రాజ్‌భవన్‌కు చార్జిషీట్‌ | Cash for vote case: Charge Sheet submitted to governor by ACB | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌కు చార్జిషీట్‌

Published Thu, Mar 2 2017 1:49 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

రాజ్‌భవన్‌కు చార్జిషీట్‌ - Sakshi

రాజ్‌భవన్‌కు చార్జిషీట్‌

ఓటుకు కోట్లు కేసులో కొత్త కోణం
- ప్రభుత్వంలో హాట్‌ టాపిక్‌గా మారిన వ్యవహారం
- గతనెల 18న అదనపు చార్జిషీట్‌ దాఖలు చేసిన ఏసీబీ
- రిటైర్‌ అయిన తర్వాత ఆఫీసుకు వెళ్లి కేసుపై ఏసీబీ మాజీ డైరెక్టర్‌ సమీక్ష
- అదేరోజు ఏసీబీ చార్జిషీట్‌ దాఖలు
- అభియోగపత్రాల కాపీలు కావాలని కోరిన రాజ్‌భవన్‌
- సర్కారుకు సమాచారం లేకుండా రాజ్‌భవన్‌కు వెళ్లి ఇచ్చిన డైరెక్టర్‌
- తమకు తెలియకుండా ఇచ్చినందుకు ప్రభుత్వం గుర్రు.. డైరెక్టర్‌పై బదిలీ వేటు
- చార్జిషీట్‌ కాపీలు అందిన తర్వాత గవర్నర్‌ ఢిల్లీ టూర్‌
- రాష్ట్రపతి, ప్రధాని, అటార్నీ జనరల్, సీజేఐలతో భేటీ


సాక్షి, హైదరాబాద్‌

ఓటుకు కోట్లు కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఇటీవల ఈ కేసులో అదనపు చార్జిషీట్‌ దాఖలు చేయడం.. ఆ చార్జిషీట్‌ కాపీ రాజ్‌భవన్‌కు చేరడం సంచలనాత్మకంగా మారింది. ఏసీబీ డైరెక్టర్‌ చారుసిన్హాను నేరుగా రాజ్‌భవన్‌కు పిలిపించుకుని అక్కడి అధికార వర్గాలు చార్జిషీట్‌ కాపీలు తీసుకున్న వైనం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆలస్యంగా వచ్చింది.

కీలకమైన కేసు, పైగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో రాజ్‌భవన్‌ వర్గాలు ఎందుకు చార్జిషీట్‌ తెప్పించుకున్నాయో తెలియక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లోలోన ఆందోళనకు గురవుతున్నాయి. రాజ్‌భవన్‌ అదనపు చార్జిషీట్‌ కాపీ తెప్పించుకున్న ఈ తాజా ఎపిసోడ్‌ వెనుక కథేంటి? అసలు ఏం జరిగి ఉంటుందన్న కోణంలో పోలీసు ఉన్నతాధికారవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏసీబీ డైరెక్టర్‌ నుంచి చార్జిషీట్‌ తెప్పించుకున్న కొద్ది రోజులకే గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం గమనార్హం.

చెప్పనందుకే చారుసిన్హాపై వేటు!
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఒక్కరే కావడంతో రాజ్‌భవన్‌ నుంచి ఏ ఆదేశాలు వెలువడ్డా పోలీసు ఉన్నతాధికారులు తక్షణం స్పందించాల్సిందే. ఏ వ్యవహారంపైనైనా రాజ్‌భవన్‌ వర్గాలు నేరుగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఈ రెండున్నరేళ్లలో చాలాసార్లు జరిగింది. పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులను రాజ్‌భవన్‌కు పిలిపించుకుని గవర్నర్‌ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. అదే మాదిరి ఇటీవల రాజ్‌భవన్‌ నుంచి ఏసీబీ డైరెక్టర్‌కు ఫోన్‌ వచ్చింది. ఓటుకు కోట్లు కేసులో ఇటీవల దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌ కాపీ కావాలన్న ఆదేశం అందులో ఉంది.

దీంతో హుటాహుటిన చార్జిషీట్‌ కాపీలు తీసుకొని అప్పటి డైరెక్టర్‌ చారుసిన్హా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ కార్యాలయంలో అందజేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అసలు ట్విస్ట్‌ అక్కడే మొదలైంది. రాజ్‌భవన్‌ కార్యాలయం కీలకమైన కేసులో చార్జిషీట్‌ కాపీలు అడిగితే తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. గవర్నర్‌ అడగడంలో తప్పులేదని, అయితే ఆ విషయాన్ని దాచిపెట్టడమే ఆ అధికారి చేసిన తప్పు అని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంకేదైనా విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారేమోనని భావించి.. ఏసీబీ డైరెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

మాజీ డీజీ సమీక్ష.. అదేరోజు చార్జిషీట్‌
ఏసీబీకి గతంలో డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌ ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు. అయితే సర్వీసులో ఉన్నంత వరకే ఆయనకు పర్యవేక్షణ అధికారం ఉంటుంది. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనతో ఆ విభాగానికి ఎలాంటి సంబంధం, కేసులో జోక్యం ఉండకూడదు. కానీ పదవీ విరమణ చేసిన సరిగ్గా నెలన్నర తర్వాత ఖాన్‌ ఏసీబీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అప్పటి డైరెక్టర్‌ చారుసిన్హాకు కనీస సమాచారం లేకుండా కేసుకు సంబంధించి సంబంధిత అధికారులతో రెండున్నర గంటల పాటు సమీక్ష నిర్వహించారు. అదే రోజు సాయంత్రం.. దర్యాప్తు అధికారులు న్యాయస్థానంలో అదనపు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారం తెలుసుకున్న చారుసిన్హా తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎంత సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయినా.. పదవీ విరమణ తర్వాత తన ఆధ్వర్యంలో ఉన్న విభాగానికి వచ్చి తనకు తెలియకుండా కీలకమైన కేసులో సమీక్ష చేసి చార్జిషీట్‌ వేయమని చెప్పడంతో ఆమె అసహనానికి గురయ్యారు. ఇదే వ్యవహారంపై ఉన్నతాధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

రాజ్‌భవన్‌కు కాపీలు అందుకేనా?
పదవీ విరమణ పొందిన తర్వాత సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వ్యవహరించిన తీరు రాజ్‌భవన్‌ దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని రాజ్‌భవన్‌ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నేరుగా అదనపు చార్జిషీట్‌ కాపీలు తెప్పించుకొని పరిశీలించి ఉంటారని అటు ఏసీబీ వర్గాలు, ఇటు పోలీస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సమీక్షకు అప్పటి డైరెక్టర్‌ సహకరించలేదని ప్రభుత్వానికి మాజీ డీజీ ఫిర్యాదు చేసినట్టు చర్చ జరుగుతోంది. అటు రాజ్‌భవన్‌కు కాపీలు పంపడం, ఇటు మాజీ డీజీకి సహకరించకపోవడంతో ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

గవర్నర్‌ ఢిల్లీ టూర్‌పై ఆసక్తికర చర్చ
ఏసీబీ గతనెల 18న ఓటుకు కోట్లు కేసులో అదనపు చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆ మరుసటి రోజున రాజ్‌భవన్‌కు చార్జిషీట్‌ కాపీలు వెళ్లాయి. తర్వాత పది రోజులకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రపతి, ప్రధాని, అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తదితర ప్రముఖులందరితో భేటీ అయ్యారు. దీనితో రెండు ప్రభుత్వాల వర్గాల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోందని పలువురు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల సమస్యలతో పాటుగా ఓటుకు కోట్లు కేసులో కూడా కేంద్ర ప్రభుత్వానికి రాజ్‌భవన్‌ నుంచి నివేదిక అందించినట్టు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఆ చార్జ్‌షీట్‌లో ఏముంది?
ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌లో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ల మధ్య జరిగిన సంభాషణలపై ప్రధానంగా ప్రస్తావించారు. మహానాడు జరిగిన సాయంత్రం నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కలవాలని ఈ సంభాషణలో ఉందని పేర్కొన్నారు. తమ అధినేత చెప్పిన వివరాలను స్టీఫెన్‌సన్‌కు తెలిపాలని సంభాషణల్లో వారిరువురు చర్చించుకున్నారని ఏసీబీ ఈ చార్జిషీట్లో పేర్కొంది. అదే విధంగా స్టీపెన్‌సన్‌కు నమ్మకం కల్గించాలని, తమ వైపు తిప్పుకొని ఓటు వేసేలా ధైర్యం చెప్పాలని సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్లు చర్చించుకున్న ఆడియో టేపులను ఆధారాలుగా ఏసీబీ తన చార్జిషీట్‌తోపాటు కోర్టులో దాఖలు చేసింది.

నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను సెబాస్టియన్‌కు పరిచయం చేయడంలో కీలకంగా వ్యవహరించిన జెరూసలేం మత్తయ్య వ్యవహారాన్ని సైతం ఏసీబీ పూసగుచ్చినట్టు చార్జిషీట్లో పేర్కొన్నట్టు ఏసీబీ వర్గాలు తెలిపాయి. పేదరికంలో ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించే పనిని మత్తయ్యకు అప్పగించారని, అందులో భాగంగానే స్టీఫెన్‌సన్‌ను టార్గెట్‌ చేసుకొని బేరసారాలు సాగించారని ఏసీబీ పేర్కొన్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. అలాగే వీరిద్దరితో జరిగిన చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారని ఏసీబీ పేర్కొంది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో డీల్, టైమ్‌ ఫిక్స్‌ చేయడంలో ఈ ముగ్గురిది కీలక పాత్ర అని ఏసీబీ ఈ చార్జిషీట్లో వివరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement