జేఈఈ రాయాలంటే ఇంటర్‌లో 75 శాతం మార్కులు ఉండాల్సిందే
లేనిపక్షంలో టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి
ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం మార్కులు ఉంటే చాలు
ఐఐటీల్లో భారీగా పెరిగిన ఫీజులు
వార్షిక ఫీజు రూ.90 వేల నుంచి రూ.2 లక్షలకు పెంపు
2017 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఇప్పటివరకూ అమలు చేస్తున్న ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీని రద్దు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్‌ఆర్‌డీ) ప్రకటించింది. 2017 నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే నేరుగా జేఈఈ ర్యాంకులను కేటాయించనున్నట్లు వెల్లడించింది. 2017 నుంచి జేఈఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలని లేదా టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రం కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొంది.
ఇదే సమయంలో ఐఐటీల్లో ఫీజులను ఏకంగా 122 శాతం పెంచింది. వార్షిక ఫీజును రూ.90 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పెంచిన ఫీజులు అమల్లోకి వస్తాయి. త్వరలోనే దీనికి సంబంధించి హెచ్‌ఆర్‌డీ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇక ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులతోపాటు కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉన్నవారికి పూర్తి ఫీజు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారికి మూడింట రెండు వంతుల ఫీజు మినహాయింపు ఇవ్వనున్నారు. ఈ కేటగిరీల పరిధిలో రాని వారికి ప్రభుత్వం తరఫున వడ్డీలేని విద్యా రుణాలు ఇప్పిస్తారు.
పాత విద్యార్థులకు పాత ఫీజులే!
ఇప్పటికే ఐఐటీల్లో చేరిన విద్యార్థులకు పాత ఫీజులే వర్తిస్తాయని హెచ్‌ఆర్‌డీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పెరిగిన ఫీజులు కొత్తగా ఐఐటీల్లో చేరే విద్యార్థులకే వర్తిస్తాయని తెలిపాయి. వాస్తవానికి ఐఐటీ రూర్కీ చైర్మన్ అశోక్ మిత్రా నేతృత్వంలోని ఉన్నతస్థాయి ఐఐటీ కమిటీ... ఐఐటీల్లో ఫీజులను రూ.90 వేల నుంచి రూ.3లక్షలకు పెంచాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను పరిశీలించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ.. భారీ పెంపు సమంజసం కాదని భావించారు. మధ్యేమార్గంగా ఫీజును రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫీజుల పెంపు దేశంలోని 23 ఐఐటీ ల్లో అమలు కానుంది. కొత్తగా ఏర్పాటైన తిరుపతి ఐఐటీకి కూడా ఫీజుల పెంపు వర్తిస్తుంది.
త్వరలో ఎన్‌ఐటీల్లోనూ పెంపు?
ఐఐటీలతో పాటు దేశంలోని 31 ఎన్‌ఐటీల్లోనూ ఫీజులు పెంచాలని గతంలోనే ఎన్‌ఐటీల కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రూ.70 వేలుగా ఉన్న వార్షిక ఫీజును రూ.2 లక్షలకు పెంచాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖకు ప్రతిపాదనలు అందజేసింది. దీనిపైనా త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశముంది.