చలి చంపేస్తోంది!
* మారిన వాతావరణం
* పడిపోయిన ఉష్ణోగ్రతలు
* తేమ, పొగమంచుతో జనం ఉక్కిరిబిక్కిరి
కల్హేర్: ఇటీవల ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనాన్ని ఇప్పుడు చలి వణికిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారడం, చలిగాలులు తోడవడంతో ఉష్ణోగ్రతలు పడిపోయి ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. దీంతో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. తుపాను రాక మునుపు గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతూ వచ్చింది. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయం గా పడిపోయాయి. ఇక రాత్రి వేళల్లోనైతే ఉష్ణోగ్రతలు మరింత తగ్గిపోతున్నాయి. కల్హేర్, మార్డి, బీబీపేట, సిర్గాపూర్, తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత, పొగమంచుతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయందోళనకు గురవుతున్నారు. పల్లె ప్రజలు చలిని తట్టుకోవడానికి మంటలు వెలిగించి కాచుకుంటున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మారిన వాతావరణంతో అనేక మంది వివిధ రకాల వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఆస్థమా, బీపీ, షుగర్, గుండె జబ్బులున్న వారు గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్న పిల్లలు, చంటి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, న్యుమోనియా, సైనస్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు తీవ్రమై ప్రమాదకరంగా మారవచ్చు. స్వెట్టర్లు, కాళ్లకు, చేతులకు గ్లౌజులు ధరించాలి. చిన్న పిల్లలకు ఇవి తప్పనిసరి. ఎక్కువ సమయం బయట తిరగాల్సి వస్తే ఉన్ని దుస్తులు ధరించాలి. చలి వాతావరణంలో ఎక్కువగా బయట తిరగకపోవడమే మంచిది.