కాళేశ్వరం.. ఆల్‌ క్లియర్‌! | central govt response to kaleshwaram project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం.. ఆల్‌ క్లియర్‌!

Published Sat, Nov 25 2017 1:11 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

central govt response to kaleshwaram project - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర అనుమతుల ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రాజెక్టుకు ఉన్న అవరోధాలన్నీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృషి, నిరంతర పర్యవేక్షణ ఫలితంగా దాదాపుగా తొలగిపోతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు నాలుగైదు రోజుల కింద ఢిల్లీలో కేంద్ర మంత్రులు, జల వనరుల శాఖ ఉన్నతాధికార యంత్రాంగంతో మంత్రి హరీశ్‌రావు జరిపిన మంత్రాంగం సత్ఫలితాలను ఇస్తోంది. గత నెల రోజుల్లోనే అత్యంత ముఖ్యమైన ఆరు రకాల కేంద్ర అనుమతులు మంజూరుకాగా.. శుక్రవారం ఇచ్చిన స్టేజ్‌–2 క్లియరెన్స్‌తో అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తయింది. మరో వారంలో కాస్ట్‌ అప్రైజల్, ఇరిగేషన్‌ ప్లానింగ్‌ అనుమతులు రానుండగా.. డిసెంబర్‌ నాటికి పర్యావరణ తుది అనుమతులు వచ్చే అవకాశముంది. ఇప్పటికే వేగంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులన్నీ.. అనుమతులన్నీ పూర్తికాగానే శరవేగాన్ని అందుకోనున్నాయి. 

అన్నీ మంచి శకునములే!
కాళేశ్వరం ప్రాజెక్టుకు శుక్రవారం కేంద్ర అటవీ శాఖ కీలకమైన స్టేజ్‌–2 అనుమతులు ఇచ్చింది. ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లు, టన్నెళ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా రెవెన్యూ భూముల బదలాయింపు.. ఆ భూముల్లో నిర్దేశించిన మేర తిరిగి మొక్కల పెంపకానికి సంబంధించి ప్రభుత్వం రూ.722.30 కోట్లు మంజూరు చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు స్టేజ్‌–2 అనుమతులిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ నిశీత్‌ సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే వారం కాస్ట్‌ అప్రైజల్, ఇరిగేషన్‌ ప్లానింగ్‌కు సంబంధించిన అనుమతులు వచ్చే అవకాశముంది. మొత్తంగా కేంద్ర జల వనరుల మంత్రిగా నితిన్‌ గడ్కరీ పగ్గాలు చేపట్టడం.. ఆయనతో మంత్రి హరీశ్‌రావు నిత్యం సంప్రదింపులు జరుపుతుండటంతో ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ వేగం పుంజుకుంది.

నెల రోజుల్లోనే ఆరు అనుమతులు
రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లోని సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతోపాటు 18.82 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా రూ.80,499.71 కోట్ల వ్యయ అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరి నుంచి 180 టీఎంసీలను వినియోగించుకునేలా రూపొందించిన ఈ ప్రాజెక్టులో భాగంగా.. మొత్తంగా 147.71 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన 25 రిజర్వాయర్లను నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణానికి భూసేకరణ, అటవీ అవసరాలు భారీగా ఉన్నాయి. మొత్తంగా ప్రాజెక్టు పరిధిలో 74,315.28 ఎకరాల భూసేకరణ, 7,920.32 ఎకరాల (3,168.13 హెక్టార్లు) అటవీ భూమి అవసరం కావడంతో... జాతీయ స్థాయిలో 18 డైరెక్టరేట్ల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. అందులో పర్యావరణ, అటవీ, హైడ్రాలజీ, కాస్ట్‌ అప్రైజల్, అంతర్రాష్ట్ర, ఇరిగేషన్‌ ప్లానింగ్, భూగర్భజల విభాగం అనుమతులు కీలకమైనవి. వీటిలో గత నెల రోజుల వ్యవధిలోనే స్టేజ్‌–1 అటవీ అనుమతులు, హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అనుమతి, భూగర్భజల విభాగం, యంత్ర నిర్మాణ సంప్రదింపు సంస్థ అనుమతులు లభించాయి. అన్నింటికీ మించి కాళేశ్వరాన్ని పాత (నిర్మాణంలోని) ప్రాజెక్టుగానే గుర్తిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా స్టేజ్‌–2 అటవీ అనుమతులు వచ్చాయి.

ప్రత్యామ్నాయ చర్యల నేపథ్యంలో..
కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూములకు పరిహారంగా 3,367.13 హెక్టార్ల రెవెన్యూ భూమిని ఇవ్వడంతోపాటు, మొక్కల పెంపకం కోసం రూ.722.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ నెల 8న నిర్ణయం తీసుకుంది. దీంతో జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, బాన్సువాడ, నిర్మల్‌ జిల్లాల్లోని అటవీ భూముల బదలాయింపునకు మార్గం సుగమమైంది. ఆ భూముల్లో హెక్టారుకు 1,600 మొక్కల చొప్పున మొత్తంగా 50.69 లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటామని.. అటవీ జంతువుల సంచారానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీశాఖకు హామీ ఇచ్చింది. దీంతోపాటు అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూముల్లో భవిష్యత్తులో ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా చూసుకుంటామని, జంతు పరిరక్షణ చట్టం–1972ను పక్కాగా అమలు చేసే బాధ్యత కూడా తీసుకుంటామని తెలిపింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న అటవీ శాఖ స్టేజ్‌–2 అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్రం హామీ ఇచ్చిన మేరకు మొక్కల పెంపకం, పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని, వన్యప్రాణుల రక్షణ బాధ్యతనూ నిర్వర్తించాలని నిబంధనలు పెట్టింది. పరిహారంగా ఇచ్చే భూముల్లో భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు లేకుండా చూడాలని ఆదేశించింది.

