క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి
* ఓటుకు కోట్లు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్
* లోతుగా దర్యాప్తు జరపాలంటూ ఏసీబీకి లేఖ
* దోషులెవరో తేలేవరకు సమగ్ర దర్యాప్తునకు ఆదేశం
* గవర్నర్‌తో సమావేశమైన సీఎం కేసీఆర్
* కేసు పురోగతిపై నివేదిక
* ముఖ్యమంత్రితో ఏసీబీ డీజీ రెండుసార్లు భేటీ
* మరిన్ని అరెస్టులు, మరికొందరికి నోటీసులంటూ జోరుగా ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఓటుకు కోట్లు’ కేసును కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరిపేందుకు రాష్ర్ట అవినీతి నిరోధక శాఖకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు కోట్లు ఆఫర్ చేసి అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలు ఇవ్వజూపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరికొందరు ఉన్నట్లుగా స్టీఫెన్‌సన్ చేసిన ఫిర్యాదును పూర్తిస్థాయిలో పరిశీలించాలని సీఈసీ సూచించింది. నిజాలు నిగ్గు తేల్చాలని, అసలు దోషులెవరో తేలేంత వరకు సమగ్ర దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంటూ ఏసీబీకి తాజాగా లేఖ రాసింది.
శాసనమండలి ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం పరిధిని దాటి ఏసీబీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ ఎలా చేస్తారని, ఈ కేసును ఎన్నికల సంఘమే విచారించాలని టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ నేతలంతా వాదించారు. ఈ నేపథ్యంలో ఏసీబీకి ఈసీ స్పష్టమైన సూచనలు చేయడం టీడీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడిన ట్లయింది. ఎన్నికల సంఘం నుంచి లేఖ అందిన విషయాన్ని ఏసీబీ అధికారికంగా ధ్రువీకరించింది. సీఈసీ పంపించిన లేఖను ఏసీబీకి చేరవేసినట్లు రాష్ర్ట ఎన్నికల సంఘం సీఈవో కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. గత నెల 31న రేవంత్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినప్పుడు అదే రోజు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు ఏసీబీ అధికారులు ఈసీకి ప్రాథమిక సమాచారం అందించారు. ఇటీవల రేవంత్‌ను కస్టడీలోకి తీసుకుని
విచారణ జరిపిన అనంతరం ఈ నెల 11న సీఈసీకి ఏసీబీ మరో నివేదికను పంపింది. కేసు పూర్వాపరాలతోపాటు ఈ బేరసారాల కుట్రలో ఎవరెవరి ప్రమేయముందనే వివరాలను అందులో పొందుపరచింది. ఎఫ్‌ఐఆర్, కేసు డైరీ వివరాలు, ప్రాథమిక ఆధారాలనూ ఈసీకి తెలియపరచింది. ఏసీబీ ఇచ్చిన నివేదికలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ కేసులో లోతుగా దర్యాప్తు కొనసాగించాలని తాజాగా పేర్కొంది.
ఎప్పటికప్పుడు కేంద్రానికి సమాచారం: ఈ కేసులో బుధవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డిని ఏసీబీ విచారించడం తదితర దర్యాప్తు వివరాలన్నింటినీ గవర్నర్ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ఇరుక్కున్నట్లు ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గవర్నర్ నుంచి సమాచారం కోరుతోంది.
అందుకే దర్యాప్తు పురోగతిని కేసీఆర్ ఎప్పటికప్పుడు గవర్నర్‌కు నివేదిస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్ అరెస్టు తర్వాత రెండు రోజులకోసారి గవర్నర్‌తో సీఎం భేటీ అవుతుండటం గమనార్హం. అంతకుముందే కేసీఆర్‌తో రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్ ఆయన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. ఈ కేసులో తాజా పరిణామాలను సీఎంకు నివేదించారు. ఇప్పటివరకు ఎవరెవరికి నోటీసులు జారీ చేశారనే వివరాలతో పాటు సీఈసీ లేఖ విషయాన్ని కూడా తెలిపారు. గవర్నర్‌తో భేటీ తర్వాత కేసీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఏకే ఖాన్‌ను మరోసారి పిలిపించి మాట్లాడారు. దీంతో ఈ కేసులో బుధవారం రాత్రి మరిన్ని నోటీసులు జారీ అవుతాయని, కొందరిని అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది.