సిటీలో పార్కులు ఇక కొత్తరూపు సంతరించుకోనున్నాయి.ప్రతి పార్కుకూ ఓ థీమ్ ఉండేలా తీర్చిదిద్దనున్నారు. ఈ థీమ్‌లు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ఉంటాయి. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ రూ.120 కోట్లు వ్యయం చేయనున్నది. ఈ మేరకుగ్రేటర్ వ్యాప్తంగా 47 పార్కుల్ని తీర్చిదిద్దాలని అధికారులునిర్ణయించారు.
ఇవీ థీమ్స్..
స్వచ్ఛత, ఘనవ్యర్థాల నిర్వహణ, ట్రాఫిక్, ఇంకుడుగుంతలు, చిల్డ్రన్స్, తెలంగాణ కల్చర్, వేస్ట్ టు వండర్స్ ఆఫ్ తెలంగాణ, పేట్రియాటిక్, యూనివర్సల్, టన్నెల్‌గార్డెన్, నాలెడ్జ్ ఆన్ సైన్స్, రెయిన్‌ఫారెస్ట్, వాటర్, అడ్వెంచర్, ఎనర్జీ కన్జర్వేషన్, ఉమెన్, సీనియర్ సిటిజెన్, పార్క్ ఆఫ్ సెన్సెస్, కాళేశ్వరం తదితర థీమ్స్‌ను ప్రాథమికంగా ఎంపిక చేశారు.
సాక్షి,సిటీబ్యూరో: కోటి మందికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేకంగా చిల్డ్రన్స్ పార్కు లేదు. అలాంటి ఒక పార్కు త్వరలో ఏర్పాటు కానుంది. అందులో కేవలం పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. పిల్లలుంటేనే వారి వెంట పెద్దలకు ప్రవేశం ఉంటుంది. పిల్లల్లేకుండా కేవలం పెద్దలే వస్తే ప్రవేశం ఉండదు. ఈ చిల్డ్రన్స్ పార్కులో 3–14 ఏళ్ల మధ్య వయసు పిల్లల కోసం ఆయా ఆకర్షణలు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. డ్రాయింగ్, సంగీతం,డ్యాన్స్ వంటివి నేర్చుకోవాలనుకునేవారికి తర్ఫీదునిచ్చే ఏర్పాట్లుంటాయి. వివిధ రకాల పుస్తకాలు తదితరమైనవి ఉంటాయి. పూర్తిగా పిల్లల కోసమే వారిని ఆకర్షించేలా తీర్చిదిద్దుతారు.
♦ మరో పార్కు మహిళలకే ప్రత్యేకం. ఇందులో మహిళల స్వీయ రక్షణకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయి. మహిళలకు సంబంధించిన వస్తువుల దుకాణాలు, బ్యూటీపార్లర్, కిట్టీ పార్టీలకు క్లబ్ ఏరియా.. ఇలా అన్నీ మహిళలకు సంబంధించిన అంశాలు, సదుపాయాలుండే లేడీస్ పార్క్.
♦ సీనియర్ సిటిజెన్లకు అవసరమైన శారీరక వ్యాయామాలు, ఇబ్బందుల్లేకుండా సాఫీగా నడిచేందుకు ఎగుడుదిగుడుల్లేని నడకమార్గాలు, వృద్ధాప్యంలో ఆడుకునే ఆటలు..తదితర సదుపాయాలతో సీనియర్ సిటిజెన్స్ పార్క్.
♦ కాళేశ్వరం ప్రాజెక్టు మోడల్‌తో మరో పార్కు. ఎన్ని జలాశయాలు, ఎన్ని మోటార్లు.. ఎత్తిపోతలు ఎక్కడినుంచి మొదలై నీరు ఎక్కడకు చేరుతుంది. తదితరమైనవి కళ్లకు కట్టేలా ఇరిగేషన్ పార్కు.
♦ చెత్త అంటే వ్యర్థమే కాదు.. దాంతో ఎన్నో అర్థాలున్నాయి. దాన్నెలా వినియోగించుకుంటే ఏయే ప్రయోజనాలుంటాయి తదితరమైనవి అర్థమయ్యేలా స్వచ్ఛ అంశాలకు సంబంధించి 12 రకాల పార్కులు.
♦ ఇలా వివిధ రకరకాల థీమ్‌లతో పార్కుల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. దాదాపు 25 థీమ్‌లతో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఎకరానికి పైగా విస్తీర్ణమున్న ఖాలీ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు ఇలాంటి 47ప్రదేశాలను గుర్తించారు. వీటిల్లో ఈ థీమ్‌లతో పార్కుల ఏర్పాటుకు దాదాపు రూ. 120 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. అర్బన్ లివింగ్ థీమ్ పార్కులుగా వ్యవహరించే వీటి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
స్వచ్ఛత పార్కుల్లో..
స్వచ్ఛత (స్వచ్ఛ హైదరాబాద్) థీమ్‌తో ఏర్పాటయ్యే పార్కుల్లో ఒక దాంట్లో వ్యర్థాల రీసైక్లింగ్‌తో చేసిన ఉత్పత్తులుంటాయి. మరోదాంట్లో పాత టైర్లతో అందంగా రూపొందించిన కుర్చీలు తదితరమైనవి ఉంటాయి. ఇంకో పార్కులో అచ్చంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్‌చేసి తయారు చేసిన బెంచీలు, డస్ట్‌బిన్లు, ఫెన్సింగ్ తదితరమైనవి ఉంటాయి. ఒక పార్కులో వ్యర్థాలను ఎన్ని రకాలుగా( పేపర్, గ్లాస్, ప్లాస్టిక్, ఆర్గానిక్, మెటల్‌గా) వర్గీకరించవచ్చో తెలుస్తుంది. మరో దాంట్లో వ్యర్థాలతోనే ప్రముఖ కట్టడాలను నిర్మిస్తారు. దీన్ని వేస్ట్ టు వండర్ పార్క్ అంటారు. ఇందులో గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, వరంగల్ ఫోర్ట్, ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్ వంటివి ఉంటాయి. మరోదాంట్లో చెత్తనుంచి విద్యుత్ ఎలా వస్తుందో తెలిసేలా ఉంటుంది. పొడిచెత్తలో ఎన్ని రకాలుంటాయో ఇంకోపార్కు వివరిస్తుంది. అంతేకాకుండా చెత్తను ఎలా వేరుచేయాలో , ఎలా రీయూజ్ చేయవచ్చో కూడా పిల్లలకు తెలియజేసే వారుంటారు. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ కాన్సెప్ట్‌తో‘ 3ఆర్ కాన్సెప్ట్’ పేరిట మరో పార్కు. వ్యర్థాలను ఎలా రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ చేయవచ్చో పిల్లలకు అర్థమయ్యేలా ప్రదర్శనలుంటాయి. ఇలా స్వచ్ఛ అంశాలకు సంబంధించే 12 థీమ్‌లతో పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ప్రజలకు సందేశమిచ్చేలా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment