కథ.. మాటలు.. స్క్రీన్ ప్లే..
అమరావతిలో టీడీపీ కొత్త నాటకం
గ్రీన్‌బెల్ట్ అంశంపై మొసలికన్నీరు
మంత్రులు అలా... ప్రజాప్రతినిధులు ఇలా...
రాజధానిలో ఏం జరుగుతోందో నేతలకు తెలియదా?
బాబు డెరైక్షన్‌లో టీడీపీ నేతల వింత నాటకాలు
విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డెరైక్షన్‌లో రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కొత్త నాటకాలకు తెర తీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు పూటకో మాట మాట్లాడుతూ నాటకాలను రక్తి కట్టిస్తున్నారు. ఏ విషయంలోనూ స్పష్టత ఇవ్వకుండా ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు.
సీఎం మార్గదర్శనంలో అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు భూముల యజమానులను మరోమారు మాయల్లో ముంచేసే ప్రణాళికలు రచిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతాన్ని టీడీపీ రియల్ ఎస్టేట్‌గా ఇప్పటికే మార్చేసిన చంద్రబాబు, కోటరీ చివరివరకు తమకు అనుకూలంగా వ్యవహారాలు నడిపేందుకు వీలుగా రైతులను మభ్యపెడుతున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పుడే తెలిసిందా?
రాజధాని ప్రాంత స్థూల ప్రణాళికలో ఏపీసీఆర్‌డీఏ ప్రతిపాదించిన వ్యవసాయ పరిరక్షణ జోన్ల అంశం ఇప్పుడే తెలిసినట్లు, వెనువెంటనే కళ్లు తెరిచినట్లు కృష్ణా జిల్లాకు చెందిన తెదేపా ఎంపీలు కేశినేని శ్రీనివాస్ (నాని), కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, వల్లభనేని వంశీమోహన్, ఎమ్మెల్సీలు వై.వి.బి.రాజేంద్రప్రసాద్, ఎ.ఎస్.రామకృష్ణ తదితరులు వ్యవహరిస్తున్నారు.
రాజధాని స్థూల ప్రణాళికపై కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఇటీవల విజయవాడలో సీఆర్‌డీఏ నిర్వహించిన సదస్సులో ప్రజాప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ రైతులు ఎంతోకాలంగా నెత్తీనోరూ బాదుకుంటున్నా ప్రజాప్రతినిధుల్లో చలనం రాలేదు. మరోవైపు మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావులు గ్రీన్‌బెల్ట్ జోన్ల వల్ల ఎవరికీ నష్టం రాదని పదేపదే విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ ఊదరగొడుతున్నా స్పందించలేదు.
15 లక్షల ఎకరాల పరిధిలో...
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 58 మండలాల్లో 8,603.32 చదరపు కిలోమీటర్లలో సీఆర్‌డీఏ పరిధి విస్తరించింది. మాస్టర్ ప్లాన్‌లోని 63.23 శాతం ప్రాంతాన్ని వ్యవసాయ పరిరక్షణ జోన్లు 1, 2, 3 కింద పేర్కొన్నందున సుమారు 15 లక్షల ఎకరాల భూమి ఈ జోన్ల కిందకు వస్తుంది. సింగపూర్ అందజేసిన ప్రణాళికల ప్రకారం ఈ భూముల్లో వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేదు. వ్యవసాయం, దాని అనుబంధ పనులే చేపట్టాలి. జోన్లను ప్రకటించిన తరువాత రెండు జిల్లాల్లోని 50 మండలాల్లో భూముల విలువలు పడిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది నుంచి సుమారు 5000 ఎకరాలకు పైగా క్రయవిక్రయాలు ఆగిపోయాయనేది అంచనా. లే అవుట్లు వేయడం లేదు. గృహనిర్మాణం తగ్గింది. భవన నిర్మాణ రంగం కార్మికులకు పనులు సన్నగిల్లాయి. రాజధాని వస్తున్నందున గృహాలకు డిమాండు పెరుగుతోంది. ఆ దష్ట్యా గృహ నిర్మాణం వేగం అందుకోవాలి.
ప్రభుత్వ ఆంక్షలు, నిర్వాకం వల్ల డిమాండుకు అనుగుణంగా నిర్మాణాలు జరగడం లేదు. 2500 ఎకరాల లే అవుట్లకు దరఖాస్తు చేయగా సీఆర్‌డీఏ తిరస్కరించింది. దీనికి సంబంధించి రూ.200 కోట్లను ల్యాండ్ కన్వర్షన్ (నాలా) కింద ప్రభుత్వం రాబట్టుకుంది కూడా.
పదకొండు నెలలుగా పట్టించుకోలేదు...
