ఆక్సిజన్ సిటీగా హైదరాబాద్
- నగరం చుట్టూ హరిత వనాలు
- మూసీ తీరం పొడవునా గ్రీన్ బెల్ట్
- ప్రణాళికను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
- నేడు ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే
సాక్షి, హైదరాబాద్: కాలుష్యపు కోరల్లో చిక్కిన హైదరాబాద్ మహా నగరవాసులకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం బృహత్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ దిశలో భవిష్యత్తులో భాగ్యనగరాన్ని ఆక్సిజన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కాంక్రీట్ వనంగా మారిన మహానగరంలో హరిత వనాలకు అనువైన స్థలాలను గుర్తించాలని ఇప్పటికే అటవీశాఖతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ము న్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రీన్ సిటీగా ఎదిగేందుకు దేశంలో ఏ నగరానికీ లేనన్ని అవకాశాలు హైదరాబాద్‌కు ఉన్నాయని సీఎం అభిప్రాయపడుతున్నారు. ఈమేరకు రాజ ధానిలో దాదాపు 1.60 లక్షల ఎకరాల్లో అటవీ భూములున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నగరం విస్తరిస్తున్న కొద్దీ అటవీ స్థలాలు, పార్కులు కబ్జాకు గురవుతున్నాయని, దీంతో పచ్చదనం కనుమరుగై పర్యావరణం విషతుల్యమవుతోందని.. తక్షణమే మేలుకోవాల్సిన అవసరముందని సీఎం సంబంధిత అధికారులను పురమాయించారు.
సిటీ మధ్యలో, చుట్టూరా ఉన్న అటవీ భూములను ఎకో పార్కులుగా అభివృద్ధి చేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నా రు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయనున్నారు. వనస్థలిపురంలోని రిజర్వు ఫారెస్టు, ఘట్‌కేసర్ మండలం నారపల్లిలో రిజ ర్వు ఫారెస్టు, మేడ్చల్ మండలం కండ్లకోయలో రిజర్వు ఫారెస్టు స్థలాలను ఆయన స్వయంగా పరిశీలించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కండ్లకోయలో నేచర్ పార్కును ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏడాది వ్యవధిలో ఈ పార్కును నిర్మించేందుకు ప్రాజెక్టు రిపోర్టును రూపొందిం చింది. దీంతో పాటు వరంగల్ రహదారిపై నారపల్లి పార్కు, విజయవాడ రహదారిపై వనస్థలిపురం అటవీభూమిని నందనవనంగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను సీఎం తన పర్యటనలో సమీక్షించనున్నారు. అలాగే హైదరాబాద్‌లో మూసీ పరీవాహక ప్రాంతంలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి ప్రాజెక్టుపై సీఎం సమీక్ష జరిపే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి.
రేపు సీఎం వరంగల్ పర్యటన : వరంగల్‌ను వస్త్రోత్పత్తి ఖిల్లాగా తీర్చిదిద్దేందుకు కావలసిన స్థలాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ సోమ వారం వరంగల్ జిల్లాలో ఏరియల్ సర్వేకు వెళుతున్నారు. సూరత్, షోలాపూర్, తిర్పూర్‌ను తల పించేలా వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కును నిర్మిం చాలని ఇటీవలే సీఎం నిర్ణయిం చారు. వరంగల్ సిటీకి 10 కిలోమీటర్ల దూరం లో హైదరాబాద్ రూట్‌లో ఉన్న మడికొండ ప్రాంతంలో 60 ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌టైల్ పార్కును నిర్మించనున్నారు.
ఏరియల్ సర్వే సందర్భంగా కేసీఆర్ ఈ స్థలాలను పరిశీలించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో పాటు అదే జిల్లాలో కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్‌లో ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమలు స్థాపించే అవకాశముందో ముఖ్యమంత్రి అదే రోజున అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.