నిఘా నేత్రాల నీడన కలెక్టరేట్
హన్మకొండఅర్బన్ : కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మొత్తం ఆవరణలో 24 కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే కెమెరాలను కలెక్టర్, డీఆర్వో కార్యాలయాల ముందు, వెనుక భాగాల్లో, హన్మకొండ తహసీల్దార్ కార్యాలయం, కాన్ఫరెన్స్‌హాల్, వీడియో కాన్ఫరెన్స్‌హాల్, ఈవీఎంలు భద్రపరిచే గోదాముతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో కలెక్టరేట్‌లో అపరిచిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు కార్యాలయాల వద్ద జనం రద్దీ, వాహనాల అపహరణ వంటి విషయాలు ఎప్పటికప్పుడు అధికారులు ప్రత్యక్షంగా గమనించే వీలుంటుంది. కాగా, కెమెరాలను కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసే టీవీకి అనుసంధానం చేయనున్నారు. ఇదిలా ఉండగా, కలెక్టర్ నివాసం వద్ద కూడా కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
వాహనాలు భద్రం..
కలెక్టరేట్‌లో కొద్ది రోజుల నుంచి దొంగతనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో కాన్ఫరెన్స్ హాల్ పక్కన ఉన్న నెట్‌వర్క్ రూంలో బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. అలాగే ప్రగతి భవనం వద్ద పార్కింగ్ చేసిన వాహనాలు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వీటితోపాటు కొద్ది రోజుల క్రితం ఎస్టీఓ సమీపంలో ఓ బైక్ చోరీకి గురైంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలతో దొంగతనాలు, అపరిచిత వ్యక్తులను పసిగట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.