వ్యవసాయ పరిరక్షణ జోన్ల కింద చేర్చినందున తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజాప్రతినిధులు తాజాగా ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం హాస్యాస్పదంగా ఉంది. గ్రామాల్లోని ద్వితీయశ్రేణి నాయకులు తమను వ్యతిరేకిస్తున్నారని, పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయని వాపోతున్నారు. వాస్తవంగా తొలి మాస్టర్ ప్లాన్ 2015 మార్చిలో బయటకు వచ్చింది. దీనిపై సీఎం, మున్సిపల్ మంత్రి తదితరులు ఎప్పటికప్పుడు సింగపూర్ ప్రణాళికాకర్తలకు మార్పులు చేర్పులు సూచిస్తూ వచ్చారు. గత ఏడాది డిసెంబరు 25న మరో ముసాయిదా వచ్చింది. గోదావరి పుష్కరాల సమయంలో దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అయినా 11 నెలలుగా మౌనం వహించిన నేతలకు ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లు వ్యవహరిస్తున్నారు. అందరి అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని సీఆర్‌డీఏ కమిషనర్ సదస్సు సందర్భంగా చెప్పడం మరీ విడ్డూరం.
ముఖ్యమంత్రే సూత్రధారి.. ఆయన దృష్టికే తీసుకెళతారట
సింగపూర్, జపాన్, చైనా దేశాల గురించి జపం చేస్తున్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన డెరైక్షన్‌లోనే మాస్టర్‌ప్లాన్ రూపకల్పన జరిగింది. ఆయనకు తోడు మంత్రి నారాయణ. అలాంటిది సీఎం దృష్టికి తీసుకెళతానని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు, ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే సామాజికవర్గం రైతులు వ్యవసాయ పరిరక్షణ జోన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో వారిని మభ్యపెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శకత్వంలో ప్రజాప్రతినిధులు మొసలికన్నీరు కారుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
తప్పంతా అధికారులదే అన్నట్లు వారిపై నెపం నెట్టేసి సమయాన్ని నెట్టుకు రావాలనేది ప్రజాప్రతినిధుల ఎత్తుగడగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ జోన్ల వల్ల నష్టం ఏమాత్రం ఉండదని మంత్రులు నారాయణ, దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావులు ప్రెస్‌మీట్‌లు పెట్టి చెప్పిన అంశాన్ని ప్రజాప్రతినిధులు ప్రశ్నించడంలేదు. పాత జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ల ప్రకారం ఎందుకు ప్లాన్లు ఇవ్వడంలేదని నిలదీయడం లేదు. దీన్నిబట్టి వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తేటతెల్లం అవుతోంది.
సింగపూర్ మాస్టర్ ప్లాన్‌లను అడ్డంగా పెట్టుకుని వారికి అనుకూలంగా వ్యవహరించడానికి అమరావతి ప్రాంతాన్ని టీడీపీ రియల్ ఎస్టేట్‌గా చంద్రబాబు మార్చిన సంగతిని స్థానికులు, రైతులు గుర్తించిన నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులు ఉత్తుత్తి ఆగ్రహావేశాలను అధికారులపై వ్యక్తం చేశారని ప్రతిపక్ష పార్టీల నేతలు గుర్తుచేస్తున్నారు. రైతులు కోరుతున్న రీతిలో వ్యవసాయ పరిరక్షణ జోన్లు, ఇతర ఆంక్షలను ఎత్తివేయకపోతే ప్రజాప్రతినిధులు రైతుల తరఫున నిలబడతారా అన్నదే ప్రశ్న.
ఎందుకంటే ఆడింది, ఆడించేది ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు భిన్నంగా టీడీపీ నేతలు నోరెత్తుతారా అన్నదే సందేహం. అమరావతిలో మాస్టర్ డెవలపర్‌గా రాబోతున్న సింగపూర్, జపాన్ తదితర దేశాల కంపెనీల వ్యాపార ప్రయోజనాలు కాపాడటానికి ముఖ్యమంత్రి రెండు జిల్లాల్లో ఆంక్షలు విధిస్తున్నారని, అమరావతిలో రియల్ ఎస్టేట్, గృహాలు, వాణిజ్య సముదాయాల అమ్మకాలు జరిగే వరకు అనుమతులు ఇవ్వవద్దని విదేశీయులు ఆంక్షలు పెట్టారని, అందుకు అనుగుణంగానే సీఎం నేతృత్వంలో సీఆర్‌డీఏ నడుచుకుంటోందని సీపీఎంకి చెందిన రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్ సీహెచ్ బాబూరావు ఆరోపించారు. సీఎం, ఆయన కోటరీ ప్రయోజనాల కోసం రెండు జిల్లాల్లోని రైతులను దారుణంగా మోసగిస్తున్నారని, వారి ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు.