
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న సుమారు 3 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల రౌండ్‌టేబుల్ సమావేశం హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 3లక్షల మందికి దాదాపు రూ.440 కోట్లు అగ్రిగోల్డ్ నుంచి రావాల్సి ఉందన్నారు. వారిని ఆదుకునే దిక్కులేక ఆర్తనాదాలు చేస్తున్నారని అన్నారు.
ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేక బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఉన్నతాధికారులతో ఒక కమిటీని వేయాలని, బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలను తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి కోరారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, నేతలు వెంకటరెడ్డి, తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి, బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉందన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం పేరుతోపాటు, వారి బినామీలపై ఉన్న ఆస్తులను జప్తుచేసి, బాధితులకు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment