- ప్రశాంతంగా ముగిసిన డ్రా
- 202 లిక్కర్‌షాపులకు లాటరీ
- ప్రభుత్వ ప్రతినిధులుగా ఏజేసీ, డీఆర్వో
వరంగల్ క్రైం : జిల్లాలో మద్యం వ్యాపారులకు దుకాణాల కేటాయింపు ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. కొందరు కొత్త వ్యాపారులకు ఈ దఫా మద్యం షాపులు దక్కగా.. మెజారిటీ షాపులు మాత్రం పాతవారినే వరించినట్లు తెలుస్తోంది. హన్మకొండ ఎన్జీవోఎస్ కాలనీలోని రెడ్డి ఫంక్ష న్ హాల్‌లో వరంగల్, మహబూబాబాద్ ఎక్సైజ్ యూనిట్లకు సంబంధించి షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించారు.
జిల్లాలో మొత్తం 234 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో వరంగల్ ఎక్సైజ్ యూనిట్‌లో 113 దుకాణాలు ఉండగా, మహబూబాబాద్ యూనిట్‌లో 121 దుకాణాలు ఉన్నాయి. షాపులను దక్కించుకునేందుకు 3030 దరఖాస్తులు వ్యాపారుల నుంచి వచ్చాయి. ఎక్సైజ్ అధికారుల భారీ బందోబస్తు మధ్య ఆయా దుకాణాల కేటాయింపు ప్రకియను పూర్తి చేశారు.
అడిషనల్ జేసీ, డీఆర్వో సమక్షంలో డ్రా...
మద్యం దుకాణాల డ్రా ప్రక్రియ అడిషనల్ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, డీఆర్వో సురేంద్రకరణ్ సమక్షంలో జరిగింది. రెడ్డి ఫంక్షన్ హాల్‌లోని స్టేజీపైన రెండు షాపులకు సంబంధించి కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను కొనసాగించారు. వరంగల్ యూనిట్‌లో ఏజేసీ కృష్ణారెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, ఏఈఎస్ విజ యశంకర్ లాటరీ ప్రక్రియను కొనసాగించగా, మరోవైపు మహబూబాబాద్ యూనిట్‌కు సంబంధించి డీఆర్వో సురేంద్రకరణ్, మహబూబాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయశేఖర్, ఏ ఈఎస్ శ్రీనివాసరావు లాటరీ తీసి దుకాణాలు కేటాయించారు. అయితే ఒకే స్టేజీపైన రెండు యూనిట్లకు సంబంధించి లాటరీ లు నిర్వహించడంతో మైకుల మోతతో కొంత ఇబ్బంది ఏర్పడింది. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఎక్సైజ్ స్టేషన్లకు సంబంధించిన సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. వారితోపాటు రెండు స్క్వాడ్‌లకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మొదటగా సింగిల్ దరఖాస్తులు..
తొలుత జిల్లావ్యాప్తంగా ఒకేఒక్క దరఖాస్తు వచ్చిన దుకాణాల ను ఎంచుకున్నారు. ఇలా వరంగల్ యూనిట్ పరిధిలో 8 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చింది. మహబూబాబాద్ యూనిట్ పరిధిలో 17 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు దాఖలైం ది. రెండు యూనిట్ల పరిధిలో 7 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. మిగతా 202 షాపులకు సంబంధించి ఒక్కో దు కాణానికి 8 నుంచి 19 వరకు దరఖాస్తులు వచ్చాయి.
లాటరీ పద్ధతి ద్వారా ఎంపికైన మద్యం వ్యాపారిని కన్ఫర్మేషన్ ఫామ్‌లో సంతకం చేయించి బ్యాంకులో డబ్బులు చెల్లించేందుకు అనుమతించారు.రెడ్డి ఫంక్షన్ హాల్‌లోనే మరో పక్క బ్యాంకు కౌంటర్ ను ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాలు పొందిన వారు 10 శాతం ఈఎండీ పోను మిగతా 1/3వ వంతు మొత్తాన్ని చెల్లించారు. దీంతోపాటు పర్మిట్ గదులకు కూడా రూ.2 లక్షలు వెంటనే చెల్లించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.
త్వరలోనే రీ-షెడ్యూల్...
దరఖాస్తులు రాని దుకాణాలకు త్వరలోనే రీ-షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డి తెలిపారు. జిల్లాలో 7 మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. వరంగల్ ఎంజీఎం సెంటర్‌లోని ఒక మద్యం దుకాణం, జన గామ మండలం పెంబర్తిలోని మరో దుకాణానికి వరంగల్ యూనిట్‌లో దరఖాస్తులు రాలేదు. అలాగే మానుకోట పరిధిలోని చల్వాయి, కమలాపూర్, భూపాల్‌పల్లిలో రెండు, పరకాలలో ఒక దుకాణానికి దరఖాస్తులు రాలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మళ్లీ స్వల్ప మార్పులతో మద్యం వ్యాపారుల వద్ద నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు.
నేడు ఈఎండీ చెల్లింపులు..
మద్యం దుకాణాలు పొందని వ్యాపారులు తాము చెల్లించి న 10 శాతం ఈఎండీలను మంగళవారం మధ్యాహ్నం నుం చి చెల్లించనున్నట్లు అధికారులు ప్రకటించారు. మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఆయా షాపులకు కేటాయించిన లెసైన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీగా డీడీ తీయడంతోపాటు దరఖాస్తు కోసం రూ.25 వేలు చెల్లించారు. రూ.25 వేలు నాన్‌రిఫండబుల్‌గా ఉండగా 10 శాతం ఈఎండీని మంగళవారం ఉదయం 11 నుంచి హన్మకొండ హౌసింగ్ బోర్డులోని ఎక్సైజ్ కార్యాలయంలో చెల్లించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.