బాబు, రామోజీ మధ్యలో రవిప్రకాశ్‌ | Chandrababu Naidu Helping TV9 Ravi Prakash | Sakshi
Sakshi News home page

బాబు, రామోజీ మధ్యలో రవిప్రకాశ్‌

Published Thu, May 16 2019 1:07 AM | Last Updated on Thu, May 16 2019 7:54 AM

Chandrababu Naidu Helping TV9 Ravi Prakash - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫోర్జరీ కేసును ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. రవిప్రకాశ్‌ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఈనాడు’చైర్మన్‌ రామోజీరావును కలిశారు. విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా ఫిల్మ్‌సిటీకి వచ్చిన చంద్రబాబు దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై రామోజీరావుతో చర్చలు జరిపారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై అరెస్ట్‌ వారంట్‌ జారీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో బాబు, రామోజీరావు కలయిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీ9 సీఈవోగా తన ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా ప్రాధాన్యత ఇవ్వకుండా వెనకేసుకొచ్చిన రవిప్రకాశ్‌పై కేసులు వద్దంటూ ఇప్పటికే రెండు, మూడు సార్లు టీవీ9 కొత్త యాజమాన్యానికి చంద్రబాబు సూచించారు.

కొత్త యాజమాన్యంలో ముఖ్యుడైన ఓ పారిశ్రామికవేత్తను విజయవాడకు పిలిపించి బెదిరించినట్లు కూడా తెలిసింది. అయినా కొత్త యాజమాన్యం తనమాట ఖాతరు చేయకపోవడంతో నేరుగా రంగంలోకి దిగారు. తను రాజగురు రామోజీరావు ద్వారా కొత్త యాజమాన్యానికి నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కొత్త యాజమాన్యంలో ప్రధాన భాగస్వామి రామేశ్వరరావుకు రామోజీరావుకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. రామోజీరావు ద్వారా రాయబారం నెరుపుతున్నారు. పరారీలో ఉన్న రవిప్రకాశ్‌పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. టీవీ9 నిధులను యథేచ్చగా ఓ టీవీ ఛానల్‌ ఉద్యోగుల జీతభత్యాలకు, తాను వ్యక్తిగతంగా నడుపుతున్న ఓ పత్రిక ఖర్చులకు వినియోగించినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో రవిప్రకాశ్‌కు ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో చంద్రబాబు రంగంలోకి దిగినట్టున్నారని ఓ సీనియర్‌ పోలీసు అధికారి అన్నారు.
 
చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ
చంద్రబాబుకు టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్‌ అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అవసరమైన సందర్భాలలో రవిప్రకాశ్‌ ద్వారా టీవీ9ను వాడుకుంటూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్‌పై చంద్రబాబు దుష్ప్రచారానికి పాల్పడ్డారు. సీబీఐ దర్యాప్తు సమయంలోనూ జగన్‌ నివాసమైన లోటస్‌పాండ్‌లో స్విమ్మింగ్‌ పూల్‌ ఉందంటూ, ఇంట్లో బార్‌ ఉందంటూ టీవీ9 ద్వారా చంద్రబాబు అసత్య ప్రచారం చేయించారు. రాజకీయంగా ఎదురీదుతున్న సమయంలో తన ప్రత్యర్థి జగన్‌ను దెబ్బతీయడానికి రవిప్రకాశ్‌ జరిపిన అసత్య ప్రచారానికి బదులుగా.. ఇప్పుడు ఆయన్ను కాపాడేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రామేశ్వరరావుపై ఒత్తిడి తేవడానికి వీలుగా రామోజీరావును చంద్రబాబు ఎంచుకున్నాడు. అయితే, ఈ విషయంలో రామోజీరావు ఎంతమేరకు సహకరిస్తారన్నది వేచి చూడాల్సిందే.
 
జాతీయ రాజకీయాలపైన చర్చ
ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు జాతీయ రాజకీయాలపైన చంద్రబాబు, రామోజీరావు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ వ్యూహం ఎలాగుంటే బాగుంటుందన్న అంశాన్నీ చర్చించినట్లు సమాచారం. ఎన్డీయే నుంచి బయటకు రావడంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని రామోజీరావు అభిప్రాయపడినట్లు తెలిసింది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే కలిసిపోవడమే మంచిదనే అభిప్రాయం వీరిద్దరి మధ్య చర్చల్లో వ్యక్తమైనట్లు సమాచారం.
 
రవిప్రకాశ్‌కు ఎదురుదెబ్బ
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై పోలీసులు సీఆర్‌పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న ఆయన తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సీఆర్‌పీసీలోని 154 సెక్షన్‌ చెల్లుబాటును ప్రశ్నిస్తే.. ఇప్పటికిప్పుడు విచారణ చేయాల్సిన అవసరమేమీ లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. రవిప్రకాశ్‌పై పోలీసులు 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని, పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితులు ఉంటే ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న ధర్మాసనం.. విచారణను వచ్చే జూన్‌కు వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement