సాక్షి, మంచిర్యాల : స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎస్‌జీఎస్‌వై) పథకాన్ని మరింత నవీకరించేందుకు కేంద్ర సర్కారు నడుం బిగించింది. ఈ పథకంలో మార్పు చేయడమే కాకుండా దాని స్థానంలో కొత్త పేరుతో మరో పథకాన్ని తీసుకువచ్చే దిశగా కసరత్తు సాగుతోంది. ఇందులో భాగంగా పెద్దఎత్తున రుణంతోపాటు అధిక సబ్సిడీని ఇచ్చే మార్గదర్శకాలను సిద్ధంచేస్తోంది. రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఆర్‌ఎల్‌ఎం) పేరుతో శాశ్వత ఉపాధి కల్పించేందుకు పథకాన్ని రూపొందించే దిశగా కసరత్తు వేగంగా జరుగుతోందని గ్రామీణాభివృద్ధి సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.
పల్లెల పరిపుష్టే ధ్యేయం..
పల్లెలను కరువు కాటేసిన స్థితిలో రైతులతోపాటు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు చెందిన యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గ్రామాల నుంచి హైదరాబాద్, ముంబై వంటి ప్రాంతాలకు వలసబాట పట్టిన వారున్నారు. ఇటీవల తెలంగాణ సర్కారు నిర్వహించిన సమగ్ర సర్వేకు హాజరైన వారిలో కొందరికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. ‘ఈ ఏడాది వానలు పడేట్లు లేవు. మేం కూడా మీ దగ్గరకు వచ్చి ఏదో పనిచేసుకుంటాం.
మాకు కూడా జర పని సూడుండ్రి’ అంటూ హైదరాబాద్, ముంబయి, భీవండి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి విన్నవించుకోవడం కనిపించింది. వలసలకు వెళ్లిన వారు సర్వేకు పెద్దఎత్తున తిరిగిరావడం సైతం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ పరిస్థితులన్నీ గమనించి సర్కారు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సమాయత్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉపాధి కల్పించే దిశగా ఒక పథకం రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించింది. ఇప్పటివరకు మహిళలకు, స్వయం ఉపాధి సంఘాలకు ఉపాధి కల్పించడంపైనే దృష్టిసారించిన గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ)ను ఇందుకు ఎంచుకున్నట్లు సమాచారం.
అధిక రుణం.. ఎక్కువ సబ్సిడీ..
కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎస్‌జీఎస్‌వై) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకు ద్వారా రాయితీ రుణాలిస్తున్నారు. ఈ రాయితీ అరకొరగా ఉండటంతో ఆశించిన స్థాయిలో నిరుద్యోగులు ఉపాధి పొందేందుకు ముందుకు రావడంలేదని సర్కారు భావించింది.
తాజాగా ఏర్పాటు చేయబోయే పథకంలో అధిక మొత్తంలో రుణ సదుపాయాన్ని కల్పించడంతోపాటు యూనిట్ కాస్ట్‌లో పెద్దఎత్తున రాయితీలు ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ చర్యల ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉపాధి యూనిట్లను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణాభివృద్ధి సంస్థ, ప్రపంచ బ్యాంకు నిధులతో ఐకేపీ ద్వారా చేసే పనులను సమష్టిగా ఒక్కరే నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో పాలన పరమైన అనుమతులతోపాటు ఉపాధి యూనిట్లు పెట్టుకున్న వారికి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడం మరింత సులభతరం కానుంది.
శాశ్వత ఉపాధికి..సర్కారు కసరత్తు
Published Wed, Aug 27 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement
Advertisement