సాక్షి సిటీబ్యూరో: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సిటీలో చికెన్‌కు భారీగా డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ధరలు కూడా పెరిగే అవకాశం ఉండడంతో వ్యాపారులు ముందస్తుగా భారీగా ఆర్డర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా కనుమ రోజున నాన్ వెజ్ వంటకాలు తినడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మాంసం దుకాణాల వద్దకు బారులుతీరుతుంటారు. గతేడాది దసరా సందర్భంగా కోళ్ల కొరత కారణంగా కిలో చికెన్ రూ.270 వరకు ధర పలికింది.
ఈ సారి అంతగా కొరత లేకున్నా వ్యాపారులు ముందు చూపుతో కోళ్లకు ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. నగరంలో కోడి మాంసం అమ్మకాలు ఈసారి బాగా జరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా ఘట్‌కేసర్, జీడిమెట్ల, షాద్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర శివారు ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల వద్ద వ్యాపారుల కొనుగోళ్ల సందడి పెరిగింది. అత్యధికంగా బ్రాయిలర్ కోళ్లకే ఎక్కువ డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక నాటు కోడి ఖరీదు కావడం వల్ల కాస్త డబ్బున్న వారే వీటిని కొనుగోలు చేస్తున్నారు.
ఈసారి పండుగ సందర్భంగా చికెన్ అమ్మకాలు భారీగా ఉండే అవకాశం ఉందని హోల్‌సేల్ చికెన్ వ్యాపారి రమేశ్ వెల్లడించారు. గతేడాది ఒక్క సంక్రాంతి రోజే తాను 250 కిలోల చికెన్ విక్రయించానని, ఈసారి కనీసం 500 కిలోలు అమ్ముతానన్న నమ్మకం ఉందని చెప్పారు. అందుకే ముందస్తుగా కోళ్లకు ఆర్డర్ చేస్తున్నట్టు తెలిపారు. నిజానికి సాధారణ రోజుల్లోనే గ్రేటర్ పరిధిలో లక్షన్నర నుంచి రెండు లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. ఇక ఆదివారం రోజున 2.5 నుంచి 3 లక్షల కిలోలు అమ్మకాలు జరిగాయని వ్యాపారులు తెలిపారు. అయితే..ఈ సారి సంక్రాంతి ఒక్కరోజే దాదాపు 3 నుంచి 4 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment