష 2017 ఏప్రిల్ 2న, ఆన్‌లైన్ పరీక్ష ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరగనుంది. పరీక్ష రోజున ఉదయం ఏడింటికి పరీక్ష కేంద్రంలోకి.. ఉదయం 9 గంటలకు పరీక్ష హాల్‌లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. పరీక్ష హాల్‌లోకి ఉదయం 9:30 లోపు వచ్చే వారికి మాత్రమే అనుమతిస్తారు. 9:30 నుంచి 12:30 వరకు పరీక్ష జరుగుతుంది. పేపర్- 2 పరీక్షకు మధ్యాహ్నం ఒంటిగంటకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. 1: 30కు పరీక్షహాల్‌లోకి అనుమతిస్తారు. రెండుగంటల వరకు అభ్యర్థులకు అనుమతిస్తారు. పరీక్ష 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. పరీక్ష రోజున అడ్మిట్‌కార్డుతో పాటు నిర్ధేశిత పత్రాలను అభ్యర్థులు తమతో పాటు తీసుకువెళ్లాలి.