పోసాని కృష్ణమురళితో..డ్రగ్స్ నిర్మూలనపై పాఠశాల విద్యార్థులతో ప్రచారం చేస్తున్న చిన్నారి
అంబర్‌పేట: డ్రగ్స్ బారిన పడి యువత తమ జీవితాలను దుర్భరం చేసుకుంటోంది. డగ్స్ తీసుకోవడం ఓ ఫ్యాషన్‌గా భావిస్తోంది. రోజురోజుకూ ఎక్కువవుతున్న ఈ వ్యసనం సమాజానికి సవాల్ విసురుతోంది. డగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాల్సిన అవసరముంది. దీని నిరోధానికి డ్రగ్స్ ఫ్రీ వరల్డ్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో సైతం ఈ సంస్థ తన సేవలను విస్తరించింది. వివిధ రూపాల్లో డ్రగ్స్‌తో జరిగే పరిణామాలపై వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్‌ఫ్రీ వరల్డ్ సంస్థ ఇండియాకు జూనియర్ కాంపెయిన్ హెడ్‌గా నగరానికి చెందిన 8 ఏళ్ల చిన్నారి తానియా బేగంను ఎంచుకుంది. ఈ చిన్నారితో ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. మంగళవారం డగ్స్ వ్యతిరేక దినం సందర్భంగా ప్రత్యేక కథనం.
ప్రసంగం.. అనర్గళం..
డ్రగ్స్‌ఫ్రీ వరల్డ్ ఇండియా జూనియర్ కంపెయిన్ హెడ్‌గా ఏడాది క్రితం నియమితురాలైంది తానియా. ఇప్పటి వరకు 50 అవగాహన కార్యక్రమాలకు పైగా పాల్గొంది. డ్రగ్స్‌పై నిర్వహించిన 5కే, 2కే రన్స్, అవగాహన ర్యాలీల్లో ఈ చిన్నారి పాల్గొని తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తోంది. చదివేది 2వ తరగతి అయినా డ్రగ్స్‌పై అనర్గళంగా ప్రసంగిస్తోంది. దీంతోపాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పలువురు ప్రముఖుల మన్ననలను సైతం పొందుతోంది. గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు, మంత్రులతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అభినందనలు పొందింది.
రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి లేఖలు..
డ్రగ్స్ ఫ్రీ ఇండియా కోసం చిన్నారి తానియా తన ఆలోచనలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ ద్వారా పంచుకుంది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ ప్రధాన అంశంపై తొలిసారిగా ఓ చిన్నారి లేఖ రాయడంతో రాష్ట్రపతి సైతం అబ్బురపడ్డారు. తానియా లేఖకు ఆయన చిత్రంతో పాటు సంతకం చేసి అభినందిస్తూ ఆమెకు పంపించారు. ఉప రాష్టపతి సైతం ఈ చిన్నారిని లేఖ ద్వారా అభినందించారు.
పరుగు ఎక్కడుంటే అక్కడే..
నగరంలో వివిధ సామాజిక అంశాలపై జరిగే వివిధ పరుగుల్లో పాల్గొనేందుకు తానియా ఎంతో ఉత్సాహం చూపిస్తుంది. ఉదయం పరుగు ఉంటే రాత్రి నుంచే తండ్రి సలావుద్దీన్ సహకారం కోసం పట్టుపడుతుంది. తండ్రి సైతం ఆమె ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ ఎక్కడ పరుగుంటే అక్కడే ఈ తండ్రీ కూతురు వాలిపోతారు. పరుగులోనూ అందరితో శభాష్ అనిపించుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment