సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు గండికొట్టిన బోధన్ వాణిజ్యపన్నుల స్కాంలో అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. గతేడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన సీఐడీ, రూ.200 కోట్లకు పైగా ఖజానాకు గండిపడినట్లు గుర్తించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులిద్దరితో పాటు వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్, నలుగురు రిటైర్డ్ అధికారులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న అధికారులపై ప్రభుత్వానికి సీఐడీ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో నివేదికలో పేర్కొన్న మొత్తం 26 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు చార్జిమెమోలు జారీచేశారు.
మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయవద్దు...
వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఐదుగురు డిప్యూటీ కమిషనర్లు, ఐదుగురు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు (సీటీవో), ఎనిమిది మంది అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారులు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లకు రెండు రోజుల క్రితం జీఏడీ నుంచి జీవోల రూపంలో చార్జిమెమోలు పంపించారు. 2005 నుంచి 2014 వరకు కుంభకోణం జరిగిందని, ఆ సమయంలో విధులు నిర్వర్తించిన డిప్యూటీ కమిషనర్లు ఆడిటింగ్ సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో సస్పెన్షన్‌తోపాటు, ఎందుకు అరెస్ట్ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కి...
ప్రస్తుతం చార్జిమెమోలు అందుకున్న అధికారులు నెల రోజుల లోపల వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం గడువునిచ్చినట్టు తెలిసింది. కాగా, తమను సీఐడీ ఎక్కడ అరెస్ట్ చేస్తుందోనని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మెమోలకు వివరణను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విభాగానికి పంపించాలనడంతో అధికారుల్లో మరింత ఆందోళన మొదలైంది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నేరుగా విజిలెన్స్ కమిçషనర్‌కు చర్యల కోసం సిఫారసు చేయడంతో పాటు సీఎంకి సైతం చర్యలపై ప్రతిపాదన పంపేందుకు అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ఎలా ఇస్తే ఏం జరుగుతుందో అన్న భయం అధికారుల్లో మొదలైంది.
ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే...
ప్రస్తుతం ఈ స్కాంలో సీఐడీ విచారణ ఆగిపోయింది. గతంలో కీలక పాత్రధారులను అరెస్ట్ చేసిన సీఐడీ, కమర్షియల్ టాక్స్ శాఖలోని మరి కొంత మందిని అరెస్ట్ చేయాలని భావించింది. అయితే వాణిజ్యపన్నుల శాఖ అంతర్గత విచారణ అనంతరం అరెస్టులకు వెళ్లాలని ప్రభుత్వం సూచించడంతో సీఐడీ వెనక్కి తగ్గింది. ఇప్పుడు చార్జిమెమోలు జారీ చేయడంతో సీఐడీ అధికారులు ఈ 26 మందిలో కొందరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ అనుమతి పొందాలని యోచిస్తోంది.
బోధన్ స్కాంలో వేటుకు రంగం సిద్ధం!
Published Thu, Feb 8 2018 2:45 AM | Last Updated on Wed, Apr 3 2019 5:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment