నీలగిరి : జిల్లాలో స్త్రీ,శిశు సంక్షేమాన్ని పర్యవేక్షించాల్సిన సీడీపీఓలు (చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్) సొంతవ్యాపకాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలున్నాయి. పనిచేయాల్సిన ప్రాంతంలో కాకుండా పొరుగు జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల జెడ్పీ స్థాయీ సంఘసమావేశంలో అంగన్‌వాడీల పనితీరు అస్తవ్యస్తంగా ఉందని సభ్యులు లే వ నెత్తడం ఇందుకు నిదర్శనం. జిల్లాలో సీడీపీఓ ప్రాజెక్టులు మొత్తం 18 ఉన్నాయి. వీటి పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలు 4,400 ఉన్నాయి. ఈ కేంద్రాలను 170 మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. సీడీపీఓలు నెలలో కనీసం 20 రోజులపాటు తమ ప్రాజెక్టు పరిధిలో పర్యటిస్తూ అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలి. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి..మధ్యాహ్నం తర్వాత గ్రామాల్లో పర్యటించాలి. గర్భిణులు, అత్యాచార బాధితులను పలకరించడంతో పాటు, చిన్నారుల ఆలనాపాలనా గురించి వివరాలు అడిగి తెలుసుకోవాలి. అదేవిధంగా శిశువుల అభివృద్ధికి ప్రభుత్వం ఏ మేరకు ఖర్చు చేయాలనే అంశాలపై ప్రణాళికలు రూపొందించాలి. ఈ విధంగా శిశుసమగ్రాభివృద్ధికి పనిచేయాల్సిన అధికారులు... తమను నియమించిన ప్రాంతంలో కాకుండా సుదూర ప్రాంతాలైన ఖమ్మం, హైదరాబాద్, విజయవాడ, మహబూబ్‌నగర్, ప్రకాశం జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
వీరేమీ తక్కువ కాదు...
‘యథా రాజా...తథా ప్రజ’ అన్నట్టు అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించాల్సిన సూపర్‌వైజర్లు సైతం స్థానికంగా ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ఎక్కువమంది సూపర్‌వైజర్లు హైదరాబాద్‌లో మకాం పెట్టారు. సీడీపీఓలు, పర్యవేక్షించాల్సిన సూపర్‌వైజర్లు ఇలా ఉంటే....తామేమీ తక్కువ తిన్నామా అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు కూడా తమ విధుల పట్ల శ్రద్ధ చూపని పరిస్థితి ఏర్పడింది. దేవరకొండ, రామన్నపేట, భువనగిరి, చింతపల్లి, పెద్దవూర మండలాల్లో పనిచేస్తున్న సుమారు 50 మంది సూపర్‌వైజర్లు హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లు బలమైన ఫిర్యాదులు వచ్చాయి.
చర్యలు తీసుకుంటాం : మోతీ,
ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ
సీడీపీఓలను స్థానికంగా ఉండాలని గతంలో ఆదేశాలు ఇచ్చాం. ఆ మేరకు పొరుగు జిల్లాలకు చెందిన అధికారులు పనిచేస్తున్న చోట రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నామని చెప్పారు. స్థానికంగా ఉండకుండా రాకపోకలు సాగిస్తున్న సీడీపీఓలు, సూపర్‌వైజర్లపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.
సీడీపీఓ పనిచేయాల్సింది నివాసముంటున్నది
పెద్దవూర మాచర్ల(గుంటూరు)
హుజూర్‌నగర్ మిర్యాలగూడ
మిర్యాలగూడ రూరల్ చీరాల(ప్రకాశం)
నల్లగొండ రూరల్ హైదరాబాద్
సూర్యాపేట రూరల్ ఖమ్మం
సూర్యాపేట అర్బన్ విజయవాడ
తుంగతుర్తి హైదరాబాద్
భువనగిరి హైదరాబాద్
మునుగోడు హైదరాబాద్
ఆలేరు హైదరాబాద్
ఇక్కడ కొలువు అక్కడ నెలవు
Published Fri, Oct 17 2014 3:43 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement