
కాజీపేట అర్బన్: లవర్ బాయ్ ఇమేజ్‌తో గుర్తింపు పొందిన నేను త్వరలో అన్ని వర్గాల ప్రజలను మెప్పించేలా అందరిని ఆకట్టుకునే సినిమాతో ముందుకు వస్తానని సినీహీరో వరుణ్‌సందేశ్ తెలిపారు. హన్మకొండలో ఓ సెలూన్ షాప్ ప్రారంభోత్సవానికి శనివారం వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
ఓరుగల్లు అంటే ఎంతో ఇష్టం
చారిత్రక ఓరుగల్లు నగరంలో సినిమా చేయాలనుంది. గతంలో టూర్‌లో భాగంగా వరంగల్‌కు వచ్చాను. వేయిస్తంభాల దేవాలయం, రామప్ప, వరంగల్ ఫోర్ట్‌లతో పాటు నిట్ వరంగల్ చాలా ఇష్టమైన ప్రాంతాలు. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ ఫాస్ట్‌గా అభివృద్ధి చెందుతున్నందున వర్షం, ఎంసీఏ వంటి చిత్రాలతో సినీ రంగానికి అనువుగా నిలుస్తున్న వరంగల్‌లో సినిమా చేస్తా.
బిగ్‌బాస్–3 ఓపికను నేర్పించింది...
ఎంతో కోపంగా, ఓపిక లేకుండా, ప్రతి అంశానికి రియాక్ట్ అయ్యే నన్ను బిగ్‌బాస్–3లో 105రోజుల ప్రయాణం ఓపిక నేర్పించింది. నేను వితిక భార్యభర్తలమైనా బిగ్‌బాస్–3లో కంటెస్ట్‌లుగా పోటాపోటీగా టాస్క్‌లు చేశాం. టాప్–5లో నేను సైతం ఉండడం బిగ్ బాస్ నాకు నేర్పిన, అందించిన ఓర్పు, ఓపికతోనే. నేను నా భర్యతో పాటు 15 మంది కంటెస్ట్‌లతో అనుభూతులు, అభిరుచులను, కోపాలు–తాపాలు, అనుభావాలను పంచుకుంటూ ఆత్మీయులుగా మారిపోయాం. బిగ్‌బాస్–3 జర్నీ నా జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి. నిత్యం షూటింగ్‌లో బిజీగా ఉండే నేను నా భార్య వితిక ఒకే చోట వంద రోజులు మనోభావాలను పంచుకునే అవకాశాన్ని అందించిన బిగ్‌బాస్‌కు రుణపడి ఉంటా. నా సినిమాలను ఆదరించిన ప్రేక్షకులే నన్ను టాప్–5లో బిగ్‌బాస్‌లో నిలబెట్టారు. నా అభిమానుల అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను.
త్వరలో మల్టీస్టారర్...
బిగ్‌బాస్–3 జర్నీ తర్వాత అనేక అవకాశాలు వస్తున్నాయి. పదికి పైగా స్టోరీలను విన్నాను. త్వరలో మల్టీస్టారర్ మూవీ, ఫ్యామిలీ, కామెడీ సినిమాలతో ముందుకు వస్తా.
‘సే నో టూ ప్లాస్టిక్’లో వరంగల్ ముందుండాలి
యూఎస్‌లో ఉన్నప్పుడు అక్కడ ప్లాస్టిక్ వాడకం నిషేదంతో పర్యావరణ పరిరక్షణలో ముందుండగా ప్రస్తుతం వరంగల్ సే నో టూ ప్లాస్టిక్ అంటూ ప్లాస్టిక్ రహితంగా వరంగల్ ఫస్ట్‌గా నిలవాలి. ప్లాస్టిక్ వినియోగంతో అనేక రోగాలు వస్తున్నాయి, వాతావరణం కలుషితమౌతుంది. పర్యావరణానికి ముప్పుగా మారిని ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దామంటూ వరంగల్‌వాసులకు వరుణ్‌సందేశ్ తన సందేశ్(శా)న్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment