
కొత్త ప్రభాకర్‌రెడ్డి
తెలంగాణ టీడీపీ నేతలకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతానికి దక్కాల్సిన విద్యుత్తును దక్కకుండా కుట్రలు పన్నుతున్న ఆంధ్ర సీఎం చంద్రబాబును నిలదీయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
తెలంగాణలో విద్యుత్ సమస్యకు ఏపీ సీఎం చంద్రబాబే కారణం
తెలంగాణ టీడీపీ నేతలపై మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజం
గజ్వేల్: తెలంగాణ టీడీపీ నేతలకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతానికి దక్కాల్సిన విద్యుత్తును దక్కకుండా కుట్రలు పన్నుతున్న ఆంధ్ర సీఎం చంద్రబాబును నిలదీయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో పత్తిపంట ఎండిపోయిన కారణంగా గుండె ఆగి మృతి చెందిన మామిడాల కిష్టయ్య కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం గజ్వేల్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ లోయర్ సీలేరు ప్రాజెక్టు నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్తులో వాటాను చంద్రబాబు అడ్డుకున్నారన్నారు.
అయినప్పటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ. 8లకు యూనిట్ చొప్పున విద్యుత్తును కొనుగోలు చేసి, వ్యవసాయానికి ఏడు గంటల సరఫరా చేస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన విద్యుత్తు వాటాను సాధించడంలో విఫలమైందన్నారు. ఈ రెండు పార్టీలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు. విద్యుత్ సరఫరా, రుణమాఫీ విషయంలో రైతులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరంలేదన్నారు. రుణమాఫీని వందశాతం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సమావేశంలో గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్ ఎంపీపీ ఏలేశ్వరం చిన్నమల్లయ్య, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
10లోగా రుణమాఫీ పూర్తిచేయాలి
వచ్చే నెల 10లోగా రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి బ్యాంకర్లను సూచించారు. శనివారం గజ్వేల్‌లోని ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) కార్యాలయంలో ఓఎస్‌డీ హన్మంతరావు, నాబార్డు ఏజీఎం రమేశ్‌కుమార్, గజ్వేల్ నియోజకవర్గంలోని బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నియోజకవర్గంలో కొత్తగా నాబార్డు ఆధ్వర్యంలో చేపట్టనున్న డెయిరీ, కూరగాయల పెంకపం తదితర పథకాలపై ఆయన చర్చించారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
జగదేవ్‌పూర్: మండలంలోని నర్సన్నపేట గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కొండయ్య కుటుంబాన్ని శనివారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొండయ్య అత్మహత్యకు గల కారణాలను ఆయన భార్యను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ అప్పుల బాధతో అత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వర్షభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపొవడంతో రైతు లు ఆధైర్యంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
ఆత్మహత్యలకు పాల్పడవద్దని, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే రుణమాఫీ చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపతి అన్నారు. ప్రతి పక్షాలు నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చి అభివృద్ధికి సహకరించాలని ప్రతి పక్షాలకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గుండా రంగారెడ్డి, భూంరెడ్డి, గజ్వేల్ మున్సిపాల్ చైర్మన్ భాస్కర్, జెడ్పీటీసీ రాంచంద్రం, మండలాధ్యక్షుడు యాదవరెడ్డి, సర్పంచ్ జమునాబాయి, సుధాకర్‌రెడ్డి, కరుణకర్, నాయకులు ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లయ్య, అంజనేయులు, నర్పింలుగౌడ్, తదితరులు ఉన్నారు.