‘వృక్షో రక్షతి రక్షితః’.. అంటే వృక్షాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని అర్థం. పెద్దలు చెప్పే ఈ మాటను.. మనం చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. కానీ ప్రకృతి నుంచి ఎంతో లబ్ధి పొందుతున్న మనం దాని పరిరక్షణకు ఏం చేశామని ప్రశ్నించుకుంటే.. సరైన సమాధానం ఉండదు. దీని ఫలితమే ఇప్పుడు ఊపిరి తీసుకోవడానికీ జనం ఉక్కిరిబిక్కిరి అయ్యే దుస్థితి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ సువిశాల నగరంలో స్వచ్ఛమైన వాయువు పీల్చేందుకు అవసరమైన హరిత వాతావరణం లేక హైదరాబాదీలు సతమతం అవుతున్నారు.
తలసరిగా అవసరమైన హరిత(పర్ హెడ్ ట్రీ కవర్) విస్తీర్ణం జాతీయ సగటు కంటే మన విశ్వనగరంలో అతి తక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జాతీయ సగటు ప్రకారం ప్రతీ వ్యక్తి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకు.. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను గ్రహించేందుకు 10 చదరపు మీటర్ల హరిత వాతావరణం అవసరం. కానీ మన భాగ్యనగరంలో కేవలం 2.6 చదరపు మీటర్ల తలసరి హరిత విస్తీర్ణం మాత్రమే ఉంది. వివిధ నగరాల్లో హరిత వాతావరణం స్థితిగతులపై ఇటీవల బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఓ సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తలసరి హరిత విస్తీర్ణం(పర్ హెడ్ ట్రీ కవర్)లో హైదరాబాద్ ఏడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ సగటు కంటే అధిక తలసరి హరిత విస్తీర్ణంతో చండీగఢ్ ముందుంది. చండీగఢ్ 12 చదరపు మీటర్ల తలసరి హరితంతో తొలి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో ఢిల్లీ, మూడో స్థానంలో బెంగళూరు, నాలుగో స్థానంలో కోల్‌కతా, ఐదో స్థానంలో ముంబై, ఆరో స్థానంలో చెన్నై ఉన్నాయి. 2.6 చదరపు మీటర్ల తలసరి హరిత విస్తీర్ణంతో హైదరాబాద్ ఏడో స్థానంలో ఉంది. ఇక 35 శాతం హరిత వాతావరణం(గ్రీన్‌బెల్ట్)తో ప్రణాళికాబద్ధ నగరం చండీగఢ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. గ్రీన్‌బెల్ట్ విషయంలోనూ హైదరాబాద్ ఏడో స్థానంలోనే ఉంది. – సాక్షి, హైదరాబాద్
గ్రేటర్‌లో గ్రీన్‌బెల్ట్ 8 శాతమే..
గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. అంటే 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో నగరం విస్తరించి ఉంది. అయితే నగర విస్తీర్ణంలో హరితం 8 శాతం మాత్రమే. మహానగరంలో సుమారు 12,320 ఎకరాల్లో హరిత వాతావరణం(గ్రీన్‌బెల్ట్) అందుబాటులో ఉంది. జాతీయ సగటు ప్రకారం దీన్ని 24,710 ఎకరాలకు పెంచాల్సి ఉంది. అంటే మొత్తం నగర విస్తీర్ణంలో హరిత శాతం కనీసం 16 శాతానికి పెంచాల్సిన ఆవశ్యకత ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.
గ్రేటర్‌లో హరిత హననం..
తోటల నగరం(భాగ్)గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇప్పుడు హరిత వాతావరణం(గ్రీన్‌బెల్ట్) రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండటంతో నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారి క్రమంగా వేడెక్కుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండాల్సి ఉండగా.. నగరంలో 8 శాతమే ఉండటంతో ప్రాణవాయువు కరువై నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరం విస్తరించినంతగా గ్రీన్‌కవర్ పెరగకపోవడానికి తోడు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న గ్రీన్‌హౌస్ వాయువులైన కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాల వల్ల భూతాపం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా చేస్తే మేలు..
నగరంలోని ప్రధాన రహదారులు, 1,500 చెరువుల చుట్టూ భారీగా మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ పెంచాలి. తద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు తవ్వుతామని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వారికి జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలి. నూతనంగా ఏర్పడే కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. కొత్త లేఅవుట్లకు అనుమతి ఇచ్చే సమయంలో గ్రీన్ కవర్‌ను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.
ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు..
హరితహారంలో నాటిన మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచుతున్నవే. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. వేప, రావి, మర్రి, మద్ది, చింత వంటి సంప్రదాయ చెట్లను ఎక్కువగా నాటితే గ్రీన్‌బెల్ట్ విస్తరించి నగరంలో ఆక్సిజన్ శాతం పెరిగి నగరవాసులకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. – జీవానందరెడ్డి, పర్యావరణవేత్త
హరిత హారంతో లక్ష్యం చేరడం గగనమే..
ఈ ఏడాది జూన్, జూలైలో జీహెచ్‌ఎంసీ చేపట్టిన హరితహారంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కోటి మొక్కలు.. హెచ్‌ఎండీఏ పరిధిలో కోటీ పది లక్షల మొక్కలు నాటారు. ప్రధానంగా ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూల మొక్కలను 95 శాతం పంపిణీ చేశారు. ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని అందించే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో 5 శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు చెపుతున్నారు. తాజా కార్యక్రమంతో గ్రీన్‌బెల్ట్ 8 శాతం నుంచి 16 శాతానికి పెరగడం అసాధ్యమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment