‘బిడ్డ జాడ చెప్పుండ్రి’
కరీంనగర్ క్రైం : తన బిడ్డను ప్రేమ పేరుతో మోసం చేసి ఆపై కనిపించకుండా చేసిన వారిపై చర్యలు తీసుకుని బిడ్డ జాడ చెప్పాలని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. శుక్రవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి బాధితురాలు వెంకటమ్మ మాట్లాడారు. గోదావరిఖని విఠల్‌నగర్ కు చెందిన తనకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉందని తెలిపారు. కూతురు కరీంనగర్ శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా 2015 ఫిబ్రవరి 24వ తేదీన కరీంనగర్‌లోని పద్మనగర్‌కు చెందిన శంషొద్దిన్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని.. వీరికి ఓ డీఎస్పీ ఆధ్వర్యంలో వివాహం జరిపించారని తెలిపారు. బిడ్డను లొంగదీసుకున్న శంషొద్దిన్ గతంలో పలువురితో ప్రేమాయనం సాగించాడని.. అతని మిత్రుల ద్వారా తెలిసిందని వెంకటమ్మ వివరించారు. విషయం తెలియడంతో ఎల్‌ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ..
అయినా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదని.. చివరకు మీ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది. రాదని చెప్పిందని పంపించారని వెంకటమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. బిడ్డను మాత్రం చూపించడంలేదని.. అసలు బిడ్డ బతికి ఉందో లేదో తెలియదని బోరుమని విలపించింది. ప్రేమ పెళ్లి చేసుకున్న శంషొద్దిన్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని సైతం ప్రాదేయపడ్డా కూతురి ఆచూకీ చెప్పలేదని తెలిపింది. చివరకు శంషొద్దిన్ ఫొన్ న ంబర్‌కు కనుక్కుని ఫోన్‌చేయగా రూ. 5 లక్షలు ఇస్తే కూతురును అప్పగిస్తానని బెదిరించాడని వివరించింది. ఉన్నతాధికారులు స్పందించి బిడ్డ బతికుందో లేదో.. ఎక్కడుందో చెప్పాలని ఈ సందర్భంగా వేడుకుంది. కూతరును వెతుకుతున్న విషయం తెలుసుకున్న శంషొద్దిన్ తన కుమారులనూ బెదిరిస్తున్నాడని ఆరోపించింది.
రక్షక దళాలు ఏర్పాటు చేస్తాం : బండి సంజయ్
జిల్లాలో హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకోవడానికి శిక్షణ పొందిన రెండు గ్యాంగ్‌లు పని చేస్తున్నాయని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకుంటే రక్షక దళాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓ తల్లి తన కూతురు కనిపించుకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదని ఓ డీఎస్పీ వద్ద 10 రోజుల పాటు డ్రైవర్‌గా శంషోద్దిన్ పని చేసినందుకు సదరు డీఎస్పీ అమ్మాయితో వివాహం జరిపి పంపించారని ఆరోపించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చివరకు ఎలాంటి విచారణ చేయకుండానే కేసును మూసి వేశారని తెలిపారు.
ఇప్పటికైన పోలీసు అధికారులు ఈ తల్లికి న్యాయం చేయాలని కోరారు. నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న లవ్ జీహద్ పేరుతో హిందూ యువతులను వలలోకి దింపి తర్వాత వారి జీవితాలు నాశనం చేస్తున్నారని వాటిపై పోలీసులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో న్యావాది బేతిమహెందర్, మురళీకృష్ణ, బోయినపల్లి ప్రవీణ్‌రావు, సిరికొండ శ్రీదర్, ముప్పిడి సునిల్, రాజేశం, మహెందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.