పరిగి: పెళ్లికి ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న చట్టపరమైన నిబంధన అమలు కావడం లేదు. దీనివల్ల బాల్యవివాహాలు, స్త్రీల అక్రమరవాణా వంటి సాంఘిక దురాచారాలు ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాకే పెళ్లిళ్లు జరిపించుకోవాలి. ఈ నిబంధన చట్టంలో చాలాకాలం నుంచి ఉన్నప్పటికీ ఆ చట్టం సమగ్రంగా లేనందున ఎక్కడో ఓ చోట తప్ప అమలు కావడంలేదు.
అంతకు ముందు ఈ నిబంధనకు కొన్ని మినహాయింపులు ఉండగా మతమేదైనా మ్యారేజ్ రిజిస్టేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుని దానికి 2012 ఫిబ్రవరిలో చట్టబద్ధత కల్పించింది. చట్టం వచ్చిన మొదట్లో కొద్దిరోజులు హల్‌చల్ చేసిన పంచాయతీ అధికారులు తరువాత దాని ఊసెత్తటం మానేశారు. మ్యారేజ్ రిజిస్టేషన్ చేసుకోవాలంటూ పంచాయతీల ముందు బోర్డులు సైతం ఏర్పాటు చేసినవారు తరువాత వాటిని పీకి అవతల పడేశారు.
ఇదీ నిబంధన..
2002లో ప్రభుత్వం ముందస్తు వివాహ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే దీని అమలుకు ప్రచారం , అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. కనీసం పంచాయతీలకు సర్య్కులర్‌లు కూడా పంపలేదు. దీంతో చట్టం వచ్చిన విషయం ఎవరికీ తెలియకుండానే మరుగున పడిపోయింది. అయితే బాల్యవివాహాల నిర్మూలనకు పనిచేస్తున్న పలు స్వచ్చంద సంస్థలు ఈ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో 2002 క్లాజ్ 12 ప్రకారం వివాహానికి ముందు తప్పనిసరిగా గ్రామపంచాయతీల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని 2006 వ సంవత్సరంలో ప్రభుత్వం పీఆర్ 193 జీఓను విడుదలచేసింది.
రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను గ్రామపంచాయతీలకు కట్టబెట్టింది. బాల్యవివాహాల నియంత్రణకు ప్రభుత్వం కొన్ని కమిటీలను కూడా వేసింది. కాని చట్టంలో ఉన్న లొసుగులు , అభ్యంతరాలవల్ల ఏఒక్కచోటా ఇది అమలుకు నోచుకున్న పాపాన పోలేదు. 2012లో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో రిజిస్ట్ట్రేషన్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలు కలిగినా కార్యాచరణ అంతంతమాత్రమే.
30 శాతం బాల్య వివాహాలే....
బాల్యవివాహాలను సాంఘిక దురాచారంగా గుర్తించిన కందుకూరి వీరేశలింగం వంటి వారు వాటిపై ఉద్యమించినా నేటికీ బాల్యవివాహాలు జరుగుతూనే ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వివాహాల్లో 30నుంచి 30 శాతం బాల్యవివాహాలే ఉంటున్నాయని ఎంవీ ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థల లెక్కలు చెబుతున్నాయి. పుట్టిన ప్రతీబిడ్డకు వెంటనే జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటంతోపాటు తప్పనిసరిగా ముందస్తు వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు జరిగితే బాల్యవివాహాలు పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందని అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పేర్కొంటూ వస్తున్నారు. అలాగే మహిళలకు రక్షణ చేకూరనుంది. గతంలో వివాహాలు జరుగకున్నా మెడలో తాళి వేసి మహిళలను, బాలికలను విదేశాలకు, వేరే రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసేవారు. అయితే తప్పనిసరి రిజిస్ట్రేషన్ అమలైతే అక్రమ రవాణాను అరికట్టవచ్చునని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు హుళక్కి
Published Tue, Aug 26 2014 11:51 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement