కూటమి ప్రజాప్రతినిధుల అండదండలతో ఏఎస్‌ఎన్ మెగా మాల్ కన్‌స్ట్రక్షన్
మామూళ్ల మత్తులో కళ్లుమూసుకున్న అధికారులు
కూటమి ప్రభుత్వంలో పర్యావరణానికి పాతరేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్చగా అక్రమ నిర్మాణాలకు పూనుకుంటున్నారు. నగర శివార్లలోనే కాదు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రీన్‌బెల్ట్‌ను మింగేసి మరీ భారీ షాపింగ్ మాల్ కట్టేస్తున్నారు.
కూటమి ప్రజాప్రతినిధుల అండదండలతో బిర్లా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న స్థలంలో భారీ వృక్షాలను నరికేసి, గ్రీన్‌బెల్డ్ మీదే కాంక్రీట్ రోడ్డు వేసేసి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు.
అధికారులెవరూ అటువైపుగా కన్నెత్తి చూడకుండా ఉండేందుకు తెలివిగా ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధుల కటౌట్లు పెట్టి అది కూటమి నేతలకు సంబంధించిన నిర్మాణంగా కలరింగ్ ఇస్తూ చెలరేగిపోతున్నారు. అధికారులు సైతం మామూలు (రా)గానే కళ్లు మూసుకుని చోద్యం చూస్తున్నారు.
విశాఖ సిటీ : విశాఖ నగరంలో బిర్లా జంక్షన్ సమీపంలో ఏఎస్‌ఎన్ మెగా మాల్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో షాపింగ్, గేమింగ్, ఎంటర్‌టైన్మెంట్, మల్టిప్లెక్స్ థియేటర్లు, ఆఫీస్ స్పేప్, ఫంక్షన్ హాల్, రెస్టారెంట్, కేఫ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడు ఈ మాల్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇక్కడ గ్రీన్‌బెల్ట్‌ను కప్పేసి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వరకు 40, 60 అడుగుల వెడల్పుతో నాలుగు రోడ్లు వేశారు.
గ్రీన్ బెల్ట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ వేసిన ఫెన్సింగ్‌ను తొలగించడంతోపాటు ఆ ఏరియా మొత్తాన్ని కలిపేసుకొని మరీ బౌండరీ వాల్ నిర్మాణం చేపట్టారు. అందులో కల్వర్టులు, డ్రైనేజీలు నిర్మించారు. గ్రీన్ బెల్ట్‌లో గత ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కలు, అభివృద్ధి చేసిన పార్కులను ధ్వంసం చేశారు.
కళ్లు మూసుకున్న అధికారులు
జాతీయ రహదారిలో గ్రీన్‌బెల్ట్‌ను కప్పేసి, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని భారీ మాల్ నిర్మిస్తున్నా జీవీఎంసీ అధికారులు కళ్లుమూసుకునే ఉన్నారు. కొన్ని నెలలుగా ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నా అధికారులు అటువైపుగా కనీసం కన్నెత్తి చూడలేదు. మామూళ్ల మత్తులో జోగుతూ నిర్మాణదారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో..
కూటమి ప్రజాప్రతినిధుల అండదండలతో గ్రీన్ బెల్ట్‌ను ఆక్రమించి చేపడుతున్న ఈ మెగా మాల్ అక్రమ నిర్మాణంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయంశమవుతోంది. గ్రీన్‌బెల్ట్‌ను దెబ్బతీసి, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మాల్ నిర్మాణం చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే ఫిర్యాదుతో అధికారుల్లో కదలిక వచ్చింది. వెంటనే ఆ నిర్మాణాలు తొలగించేందుకు జేసీబీని సైతం పంపించారు. తీరా అక్కడకు వెళ్లిన తరువాత కేవలం కాంపౌడ్ వాల్, కల్వర్టు, కొంచెం విస్తీర్ణంలో మాత్రమే రహదారిని తొలగించి చేతులు దులుపేసుకున్నారు.
కూటమి ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలు
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత విశాఖలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. శివారు ప్రాంతాల్లోనే కాకుండా కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్డును ఆనుకొని ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కొన్ని, సీఆర్‌జెడ్ అనుమతులు లేకుండా మరికొన్ని కట్టడాలు జరుగుతున్నాయి.
బిర్లా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని పర్యావరణాన్ని దెబ్బతిస్తూ భారీ షాపింగ్ మాల్ నిర్మాణం జరిగిపోతోంది. కూటమి ప్రజాప్రతినిధుల ఆశీర్వాదాలతో ఈ తరహా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment