కొందరు కేంద్ర మంత్రులు.. అమెరికా ఏజెంట్లు
* చిదంబరం వల్లే ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం
* మతతత్వాన్ని ప్రేరేపిస్తున్న నరేంద్రమోడీ
* హెచ్‌సీయూ ప్రొఫెసర్ జి.హరగోపాల్
జమ్మికుంట, న్యూస్‌లైన్: చిదంబరం, కపిల్‌సిబాల్, కమల్‌నాథ్‌తో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు అమెరికా ఏజెంట్లుగా పనిచేస్తున్నారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రెండు రోజులుగా జరుగుతున్న డీటీఎఫ్ జిల్లా విద్యా మహాసభల్లో సోమవారం ఆయన ‘ప్రజాస్వామ్యం, స్వాలంబన’ అనే అంశం పై ప్రసంగించారు. స్వాలంబన అనే భావనను అత్యుత్తమ స్థాయికి తీసుకువచ్చిన మహోత్తమ వ్యక్తి గాంధీజీ అని చెప్పారు.
నాల్గవ పంచవర్ష ప్రణాళికలో ఇందిరాగాంధీ దేశం పూర్తిస్థాయిలో స్వాలంబన సాధిస్తుందని పేర్కొనగా, ప్రపంచబ్యాంకు అభ్యంతరం చెప్పడంతో ఆ ప్రణాళిక లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చిందని చెప్పారు. దేశం గట్టిగా నిలబడి మాట్లాడి ప్రశ్నిస్తే స్వాలంబన వస్తుంది కానీ, అమెరికా ఆదేశాల ప్రకారం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిదంబరం వల్లనే ఛిన్నాభిన్నమైందని ఆరోపించారు. పాలకులకు ఆర్థిక జాతీయవాదం ఉండాలి కానీ.. సాంస్కృతిక జాతీయవాదం కాదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలువడం కష్టతరమని హరగోపాల్ అభిప్రాయపడ్డారు. భావి భారత ప్రధానిగా ప్రచారం చేసుకుంటున్న మోడీ మతతత్వాన్ని ప్రేరేపిస్తున్నారన్నారు. ప్రజల పోరాటాలే రాజకీయాల్ని మారుస్తాయని, దేశంలోనే తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య సంస్కృతి ఎక్కువని పేర్కొన్నారు. ‘తెలంగాణలో సాహితోద్యమాలు’ అనే అంశం పై రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి ప్రసంగించారు.