
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆవిర్భవించిన ఆరేళ్లలోనే ఎన్నో రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అక్షరాస్యత విషయంలో వెనుకబడి ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో 100 శాతం అక్షరాస్యతను సాధించాలని కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతినబూనామన్నారు. ప్రతి ఒక్క నిరక్షరాస్యుడికీ విద్య అందిస్తామన్నారు. బుధవారం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో సంపూర్ణ అక్షరాస్యత దిశగా అమలు చేయబోతున్న కార్యక్రమాలు, పల్లె ప్రగతి కార్యక్రమం లక్ష్యాలు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రాష్ట్రానికి కలగనున్న ప్రయోజనాలతో పాటు వర్తమాన రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.
జనవరి 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమవుతోందని, ఇందులో భాగంగా గ్రామీణ నిరక్షరాస్యుల సమాచారాన్ని సేకరించి జాబితాల రూపకల్పన చేస్తున్నామన్నారు. ‘ఈచ్ వన్–టీచ్ వన్’నినాదంతో ప్రతీ విద్యావంతుడు ఓ నిరక్షరాస్యుడికి చదువు చెప్పాలని పిలుపునిచ్చామన్నారు. వచ్చే మూడు నెలల్లోగా సాధ్యమైనంత అధిక మంది నిరక్షరాస్యులు కనీసం రాయడం, చదవగలిగేలా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తామని గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది. పరిశుభ్రమైన, ఆరోగ్యమైన పల్లెల కోసం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని సీఎం తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నీళ్లతో మధ్యమానేరు జలాశయంలో జల కళ నెలకొందని, ఇక్కడి నుంచి 80–90 శాతం రాష్ట్రానికి తాగునీరు సరఫరా కానుందని తెలియజేశారు.
తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతలను ఈ సందర్భంగా సీఎం గవర్నర్‌కు సుదీర్ఘంగా వివరించినట్టు తెలిసింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారని, అందుకే జల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచి్చందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు, సాధించిన ఫలితాలను గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 100 రోజుల పాలనపై తాను కేంద్రానికి పంపించిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, సాగునీరు, విద్యారంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతలను వివరించినట్టు సీఎంకు గవర్నర్ తెలియజేసినట్టు తెలిసింది. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను సైతం గవర్నర్ ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment