'వాస్తు పేరుతో రైతులకు అన్యాయం'
విజయవాడ: నూజివీడులో ప్రభుత్వ భూమి 55 వేల ఎకరాలు ఉన్నప్పటికీ.. వాస్తు పేరుతో భూములు లాక్కొని చంద్రబాబు రైతులకు అన్యాయం చేశారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఆదివారం హనుమాన్ జంక్షన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాజధాని పేరుతో రైతుల నుండి భూములు లాక్కొని, వాటిని 99 ఏళ్లు పరాయి దేశానికి అప్పగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాజధాని నిర్మాణంలో గ్రామాల జోలికి వెళ్లమని చెప్పిన చంద్రబాబు.. రోడ్ల నిర్మాణం పేరుతో గ్రామాలను ఖాళీ చేయించడం దారుణమైన చర్య అన్నారు. గ్రీన్ బెల్ట్ విధానం ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్న ఆయన 30 మండలాలను గ్రీన్ బెల్ట్గా చేయడం సబబు కాదన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్న ప్రతిపక్ష నేతలపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టి నోరు మూయించాలనుకోవడం చంద్రబాబు అవివేకమన్నారు.