గోదావరి జలాలను వినియోగించుకుంటున్న కొత్త, పాత ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్)లు తమకు సమర్పించాలని పదేపదే కోరుతు న్నా..
► గోదావరి ప్రాజెక్టులపై కేంద్ర జలవనరులశాఖకు బోర్డు మొర
► తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వడం లేదని ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను వినియోగించుకుంటున్న కొత్త, పాత ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్)లు తమకు సమర్పించాలని పదేపదే కోరుతు న్నా.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పందన కొరవడిందని గోదావరి బోర్డు కేంద్ర జలవనరులశాఖకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల నీటి వినియోగ వివరాలు చెబితేనే నీటి ప్రణాళిక ఖరారు సులువవుతుందని స్పష్టం చేస్తున్నా పట్టించుకోవడం లేదని పేర్కొంది.
ఈ మేరకు కేంద్రం జోక్యం చేసుకోవాలని బుధవారం రాత్రి గోదావరి బోర్డు చైర్మన్ హెచ్‌కే సాహూ కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల సహా సీతారామ, తుపాకుల గూడెం, ప్రాణహితతో పాటు ఇప్పటికే చేపట్టిన దేవాదుల, ఎస్సారెస్పీ స్టేజ్–2, వరద కాల్వ తదితర ప్రాజెక్టుల వివరాలు కోరింది. ఇక ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నం, తాడిపూడి, పుష్కర, వెంకటనగరం, పట్టిసీమ, భూపతిపాలెం, ముసురుమల్లితో పాటు సీలేరు, శబరిపై చేపట్టిన హైడ్రో ప్రాజెక్టుల వివరాలు అందించాలని కోరింది. దీనిపై ఇరు రాష్ట్రాలు ఇంతవరకు స్పందించలేదు.
రాష్ట్రం తరఫున కాళేశ్వరం ఎత్తిపోతలపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బోర్డుకు వివరణ పంపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తది కాదని అందులో స్పష్టం చేశారు. ఇక తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతలపైనా తెలంగాణ ఇప్పటికే బోర్డు సమావేశాల్లోనూ, లేఖల ద్వారా వివరణ ఇచ్చింది. అయితే ఈ అంశాలను బోర్డు పరిగణనలోకి తీసుకోలేదు. తమకు ప్రాజెక్టుల పూర్తి డీపీఆర్‌లు అందించాల్సిందేనని స్పష్టం చేసింది.