
గవర్నర్‌ను తప్పించండి
- కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడి!
- ‘ఓటుకు కోట్లు’ కేసులో సహకరించకపోవడంతో ఆగ్రహం
- మిత్ర పక్ష బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు.. సాధ్యం కాకపోవచ్చని సమాచారం
- సెక్షన్-8పై మధ్యేమార్గం పాటించాలని కేంద్రం నిర్ణయం
- ఆమేరకు గవర్నర్‌కు కేంద్ర హోంమంత్రి మార్గనిర్దేశం
- రాజ్‌నాథ్‌సింగ్‌తో మూడుసార్లు భేటీ అయిన నరసింహన్
- సెక్షన్-8 ఉల్లంఘన జరగలేదని నివేదించిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను తప్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో నిండా కూరుకుపోయిన తర్వాత కాలంలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు టెలిఫోన్‌లో మాట్లాడిన సంభాషణల ఆడియో బయటకుపొక్కిన తర్వాత నుంచి టీడీపీ గవర్నర్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసు వ్యవహారంలో గవర్నర్ సహకరించడం లేదని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత టెలిఫోన్ల ట్యాపింగ్, హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సంబంధించి విభజన చట్టంలోని సెక్షన్-8 ను చంద్రబాబు తెరమీదకు తెచ్చారు. ఇవే అంశాలపై ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితోపాటు పలువురు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై గవర్నర్ కేంద్రానికి స్పష్టమైన నివేదిక ఇచ్చారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను మార్చాలని కేంద్రంలోని తన మిత్రపక్ష బీజేపీ నేతలపై చంద్రబాబు తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
అందుకే గడచిన కొద్ది రోజులుగా చంద్రబాబు రాజ్‌భవన్‌కు వెళ్లడానికి కూడా ఇష్టపడటం లేదని చెబుతున్నారు. ఆ కారణంగానే కొద్దిరోజుల కిందట విభజన చట్టంలోని సెక్షన్- 8పై గవర్నర్ సలహాదారులను తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారే తప్ప గవర్నర్‌ను కలవడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. అయితే అత్యంత కీలకమైన ‘ఓటుకు కోట్లు’ కేసు విచారణ సాగుతున్న దశలో నరసింహన్‌ను తప్పించి మరొకరిని నియమించడం సాధ్యం కాకపోవచ్చని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం.
సెక్షన్-8పై మధ్యేమార్గం... ఢిల్లీ దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలుపై మధ్యేమార్గం అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గవర్నర్‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొన్ని స్పష్టమైన సూచనలతో మార్గనిర్దేశనం చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఎటువంటి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, న్యాయస్థానం, విచారణ సంస్థలు చూసుకుంటాయని రాజనాధ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
అయితే జంటనగరాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తిన సమయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, తెలంగాణ డీజీపీ నుంచి నివేదికలను తెప్పించుకుని, తదుపరి చర్యల కోసం తెలంగాణ కేబినెట్‌కు సిఫారసు చేయాల్సిందిగా గవర్నర్‌కు సూచించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి గతంలోనే ముసాయిదా నోట్ సిద్ధమయినప్పటికీ ఆ నోట్‌లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ కూడా పాల్గొంటారని ఉండటంపై తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రా డీజీపీని మినహాయించి జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, తెలంగాణ డీజీపీ నుంచి గవర్నర్ నివేదికలను తెప్పించుకోవచ్చునని కేంద్ర హోంశాఖ తాజాగా సూచించినట్లు సమాచారం. ఏదైనా అధికారి శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో చర్యలు తీసుకోని పక్షంలో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ కేబినెట్‌కు గవర్నర్ సిఫార్సు చేయవచ్చునని కేంద్ర హోంశాఖ సూచించినట్లు తెలిసింది.
సెక్షన్-8 ఉల్లంఘన జరగలేదని నివేదించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుక్రవారం న్యూఢిల్లీలో భేటీలపై భేటీలతో బిజీ అయ్యారు. శుక్రవారం ఉదయం 10.40 గంటలకు హోం మంత్రిత్వశాఖ కార్యాలయం ఉన్న నార్త్‌బ్లాక్‌కు వెళ్లిన గవర్నర్ హోంమంత్రి రాజ్‌నాథ్, హోం కార్యదర్శి ఎల్.సి.గోయల్‌తో కలిసి ఉమ్మడిగా, ఇరువురితో ఏకాంతంగా పలుమార్లు సమావేశమయ్యారు. ఈ వరుస భేటీల్లో సెక్షన్-8 అమలు సాధ్యాసాధ్యాలపైనే ప్రధానంగా చర్చజరిగినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు భారత రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 పుస్తకాలను వెంటతీసుకెళ్లి సెక్షన్-8లోని విషయాలను అంశాలవారీగా రాజ్‌నాథ్‌కు వివరించినట్టు సమాచారం.
రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్-8కి సంబంధించి స్పష్టంగా ప్రస్తావన ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయడంలేదని హోంమంత్రి గవర్నర్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే ఏడాది కాలంలో తెలంగాణలోకానీ, హైదరాబాదులో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాలేదని, సెక్షన్-8 ఎక్కడా ఉల్లంఘన జరగలేదని గవర్నర్ నివేదించినట్టు సమాచారం. విభజన చట్టంలోని షెడ్యూల్(9), (10) ఉమ్మడి ఆస్తులు, సంస్థల పంపకం త్వరితగతంగా పూర్తిచేయాలని, ఏపీలో జూన్-2 లోపు అమలు చేయాల్సిన అంశాలకు సంబంధించి టాస్క్‌ఫోర్స్‌ను అపాయింట్ చేయాలని కూడా గవర్నర్ కోరినట్టు తెలిసింది. ఇక రాజ్యసభ సభ్యురాలు, నజ్మా హెప్తుల్లాను గవర్నర్‌గా నియమిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని హోంశాఖ వర్గాలు కొట్టిపారేశాయి.
సమావేశంలో సంచలనం లేదు: గవర్నర్
హోం మంత్రి, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులతో వరస భేటీలు నిర్వహించిన గవర్నర్ నరసింహన్‌ను సమావేశంలో విశేషాలపై పలకకరించగా.. మీరనుకున్నట్టు సంచలనం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఏజీ లేఖలపై ప్రస్తావించగా... మీరే రాశారు, మీరే వేశారని, వాటికి తాను బాధ్యున్ని కాదని చెప్పారు. ఓటుకు కోట్లు అంశాన్ని ప్రస్తావించగా... విచారణ జరుగుతోంది కదా అంటూ బదులిచ్చారు.