నిర్మలాసీతారామన్‌తో భేటీ అయిన రాంచందర్ రావు, ప్రభాకర్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, చింతల
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఆశించిన స్థాయిలో నిధులు అందటం లేదని తరచూ ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులు చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం వ్యూహం రచిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి వాడిన పదాలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ నాయకత్వం టీఆర్‌ఎస్ సర్కార్‌పై ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. కొంతకాలంగా ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా పెద్దగా పట్టించుకోని కాషాయ దళం.. ఇప్పుడు మోదీపై సీఎం కేసీఆర్ మాటలతో ఆగ్రహంగా ఉంది. రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ బాహాటంగానే కేసీఆర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యమేర్పడింది.
ఇచ్చిన నిధులపై ప్రజలకు వివరణ
నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన నిధులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్రానికి భారీగానే నిధులు విడుదలయ్యాయని, అందులో కొన్ని కీలక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా సరిగా అమలు చేయటం లేదని కేంద్రం భావిస్తోంది. తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన నిధులపై కేంద్ర మంత్రులు శాఖలవారీగా హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించి.. మంజూరు చేసిన నిధులు, అందులో ఇప్పటి వరకు విడుదలైన మొత్తం, వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం ఎంతో బహిర్గతం చేయాలని తాజాగా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా మంచి ఫలితాలను ఇస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం తెలంగాణలో సరిగా అమలు కావటం లేదని ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇలాంటి ముఖ్యమైన పథకాలు ఇక్కడ సరిగా అమలు కాకపోవటం వల్ల బీజేపీకి మంచిపేరు రాకుండా పోతోందని ఆ పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి చౌదరీ బీరేంద్రసింగ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర నేతలతో నిర్మలాసీతారామన్ భేటీ
గురువారం నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సీఎం కామెంట్లపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ శుక్రవారం పార్టీ రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మాజీ గవర్నర్ దివంగత వి.రామారావు ఇంట్లో అల్పాహార సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు నగరంలో సమీక్షలు నిర్వహించే విషయంపై ఆమె వారికి స్పష్టతనిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం కావాలనే కేంద్రంపై పనిగట్టుకుని ఆరోపణలు చేస్తోందన్న నిర్ణయానికొచ్చారు. ఈ విషయం ఇప్పటికే ప్రధాని మోదీ దృష్టికి వెళ్లిందని పేర్కొన్నారు.
అమిత్‌షాకు సీఎం కామెంట్ల వీడియో..
ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ ఏకవచన సంబోధన, కించపరిచేలా మాట్లాడినట్టుగా ఉన్న వీడియో క్లిప్పింగ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు పంపారు. అందులో సీఎం మాట్లాడిన మాటల వివరాలను, కొంతకాలంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంపై, ప్రధానిపై చేస్తున్న విమర్శల వివరాలతో కూడిన లేఖను జతచేశారు.
Comments
Please login to add a commentAdd a comment