అమ్మను రక్షిస్తున్నాం.. | child mortality in the state has decreased says Etela Rajender | Sakshi
Sakshi News home page

అమ్మను రక్షిస్తున్నాం..

Published Sat, Nov 9 2019 5:07 AM | Last Updated on Sat, Nov 9 2019 5:07 AM

child mortality in the state has decreased says Etela Rajender - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాతృత్వపు మరణాలు రాష్ట్రంలో గణనీయంగా తగ్గాయి. 2015–17 మధ్య భారతదేశంలో సంభవించిన మాతా మరణాల నివేదికను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో బాలింతల మరణాలు తగ్గాయి. మరణాల తగ్గుదలలో దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో అత్యంత తక్కు వగా కేరళలో ప్రతీ లక్ష మందిలో 42 మంది, మహారాష్ట్రలో 55, తమిళనాడులో 63, ఆంధ్రప్రదేశ్‌లో 74, తెలంగాణ, జార్ఖండ్‌లలో 76 మంది చొప్పున బాలింతలు మరణిస్తున్నారు. 2014–16 మధ్య తెలంగాణలో ప్రతీ లక్ష మందిలో 81 మంది బాలింతలు మరణించేవారు. ఆ సంఖ్య ఇప్పుడు 76కు తగ్గింది. జాతీయ స్థాయిలో మాతా మరణాల రేటు 122 ఉండగా, దేశంలో అత్యధికంగా అస్సాంలో 229గా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మరణాల రేటు 216గా ఉంది.

మూడు దశల్లో జరిగే మరణాలే లెక్క.. 
మాతా మరణాలను మూడు దశల్లో లెక్కిస్తారు. 15 నుంచి 49 ఏళ్లలోపు గర్భిణులను లెక్కలోకి తీసుకుంటారు. గర్భిణీగా ఉన్నప్పుడు సరైన ఆరోగ్య రక్షణ లేకపోవడం వల్ల సంభవించే మరణాలు, ప్రసవ సమయంలో సంభవించే మరణాలు, ఆ తర్వాత నెల లోపు జరిగే మరణాలను మాతా మరణాలుగా పరిగణిస్తారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మాతా మరణాలను ప్రతీ లక్ష మందిలో ఎంతమంది బాలింతలు చనిపోయారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు. ప్రస్తుతం దేశంలో మాతా మరణాల రేటు దక్షిణ భారతదేశంలోనే గణనీయంగా తగ్గడం గమనార్హం. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో మాత్రమే అత్యధికంగా 97 మరణాలు సంభవిస్తున్నాయి. జార్ఖండ్‌లోనైతే 2014–16 మధ్య మాతా మరణాల రేటు 165 ఉంటే, ఈసారి ఏకంగా 76కు తగ్గడం విశేషం. అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే గతానికంటే సగానికిపైగా మరణాలు తగ్గాయి. విచిత్రమేంటంటే మధ్యప్రదేశ్‌లో గతంలో మాతృత్వపు మరణాల రేటు 173 ఉంటే, ఈసారి 188కు పెరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో గతంలో మరణాల రేటు 201 ఉంటే, ఈసారి 216కు పెరిగింది.  

ప్రసవ కేంద్రాల బలోపేతమే కారణం 
రాష్ట్రంలో ప్రభు త్వ ఆసుపత్రుల్లో ప్రస వ కేంద్రాలను బలోపేతం చేయడం వల్లే మాతృత్వపు మరణా లు తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రభు త్వం ప్రసవ కేంద్రాలపై దృష్టి సారించిందని, వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించిందని చెబుతున్నా రు. దాదాపు 300 ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల (పీహెచ్‌సీ)ను 24 గంటల ఆసుపత్రులుగా మార్చడం  మా తృత్వపు మరణాలు తగ్గడానికి కారణమని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.

సర్కారు నిర్ణయాల వల్లే: ఈటల రాజేందర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి 
తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే మాతృ మరణాలు గణనీయంగా తగ్గాయి. వైద్య, ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి, అంగన్‌వాడీల్లో గర్భిణులకు సరైన పోషకాహారం అందించడం, ఎప్పటికప్పుడు చెకప్‌లు చేయడం వంటి చర్యలతో మాతా మరణాల రేటు తగ్గుదలలో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచాం. కేసీఆర్‌ తీసుకున్న విప్లవాత్మక చర్యలతో సాధ్యమైంది. కేసీఆర్‌ కిట్‌ వచ్చాక పరిస్థితి ఇంకా మెరుగుపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement