హైదరాబాద్: తెలంగాణను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ పై అంచనావేసేందుకు కేంద్రం వైద్య బృందం గురువారం గాంధీ ఆస్పత్రిని సందర్శించింది. ఆస్పత్రి లోని ఐసోలేషన్ వార్డును పరిశీలించింది. అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్టు బృందం తెలిపింది. ఈ బృందంలో జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ అశోక్ కుమార్, అదనపు డైరెక్టర్ శశిరేఖతో పాటు సమీకృత వ్యాధుల పర్యవేక్షణ కార్యక్రమం అధికారి డాక్టర్ ప్రదీప్ ఖస్నోబిస్ లు ఉన్నారు.
వీరితో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడా గాంధీలో పర్యటించారు. అక్కడ చికిత్స పొందుతున్న స్వైన్ ఫ్లూ బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గాంధీ, ఉస్మానియాలోని ఐసోలేషన్ వార్డులను బీబీనగర్ నిమ్స్ కు తరలించాలన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ తో ఆయన ఫోన్ లో సంప్రదించారు.