Green Belt
-
గ్రీన్ బెల్ట్ ను సైతం మింగేసి ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు
-
గ్రీన్‌బెల్ట్‌ను మింగేసి..
కూటమి ప్రభుత్వంలో పర్యావరణానికి పాతరేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్చగా అక్రమ నిర్మాణాలకు పూనుకుంటున్నారు. నగర శివార్లలోనే కాదు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రీన్‌బెల్ట్‌ను మింగేసి మరీ భారీ షాపింగ్ మాల్ కట్టేస్తున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల అండదండలతో బిర్లా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న స్థలంలో భారీ వృక్షాలను నరికేసి, గ్రీన్‌బెల్డ్ మీదే కాంక్రీట్ రోడ్డు వేసేసి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు.అధికారులెవరూ అటువైపుగా కన్నెత్తి చూడకుండా ఉండేందుకు తెలివిగా ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధుల కటౌట్లు పెట్టి అది కూటమి నేతలకు సంబంధించిన నిర్మాణంగా కలరింగ్ ఇస్తూ చెలరేగిపోతున్నారు. అధికారులు సైతం మామూలు (రా)గానే కళ్లు మూసుకుని చోద్యం చూస్తున్నారు. విశాఖ సిటీ : విశాఖ నగరంలో బిర్లా జంక్షన్ సమీపంలో ఏఎస్ఎన్ మెగా మాల్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో షాపింగ్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్, మల్టిప్లెక్స్ థియేటర్లు, ఆఫీస్ స్పేప్, ఫంక్షన్ హాల్, రెస్టారెంట్, కేఫ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడు ఈ మాల్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇక్కడ గ్రీన్‌బెల్ట్‌ను కప్పేసి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వరకు 40, 60 అడుగుల వెడల్పుతో నాలుగు రోడ్లు వేశారు. గ్రీన్ బెల్ట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ వేసిన ఫెన్సింగ్‌ను తొలగించడంతోపాటు ఆ ఏరియా మొత్తాన్ని కలిపేసుకొని మరీ బౌండరీ వాల్ నిర్మాణం చేపట్టారు. అందులో కల్వర్టులు, డ్రైనేజీలు నిర్మించారు. గ్రీన్ బెల్ట్‌లో గత ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కలు, అభివృద్ధి చేసిన పార్కులను ధ్వంసం చేశారు. కళ్లు మూసుకున్న అధికారులు జాతీయ రహదారిలో గ్రీన్‌బెల్ట్‌ను కప్పేసి, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని భారీ మాల్ నిర్మిస్తున్నా జీవీఎంసీ అధికారులు కళ్లుమూసుకునే ఉన్నారు. కొన్ని నెలలుగా ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నా అధికారులు అటువైపుగా కనీసం కన్నెత్తి చూడలేదు. మామూళ్ల మత్తులో జోగుతూ నిర్మాణదారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో.. కూటమి ప్రజాప్రతినిధుల అండదండలతో గ్రీన్ బెల్ట్‌ను ఆక్రమించి చేపడుతున్న ఈ మెగా మాల్ అక్రమ నిర్మాణంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయంశమవుతోంది. గ్రీన్‌బెల్ట్‌ను దెబ్బతీసి, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మాల్ నిర్మాణం చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అధికారుల్లో కదలిక వచ్చింది. వెంటనే ఆ నిర్మాణాలు తొలగించేందుకు జేసీబీని సైతం పంపించారు. తీరా అక్కడకు వెళ్లిన తరువాత కేవలం కాంపౌడ్ వాల్, కల్వర్టు, కొంచెం విస్తీర్ణంలో మాత్రమే రహదారిని తొలగించి చేతులు దులుపేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత విశాఖలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. శివారు ప్రాంతాల్లోనే కాకుండా కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్డును ఆనుకొని ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కొన్ని, సీఆర్‌జెడ్ అనుమతులు లేకుండా మరికొన్ని కట్టడాలు జరుగుతున్నాయి. బిర్లా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని పర్యావరణాన్ని దెబ్బతిస్తూ భారీ షాపింగ్ మాల్ నిర్మాణం జరిగిపోతోంది. కూటమి ప్రజాప్రతినిధుల ఆశీర్వాదాలతో ఈ తరహా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మన ప్రాణ బంధువు చెట్టుతో చుట్టరికమేమైంది?
చెట్లతో మనిషి పెనువేసుకున్న అనుబంధాలెన్నో... పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు దానితో మమేకమయ్యే ఉంటాడు. ఒకప్పుడు చెట్టుతో ఆడుకునే కోతికొమ్మచ్చి లాంటి ఆటలెన్నో ఉండేవి. దాని కింద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు చాలా మంది. కాలం మారింది. చెట్టును మరిచి కాంక్రీట్ జంగిల్లో మనిషి ఒంటరిగా మిగిలాడు. నేడు అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినం సందర్భంగా సిటీ పరిస్థితి ఇదీ.. సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం.. ఒకప్పుడు తోటల నగరంగా ఎంతో ప్రసిద్ధి. భాగ్ అంటేనే తోటల నగరం అని అర్థం. ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేసేది. నగరమంతా పచ్చని దుప్పటి కప్పుకున్నట్లు కళకళలాడేది. అహ్లాదానికి అడ్డాగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తి మారింది. ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్లా దర్శనమిస్తోంది. నగరానికి ఊపిరాడకుండా తయారయింది. గ్రేటర్లో పెరుగుతున్న వేడిమికి... వర్షపాతలేమికి నగరంలో గ్రీన్‌బెల్ట్ గణనీయంగా తగ్గడమే కారణమని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానగరంలో గ్రీన్‌బెల్ట్‌ను పెంచేందుకు ప్రభుత్వం ‘హరిత’సంకల్పాన్ని చేపట్టింది. ఇళ్లలో పెంచుకునే మొక్కలతో గ్రీన్‌టాప్ పెరగదని, రావి, మద్ది, వేప, చింత వంటి మహావృక్షాలను మహోద్యమంగా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. ఆదివారం అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినం సందర్భంగా మహానగరంలో హరిత వాతావరణంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం... హరిత సంకల్పం.. శతాబ్దాలుగా తోటల నగరం(భాగ్)గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇప్పుడు హరిత వాతావరణం తగ్గుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండటంతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగర పర్యావరణం త్వరగా వేడెక్కుతోంది. మహానగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఉద్యమస్ఫూర్తితో ‘హరిత’సంకల్పం చేపట్టింది. అయితే ఇది ఇంకా ఆశించిన ఫలితం రాలేదని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. హరితహారంలో గతేడాది 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి లాంటి మొక్కలను పంపిణీ చేశారని... ఆక్సీజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు 5 శాతమే నాటినట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పంచుతున్నవి ఇవి.... తులసీ, ఆశ్వగంధ, అల్లోవేరా, కలబంద, లెమన్ గ్రాస్, లావెండర్, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, వేప, కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, నందివర్ధనం, జాస్మిస్, మంచారం, ఇతర పూల మొక్కలు. పంచాల్సినవి ఇవి... రావి, మద్ది, మర్రి, చింత వంటి మహా వృక్షాలుగా ఎదిగే మొక్కలు. -
హరిత హరివిల్లు.. నగరంలో నిల్లు!
సాక్షి, హైదరాబాద్ : తోటల నగరంగా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో హరిత హననం జరుగుతోంది. శరవేగంగా విస్తరిస్తున్న రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు, ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వాణిజ్య సముదాయాలతో విశ్వనగరి కాంక్రీట్ మహారణ్యంలా మారుతోంది. కాంక్రీట్ విస్తరణకు అనుగుణంగా గ్రీన్‌బెల్ట్ పెరగకపోవడంతో మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కార్బన్డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ఉద్గారాలతో వాతావరణం త్వరగా వేడెక్కు తోంది. దీంతో స్వచ్ఛ ఆక్సిజన్‌ను.. స్వేచ్ఛగా పీల్చే పరిస్థితి ఉండటం లేదు. ప్రాణవాయువు అందక నగరవాసులు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్ (హరిత వాతావ రణం) ఉండాల్సి ఉండగా.. కేవలం 8 శాతమే ఉండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఓ వృక్షం.. 260 పౌండ్ల ఆక్సిజన్ ఒక భారీ వృక్షం ఏటా 260 పౌండ్ల (సుమారు 118 కిలోలు) ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చుకోవాలంటే నలుగురు సభ్యులున్న ఓ కుటుంబానికి ఇలాంటి నాలుగు వృక్షాల చొప్పున అందుబాటులో ఉండాల్సిందే. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో ఆ పరిస్థితి లేదు. మహా నగరంలో ఒక్కో కుటుంబానికి సరాసరిన రెండు చెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితి కారణంగానే నగరవాసులు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరయ్యే దుస్థితి తలెత్తింది. ప్రతివ్యక్తికి తలసరిగా అవసరమైన హరిత శాతం (పర్‌హెడ్ ట్రీ కవర్) జాతీయ స్థాయి సగటు కంటే తక్కువగా భాగ్యనగరంలో ఉండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. జాతీయ సగటు ప్రకారం ప్రతివ్యక్తి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకు, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను గ్రహించేందుకు 10 మీటర్ల హరిత వాతావరణం అవసరం కాగా.. నగరంలో కేవలం 2.6 మీటర్ల హరితం మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఏడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. జాతీయ స్థాయి సగటు కంటే అధిక హరిత శాతంతో చండీగఢ్ ముందుంది. 12 మీటర్ల తలసరి హరితంతో తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీలో 10.2 మీటర్ల హరితం ఉంది. బెంగళూరులో 10 మీటర్లు, కోల్‌కతాలో 8 మీటర్లు, ముంబైలో 7 మీటర్లు, చెన్నై 6 మీటర్లు, హైదరాబాద్‌లో 2.6 మీటర్లు మాత్రమే ఉంది. పలు మెట్రో నగరాల్లో గ్రీన్‌బెల్ట్ శాతం ఇలా హైదరాబాద్‌లో 8 శాతమే గ్రేటర్ హైదరాబాద్ నగరం 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండాలి. కానీ నగరంలో 8 శాతం మాత్రమే ఉంది. సుమారు 12,320 ఎకరాల్లో హరిత వాతావరణం (గ్రీన్‌బెల్ట్) అందుబాటులో ఉంది. దీన్ని కనీసం 24,710 ఎకరాలకు పెంచాల్సి ఉంది. అంటే నగర విస్తీర్ణంలో హరితం శాతం కనీసం 16 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. దేశంలో 35 శాతం గ్రీన్‌బెల్ట్‌తో చండీగఢ్ తొలిస్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో 20.2 శాతం, గ్రీన్ సిటీగా పేరొందిన బెంగళూరులో 19 శాతం, కోల్‌కతాలో 15 శాతం, ముంబైలో 10 శాతం, చెన్నైలో 9.5 శాతం గ్రీన్‌బెల్ట్ ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో హరితం 8 శాతానికే పరిమితమైంది. ఇలా చేస్తే మేలు.. నగరంలోని ప్రధాన రహదారులు, 185 చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటాలి. తద్వారా భూగర్భ జల మట్టాలు పెరుగుతాయి. పర్యావరణ కాలుష్యం కూడా బాగా తగ్గుతుంది. విశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్న వారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. జల వనరులకూ శాపం మహా నగరంలో చెరువులు, కుంటలకు పట్టణీకరణ శాపంగా పరిణమిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న సుమారు 3,500 చెరువులు, కుంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. ఆయా భూములు కబ్జాకు గురవడం, విల్లాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, బహుళ అంతస్తుల భవంతులు వెలియడంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి. పర్యావరణ సంస్థ నీరి (ఎన్ఈఈఆర్ఐ) 2005–2018 మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకొని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. ఔటర్‌కు లోపల చిన్న, పెద్ద చెరువులు, కుంటల సంఖ్య 3,500 వరకు ఉంది. వీటి విస్తీర్ణం 2005లో సుమారు 30,978 ఎకరాలుగా ఉండేది. తర్వాత రియల్ రంగం పురోగమించడం, పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వలసలు అధికమవడంతో శివార్లలో పరిస్థితి మారింది. ఇదే క్రమంలో అక్రమార్కుల కన్ను విలువైన జలాశయాలపై పడింది. జీవో 111 పరిధిలో ఉన్న గ్రామాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు, రియల్ వెంచర్లు, వాణిజ్య స్థలాలు, బహుళ అంతస్థుల భవంతులు వెలిశాయి. ఒకప్పుడు పచ్చటి పంట పొలాలు, నిండు కుండలను తలపించే చెరువులు, కుంటలతో కళకళలాడిన ప్రాంతాలు ఇప్పుడు కాంక్రీట్ మహారణ్యంగా దర్శనమిస్తున్నాయి. 30,978 ఎకరాలుగా ఉన్న చెరువులు, కుంటల విస్తీర్ణం.. 5,641 ఎకరాలకు చేరింది. గత 13 ఏళ్ల కాలంలో సుమారు 80 శాతం తగ్గిపోయింది. ఇందుకు పట్టణీకరణ ప్రభావం ఒక కారణమైతే, రెవెన్యూ, పంచాయతీరాజ్, చిన్న నీటిపారుదల శాఖల నిర్లక్ష్యం మరో కారణంగా ఉందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు: జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త ప్రభుత్వం ప్రారంభించిన మూడో విడత హరితహారంలో నాటిన మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచుతున్నవే ఉన్నాయి. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి, ఆక్సిజన్ అందించేవి, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప, రావి, మర్రి, మద్ది, చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్ పెరుగుతుంది. అలా ఆక్సిజన్ శాతం పెరిగి నగరవాసులకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. సర్కారు హరితహారంతో వల్ల నర్సరీల నిర్వాహకులకే లాభం చేకూరింది. -
హరిత హననం.. భవిత గగనం..
‘వృక్షో రక్షతి రక్షితః’.. అంటే వృక్షాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని అర్థం. పెద్దలు చెప్పే ఈ మాటను.. మనం చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. కానీ ప్రకృతి నుంచి ఎంతో లబ్ధి పొందుతున్న మనం దాని పరిరక్షణకు ఏం చేశామని ప్రశ్నించుకుంటే.. సరైన సమాధానం ఉండదు. దీని ఫలితమే ఇప్పుడు ఊపిరి తీసుకోవడానికీ జనం ఉక్కిరిబిక్కిరి అయ్యే దుస్థితి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ సువిశాల నగరంలో స్వచ్ఛమైన వాయువు పీల్చేందుకు అవసరమైన హరిత వాతావరణం లేక హైదరాబాదీలు సతమతం అవుతున్నారు. తలసరిగా అవసరమైన హరిత(పర్ హెడ్ ట్రీ కవర్) విస్తీర్ణం జాతీయ సగటు కంటే మన విశ్వనగరంలో అతి తక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జాతీయ సగటు ప్రకారం ప్రతీ వ్యక్తి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకు.. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను గ్రహించేందుకు 10 చదరపు మీటర్ల హరిత వాతావరణం అవసరం. కానీ మన భాగ్యనగరంలో కేవలం 2.6 చదరపు మీటర్ల తలసరి హరిత విస్తీర్ణం మాత్రమే ఉంది. వివిధ నగరాల్లో హరిత వాతావరణం స్థితిగతులపై ఇటీవల బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తలసరి హరిత విస్తీర్ణం(పర్ హెడ్ ట్రీ కవర్)లో హైదరాబాద్ ఏడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ సగటు కంటే అధిక తలసరి హరిత విస్తీర్ణంతో చండీగఢ్ ముందుంది. చండీగఢ్ 12 చదరపు మీటర్ల తలసరి హరితంతో తొలి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో ఢిల్లీ, మూడో స్థానంలో బెంగళూరు, నాలుగో స్థానంలో కోల్‌కతా, ఐదో స్థానంలో ముంబై, ఆరో స్థానంలో చెన్నై ఉన్నాయి. 2.6 చదరపు మీటర్ల తలసరి హరిత విస్తీర్ణంతో హైదరాబాద్ ఏడో స్థానంలో ఉంది. ఇక 35 శాతం హరిత వాతావరణం(గ్రీన్‌బెల్ట్)తో ప్రణాళికాబద్ధ నగరం చండీగఢ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. గ్రీన్‌బెల్ట్ విషయంలోనూ హైదరాబాద్ ఏడో స్థానంలోనే ఉంది. – సాక్షి, హైదరాబాద్ గ్రేటర్లో గ్రీన్‌బెల్ట్ 8 శాతమే.. గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. అంటే 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో నగరం విస్తరించి ఉంది. అయితే నగర విస్తీర్ణంలో హరితం 8 శాతం మాత్రమే. మహానగరంలో సుమారు 12,320 ఎకరాల్లో హరిత వాతావరణం(గ్రీన్‌బెల్ట్) అందుబాటులో ఉంది. జాతీయ సగటు ప్రకారం దీన్ని 24,710 ఎకరాలకు పెంచాల్సి ఉంది. అంటే మొత్తం నగర విస్తీర్ణంలో హరిత శాతం కనీసం 16 శాతానికి పెంచాల్సిన ఆవశ్యకత ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. గ్రేటర్లో హరిత హననం.. తోటల నగరం(భాగ్)గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇప్పుడు హరిత వాతావరణం(గ్రీన్‌బెల్ట్) రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండటంతో నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారి క్రమంగా వేడెక్కుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండాల్సి ఉండగా.. నగరంలో 8 శాతమే ఉండటంతో ప్రాణవాయువు కరువై నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరం విస్తరించినంతగా గ్రీన్‌కవర్ పెరగకపోవడానికి తోడు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న గ్రీన్హౌస్ వాయువులైన కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాల వల్ల భూతాపం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే మేలు.. నగరంలోని ప్రధాన రహదారులు, 1,500 చెరువుల చుట్టూ భారీగా మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ పెంచాలి. తద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు తవ్వుతామని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలి. నూతనంగా ఏర్పడే కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. కొత్త లేఅవుట్లకు అనుమతి ఇచ్చే సమయంలో గ్రీన్ కవర్‌ను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు.. హరితహారంలో నాటిన మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచుతున్నవే. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. వేప, రావి, మర్రి, మద్ది, చింత వంటి సంప్రదాయ చెట్లను ఎక్కువగా నాటితే గ్రీన్‌బెల్ట్ విస్తరించి నగరంలో ఆక్సిజన్ శాతం పెరిగి నగరవాసులకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. – జీవానందరెడ్డి, పర్యావరణవేత్త హరిత హారంతో లక్ష్యం చేరడం గగనమే.. ఈ ఏడాది జూన్, జూలైలో జీహెచ్ఎంసీ చేపట్టిన హరితహారంలో జీహెచ్ఎంసీ పరిధిలో కోటి మొక్కలు.. హెచ్ఎండీఏ పరిధిలో కోటీ పది లక్షల మొక్కలు నాటారు. ప్రధానంగా ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూల మొక్కలను 95 శాతం పంపిణీ చేశారు. ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని అందించే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో 5 శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు చెపుతున్నారు. తాజా కార్యక్రమంతో గ్రీన్‌బెల్ట్ 8 శాతం నుంచి 16 శాతానికి పెరగడం అసాధ్యమంటున్నారు. -
కథ.. మాటలు.. స్క్రీన్ ప్లే..
అమరావతిలో టీడీపీ కొత్త నాటకం గ్రీన్‌బెల్ట్ అంశంపై మొసలికన్నీరు మంత్రులు అలా... ప్రజాప్రతినిధులు ఇలా... రాజధానిలో ఏం జరుగుతోందో నేతలకు తెలియదా? బాబు డెరైక్షన్‌లో టీడీపీ నేతల వింత నాటకాలు విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డెరైక్షన్‌లో రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కొత్త నాటకాలకు తెర తీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు పూటకో మాట మాట్లాడుతూ నాటకాలను రక్తి కట్టిస్తున్నారు. ఏ విషయంలోనూ స్పష్టత ఇవ్వకుండా ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. సీఎం మార్గదర్శనంలో అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు భూముల యజమానులను మరోమారు మాయల్లో ముంచేసే ప్రణాళికలు రచిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతాన్ని టీడీపీ రియల్ ఎస్టేట్‌గా ఇప్పటికే మార్చేసిన చంద్రబాబు, కోటరీ చివరివరకు తమకు అనుకూలంగా వ్యవహారాలు నడిపేందుకు వీలుగా రైతులను మభ్యపెడుతున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పుడే తెలిసిందా? రాజధాని ప్రాంత స్థూల ప్రణాళికలో ఏపీసీఆర్డీఏ ప్రతిపాదించిన వ్యవసాయ పరిరక్షణ జోన్ల అంశం ఇప్పుడే తెలిసినట్లు, వెనువెంటనే కళ్లు తెరిచినట్లు కృష్ణా జిల్లాకు చెందిన తెదేపా ఎంపీలు కేశినేని శ్రీనివాస్ (నాని), కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, వల్లభనేని వంశీమోహన్, ఎమ్మెల్సీలు వై.వి.బి.రాజేంద్రప్రసాద్, ఎ.ఎస్.రామకృష్ణ తదితరులు వ్యవహరిస్తున్నారు. రాజధాని స్థూల ప్రణాళికపై కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఇటీవల విజయవాడలో సీఆర్డీఏ నిర్వహించిన సదస్సులో ప్రజాప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ రైతులు ఎంతోకాలంగా నెత్తీనోరూ బాదుకుంటున్నా ప్రజాప్రతినిధుల్లో చలనం రాలేదు. మరోవైపు మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావులు గ్రీన్‌బెల్ట్ జోన్ల వల్ల ఎవరికీ నష్టం రాదని పదేపదే విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ ఊదరగొడుతున్నా స్పందించలేదు. 15 లక్షల ఎకరాల పరిధిలో... గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 58 మండలాల్లో 8,603.32 చదరపు కిలోమీటర్లలో సీఆర్డీఏ పరిధి విస్తరించింది. మాస్టర్ ప్లాన్‌లోని 63.23 శాతం ప్రాంతాన్ని వ్యవసాయ పరిరక్షణ జోన్లు 1, 2, 3 కింద పేర్కొన్నందున సుమారు 15 లక్షల ఎకరాల భూమి ఈ జోన్ల కిందకు వస్తుంది. సింగపూర్ అందజేసిన ప్రణాళికల ప్రకారం ఈ భూముల్లో వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేదు. వ్యవసాయం, దాని అనుబంధ పనులే చేపట్టాలి. జోన్లను ప్రకటించిన తరువాత రెండు జిల్లాల్లోని 50 మండలాల్లో భూముల విలువలు పడిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది నుంచి సుమారు 5000 ఎకరాలకు పైగా క్రయవిక్రయాలు ఆగిపోయాయనేది అంచనా. లే అవుట్లు వేయడం లేదు. గృహనిర్మాణం తగ్గింది. భవన నిర్మాణ రంగం కార్మికులకు పనులు సన్నగిల్లాయి. రాజధాని వస్తున్నందున గృహాలకు డిమాండు పెరుగుతోంది. ఆ దష్ట్యా గృహ నిర్మాణం వేగం అందుకోవాలి. ప్రభుత్వ ఆంక్షలు, నిర్వాకం వల్ల డిమాండుకు అనుగుణంగా నిర్మాణాలు జరగడం లేదు. 2500 ఎకరాల లే అవుట్లకు దరఖాస్తు చేయగా సీఆర్డీఏ తిరస్కరించింది. దీనికి సంబంధించి రూ.200 కోట్లను ల్యాండ్ కన్వర్షన్ (నాలా) కింద ప్రభుత్వం రాబట్టుకుంది కూడా. పదకొండు నెలలుగా పట్టించుకోలేదు... వ్యవసాయ పరిరక్షణ జోన్ల కింద చేర్చినందున తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజాప్రతినిధులు తాజాగా ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం హాస్యాస్పదంగా ఉంది. గ్రామాల్లోని ద్వితీయశ్రేణి నాయకులు తమను వ్యతిరేకిస్తున్నారని, పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయని వాపోతున్నారు. వాస్తవంగా తొలి మాస్టర్ ప్లాన్ 2015 మార్చిలో బయటకు వచ్చింది. దీనిపై సీఎం, మున్సిపల్ మంత్రి తదితరులు ఎప్పటికప్పుడు సింగపూర్ ప్రణాళికాకర్తలకు మార్పులు చేర్పులు సూచిస్తూ వచ్చారు. గత ఏడాది డిసెంబరు 25న మరో ముసాయిదా వచ్చింది. గోదావరి పుష్కరాల సమయంలో దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయినా 11 నెలలుగా మౌనం వహించిన నేతలకు ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లు వ్యవహరిస్తున్నారు. అందరి అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని సీఆర్డీఏ కమిషనర్ సదస్సు సందర్భంగా చెప్పడం మరీ విడ్డూరం. ముఖ్యమంత్రే సూత్రధారి.. ఆయన దృష్టికే తీసుకెళతారట సింగపూర్, జపాన్, చైనా దేశాల గురించి జపం చేస్తున్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన డెరైక్షన్లోనే మాస్టర్‌ప్లాన్ రూపకల్పన జరిగింది. ఆయనకు తోడు మంత్రి నారాయణ. అలాంటిది సీఎం దృష్టికి తీసుకెళతానని సీఆర్డీఏ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు, ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే సామాజికవర్గం రైతులు వ్యవసాయ పరిరక్షణ జోన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో వారిని మభ్యపెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శకత్వంలో ప్రజాప్రతినిధులు మొసలికన్నీరు కారుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తప్పంతా అధికారులదే అన్నట్లు వారిపై నెపం నెట్టేసి సమయాన్ని నెట్టుకు రావాలనేది ప్రజాప్రతినిధుల ఎత్తుగడగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ జోన్ల వల్ల నష్టం ఏమాత్రం ఉండదని మంత్రులు నారాయణ, దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావులు ప్రెస్మీట్లు పెట్టి చెప్పిన అంశాన్ని ప్రజాప్రతినిధులు ప్రశ్నించడంలేదు. పాత జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ల ప్రకారం ఎందుకు ప్లాన్లు ఇవ్వడంలేదని నిలదీయడం లేదు. దీన్నిబట్టి వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తేటతెల్లం అవుతోంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్లను అడ్డంగా పెట్టుకుని వారికి అనుకూలంగా వ్యవహరించడానికి అమరావతి ప్రాంతాన్ని టీడీపీ రియల్ ఎస్టేట్‌గా చంద్రబాబు మార్చిన సంగతిని స్థానికులు, రైతులు గుర్తించిన నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులు ఉత్తుత్తి ఆగ్రహావేశాలను అధికారులపై వ్యక్తం చేశారని ప్రతిపక్ష పార్టీల నేతలు గుర్తుచేస్తున్నారు. రైతులు కోరుతున్న రీతిలో వ్యవసాయ పరిరక్షణ జోన్లు, ఇతర ఆంక్షలను ఎత్తివేయకపోతే ప్రజాప్రతినిధులు రైతుల తరఫున నిలబడతారా అన్నదే ప్రశ్న. ఎందుకంటే ఆడింది, ఆడించేది ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు భిన్నంగా టీడీపీ నేతలు నోరెత్తుతారా అన్నదే సందేహం. అమరావతిలో మాస్టర్ డెవలపర్‌గా రాబోతున్న సింగపూర్, జపాన్ తదితర దేశాల కంపెనీల వ్యాపార ప్రయోజనాలు కాపాడటానికి ముఖ్యమంత్రి రెండు జిల్లాల్లో ఆంక్షలు విధిస్తున్నారని, అమరావతిలో రియల్ ఎస్టేట్, గృహాలు, వాణిజ్య సముదాయాల అమ్మకాలు జరిగే వరకు అనుమతులు ఇవ్వవద్దని విదేశీయులు ఆంక్షలు పెట్టారని, అందుకు అనుగుణంగానే సీఎం నేతృత్వంలో సీఆర్డీఏ నడుచుకుంటోందని సీపీఎంకి చెందిన రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్ సీహెచ్ బాబూరావు ఆరోపించారు. సీఎం, ఆయన కోటరీ ప్రయోజనాల కోసం రెండు జిల్లాల్లోని రైతులను దారుణంగా మోసగిస్తున్నారని, వారి ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. -
'వాస్తు పేరుతో రైతులకు అన్యాయం'
విజయవాడ: నూజివీడులో ప్రభుత్వ భూమి 55 వేల ఎకరాలు ఉన్నప్పటికీ.. వాస్తు పేరుతో భూములు లాక్కొని చంద్రబాబు రైతులకు అన్యాయం చేశారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఆదివారం హనుమాన్ జంక్షన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని పేరుతో రైతుల నుండి భూములు లాక్కొని, వాటిని 99 ఏళ్లు పరాయి దేశానికి అప్పగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాజధాని నిర్మాణంలో గ్రామాల జోలికి వెళ్లమని చెప్పిన చంద్రబాబు.. రోడ్ల నిర్మాణం పేరుతో గ్రామాలను ఖాళీ చేయించడం దారుణమైన చర్య అన్నారు. గ్రీన్ బెల్ట్ విధానం ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్న ఆయన 30 మండలాలను గ్రీన్ బెల్ట్‌గా చేయడం సబబు కాదన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్న ప్రతిపక్ష నేతలపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి నోరు మూయించాలనుకోవడం చంద్రబాబు అవివేకమన్నారు. -
ఆక్సిజన్ సిటీగా హైదరాబాద్
నగరం చుట్టూ హరిత వనాలు మూసీ తీరం పొడవునా గ్రీన్ బెల్ట్ ప్రణాళికను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం నేడు ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే సాక్షి, హైదరాబాద్: కాలుష్యపు కోరల్లో చిక్కిన హైదరాబాద్ మహా నగరవాసులకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం బృహత్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ దిశలో భవిష్యత్తులో భాగ్యనగరాన్ని ఆక్సిజన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కాంక్రీట్ వనంగా మారిన మహానగరంలో హరిత వనాలకు అనువైన స్థలాలను గుర్తించాలని ఇప్పటికే అటవీశాఖతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ము న్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ సిటీగా ఎదిగేందుకు దేశంలో ఏ నగరానికీ లేనన్ని అవకాశాలు హైదరాబాద్‌కు ఉన్నాయని సీఎం అభిప్రాయపడుతున్నారు. ఈమేరకు రాజ ధానిలో దాదాపు 1.60 లక్షల ఎకరాల్లో అటవీ భూములున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నగరం విస్తరిస్తున్న కొద్దీ అటవీ స్థలాలు, పార్కులు కబ్జాకు గురవుతున్నాయని, దీంతో పచ్చదనం కనుమరుగై పర్యావరణం విషతుల్యమవుతోందని.. తక్షణమే మేలుకోవాల్సిన అవసరముందని సీఎం సంబంధిత అధికారులను పురమాయించారు. సిటీ మధ్యలో, చుట్టూరా ఉన్న అటవీ భూములను ఎకో పార్కులుగా అభివృద్ధి చేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నా రు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయనున్నారు. వనస్థలిపురంలోని రిజర్వు ఫారెస్టు, ఘట్కేసర్ మండలం నారపల్లిలో రిజ ర్వు ఫారెస్టు, మేడ్చల్ మండలం కండ్లకోయలో రిజర్వు ఫారెస్టు స్థలాలను ఆయన స్వయంగా పరిశీలించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కండ్లకోయలో నేచర్ పార్కును ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏడాది వ్యవధిలో ఈ పార్కును నిర్మించేందుకు ప్రాజెక్టు రిపోర్టును రూపొందిం చింది. దీంతో పాటు వరంగల్ రహదారిపై నారపల్లి పార్కు, విజయవాడ రహదారిపై వనస్థలిపురం అటవీభూమిని నందనవనంగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను సీఎం తన పర్యటనలో సమీక్షించనున్నారు. అలాగే హైదరాబాద్‌లో మూసీ పరీవాహక ప్రాంతంలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి ప్రాజెక్టుపై సీఎం సమీక్ష జరిపే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రేపు సీఎం వరంగల్ పర్యటన : వరంగల్‌ను వస్త్రోత్పత్తి ఖిల్లాగా తీర్చిదిద్దేందుకు కావలసిన స్థలాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ సోమ వారం వరంగల్ జిల్లాలో ఏరియల్ సర్వేకు వెళుతున్నారు. సూరత్, షోలాపూర్, తిర్పూర్‌ను తల పించేలా వరంగల్‌లో టెక్స్టైల్ పార్కును నిర్మిం చాలని ఇటీవలే సీఎం నిర్ణయిం చారు. వరంగల్ సిటీకి 10 కిలోమీటర్ల దూరం లో హైదరాబాద్ రూట్లో ఉన్న మడికొండ ప్రాంతంలో 60 ఎకరాల విస్తీర్ణంలో టెక్స్టైల్ పార్కును నిర్మించనున్నారు. ఏరియల్ సర్వే సందర్భంగా కేసీఆర్ ఈ స్థలాలను పరిశీలించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో పాటు అదే జిల్లాలో కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్‌లో ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమలు స్థాపించే అవకాశముందో ముఖ్యమంత్రి అదే రోజున అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. -
ప్రశాంతంగా పాస్‌పోర్ట్ మేళా
విశాఖపట్నం : పాస్‌పోర్ట్ మేళా శనివారం ప్రశాంతంగా ముగిసింది. బిర్లా జంక్షన్ దరి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో మేళా జరిగింది. మేళాలో 800 మంది అభ్యర్థులకు అధికారులు అవకాశం కల్పించారు. మూడు రోజుల ముందుగా ప్రత్యేక స్లాట్ బుకింగ్‌తో అభ్యర్థులు మేళాలో పాల్గొనేలా చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వాసులు మేళాలో పాల్గొనవచ్చని ప్రకటించారు. స్లాట్ బుకింగ్‌లో తెలిపిన సమయం ప్రకారం అభ్యర్థులకు అవకాశం కల్పించారు. త్వరతిగతిన సేవలు లభించడంతో పనులు వేగవంతంగా ముగిశాయి. దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న అభ్యర్థులు ఎండవేడిమికి అవస్థలు పడ్డారు. గ్రీన్ బెల్ట్‌లోని చెట్ల కింద కూర్చొని సేదతీరారు. ప్రస్తుతం స్లాట్ బుకింగ్ పొందడానికి సుమారు నెలన్నర రోజులకు పైగా పడుతుండగా, మేళా నిర్వాహణ ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలో పాస్‌పోర్ట్ సేవలు లభ్యం కావడంతో అభ్యర్థుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈనెల 28న మరోసారి మేళా నిర్వహిస్తున్నట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. -
కాముని చెరువుపై జీఎంఆర్ కన్ను!
శంషాబాద్ పరిధిలో తాగు, సాగు నీటి అవసరాల కోసం నిజాం కాలంలో కాముని చెరువు 166 ఎకరాల్లో తవ్వించారు. అంచనాలకు అనుగుణంగానే ఏళ్లపాటు ఈ చెరువు తాగునీరు, సాగునీరందించి మత్స్యకారులకు, దోభీఘాట్ అవసరాలకు ఉపయోగపడింది. ఈ చెరువు మూలంగా భూగర్భజలాలు వృద్ధి చెందాయి. అయితే నిర్వహణ సరిగాలేక ఈ మధ్యకాలంలో పలుచోట్ల నుంచి పిల్లకాలువల ద్వారా వ్యర్థాలు అధిక మొత్తంలో వచ్చి చెరువును కలుషితం చేస్తున్నాయి. గ్రీన్‌బెల్ట్ పేరిట.. విమానాశ్రయంలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం కాముని చెరువు నీటిని వినియోగించుకుంటామని 2012, మే 23న నీటిపారుదల ముఖ్య కార్యదర్శికి జీఎంఆర్ సంస్థ వినతి పత్రాన్ని అందజేసింది. చెరువు కింద ఎలాంటి ఆయకట్టు లేదని, ఆ నీటిని ఎందుకూ వినియోగించడంలేదని అందులో పేర్కొంది. అయితే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. శంషాబాద్ పట్టణంలో సుమారు నలభై వేల జనాభా, మూడు వేలకుపైగా ఇళ్లు, భవనాలు ఉన్నాయి. ఇప్పటివరకు పట్టణానికి ఎలాంటి తాగునీటి ఆధారం లేదు. కేవలం పంచాయతీ పరిధిలోనే నీటి సరఫరాకు 62 బోర్లను వినియోగిస్తున్నారు. ఇక ఇళ్లలో సుమారు 1500పైగా సొంత బోర్లు ఉన్నట్లు అధికారిక సమాచారం. పట్టణానికి చెరువు ఎగువ భాగంలో ఉండడంతో కింద ఉన్న మధురానగర్, ఆర్బీనగర్, ఆదర్శకాలనీ, రాళ్లగూడ తదితర బస్తీలో కాముని చెరువులో నీళ్లు ఉన్నప్పుడే బోర్లలో నీళ్లు చేరుతాయి. స్థానికంగా భూగర్భజలాలు ఉండడానికి ఈ చెరువే ప్రధాన కారణం. హిమాయత్‌సాగర్‌కూ దెబ్బే.. ప్రస్తుత శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతంతోపాటు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరంతా హిమాయత్‌సాగర్ వైపు వెళ్లేది. దీంతో నిజాం కాలం నాడే స్థానిక ప్రజల ఉపయోగార్థం ఈ చెరువు నిర్మాణం చేశారు. ఈ చెరువు నిండితే నీరు జోష్ కుంటవైపు వెళ్లి అక్కడి నుంచి సిద్దులగుట్ట, కొత్వాల్‌గూడ గ్రామాల మీదుగా హిమాయత్‌సాగర్‌కు చేరుకుంటుంది. విమానాశ్రయ అవసరాలకు ఈ చెరువు నీటిని వాడడం ప్రారంభిస్తే అతి కొద్ది కాలంలోనే ఈ చెరువు ఎండిపోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఎండిపోతే శంషాబాద్‌తోపాటు రాళ్లగూడ, కొత్వాల్‌గూడ గ్రామాలే కాకుండా హిమాయత్‌సాగర్‌కు కూడా నీటి వనరు లేకుండా పోతుంది. ఒప్పుకోమంటున్న స్థానికులు చెరువు నీటిని జీఎంఆర్ సంస్థకు అప్పగిస్తే ఊరుకునేది లేదని స్థానికులు హెచ్చరిస్తున్నారు. సాగునీటి సంఘంతోపాటు స్థానికంగా ఉన్న కిసాన్ రైతు సంఘం, మత్య్సకారులు, దోభీఘాట్ కార్మికులు ఈ విషయంపై ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. చెరువును పరిర క్షించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.