త్వరలోనే మిగతా అనుమతులు
ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ తుది అనుమతులే ముఖ్యమైనవి. ప్రస్తుతం ట్రిబ్యునల్‌ కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అనుమతుల అంశాన్ని సీరియస్‌గా పరిగణిస్తోంది. అయితే కేంద్ర పర్యావరణ శాఖ ఈ ఏడాది పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ), పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ)లు సిద్ధం చేసేందుకు మార్చి 28న టీవోఆర్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అందులోని మార్గదర్శకాలకు అనుగుణంగా ఈఐఏ, ఈఎంపీ నివేదికలు రూపొందించి సమర్పించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆ నివేదికలను ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెలలోగానీ పరిశీలించి తుది అనుమతులు ఇవ్వనుంది. ఇక కాస్ట్‌ అప్రైజల్, ఇరిగేషన్‌ ప్లానింగ్‌లకు సంబంధించి ఇదివరకే అన్ని అంశాలపై ఆయా డైరెక్టరేట్లకు వివరణలు పూర్తయిన నేపథ్యంలో.. వచ్చే వారం అనుమతులు అందే అవకాశముంది. ఇక బ్యారేజీ కాల్వల డిజైన్, గేట్లు, హైడ్రో సివిల్‌ డిజైన్, కాంక్రీట్‌ మాసోనరీ డ్యామ్‌ డిజైన్‌ వంటి మూడు నాలుగు అంశాలకు సంబంధించి సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ అనుమతులు రావాలి.

అడ్డుపడే శక్తులకు ఇది చెంపపెట్టు: హరీశ్‌రావు
కోర్టు కేసులతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు అనుమతుల మంజూరు చెంపపెట్టు అని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో అన్నారు. మిగతా డైరెక్టరేట్ల నుంచి కూడా అనుమతులు త్వరగా సాధించాలని తమ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.

ఫలించిన కేసీఆర్‌ త్రిముఖ వ్యూహం
18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు వీలయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ రీడిజైన్‌ చేశారు. అందులో భాగంగా త్రిముఖ వ్యూహాన్ని రూపొందించారు. ఏకంగా 142 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను నిల్వ చేసుకొనేలా రిజర్వాయర్లను చేపట్టి.. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రెండు పంటలు పండించేలా మొదటి వ్యూహాన్ని ఖరారు చేశారు. ఇక మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు, అటు నుంచి లోయర్‌మానేరుకు నీటిని తరలించి.. 8.5 లక్షల ఎకరాలకు నీరందించడం రెండో వ్యూహంగా ఉంది. నీటి లభ్యత తగ్గిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పునరుజ్జీవం ఇవ్వడం మూడో వ్యూహంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా 2018 జూన్‌ నాటికే కాళేశ్వరం నీటిని మిడ్‌మానేరు ప్రాజెక్టుకు అనుసంధానించడం, శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకంతో 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం లక్ష్యంగా కేసీఆర్‌ నీటిపారుదల శాఖను పరుగులు పెట్టిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన అంశాలు
ప్రాజెక్టు పరిధిలో కొత్త ఆయకట్టు: 18.25 లక్షల ఎకరాలు
స్థిరీకరించే ఆయకట్టు: 18.82 లక్షల ఎకరాలు
నీటి సరఫరా మార్గం పొడవు: 1,832 కిలోమీటర్లు
వాలు కాల్వల పొడవు: 1,531 కిలోమీటర్లు
టన్నెళ్ల పొడవు: 203 కిలోమీటర్లు
ప్రెషర్‌ పైప్‌లైన్‌ పొడవు: 98 కిలోమీటర్లు
ప్రాజెక్టు మొత్తం నీటి వినియోగం: 225 టీఎంసీలు
నీటిని ఎత్తిపోసే లిఫ్టులు: 20
పంపుహౌజ్‌లు: 19
అవసరమయ్యే విద్యుత్‌: 4,627.24 మెగావాట్లు
సిద్ధంగా ఉన్న జలాశయాలు: 5
కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు: 20
మొత్తం నిల్వ సామర్ధ్యం: 147.71 టీఎంసీలు

ప్రాజెక్టు నీటి వినియోగం ఇలా.. (టీఎంసీల్లో)
కొత్త ఆయకట్టుకు సాగునీరు: 134.5
ఆయకట్టు స్థిరీకరణ: 34.5
హైదరాబాద్‌ తాగునీటి సరఫరాకు: 30
దారిలోని గ్రామాలకు తాగునీరు: 10
పారిశ్రామిక అవసరాలకు: 16
మొత్తం నీటి వినియోగం: 225
(మేడిగడ్డ వద్ద తీసుకునే జలాలతోపాటు మధ్యలో నీటి వనరులు కలిపి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement