'ఔట్ లుక్ పై సివిల్, క్రిమినల్ కేసులు పెట్టాలి'
హైదరాబాద్:ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కించపరిచేలా తప్పుడు కథనం ప్రచురించిన ఔట్ లుక్ మ్యాగజైన్ పై సివిల్, క్రిమినల్ కేసులు పెట్టాలని ఐఏఎస్ అధికారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మను కలిసిన వారు.. ఒక ఐఏఎస్ అధికారిణిపై అనుచిత కథనం రాసిన ఆ మ్యాగజైన్ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఔట్ లుక్ మ్యాగజైన్ పై సివిల్, క్రిమినల్ నమోదు చేయాలని సీఎస్ కు విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఔట్లుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, హైదరాబాద్లోని అసిస్టెంట్ ఎడిటర్ మాధవి టాటాలకు స్మితా సభర్వాల్ తరఫు న్యాయవాది ఈ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. క్షమాపణలు చెప్పాలని అందులో పేర్కొన్నారు.
కాగా, స్మితా వివాదంపై 'ఔట్లుక్' పత్రిక చెప్పీ చెప్పనట్లుగా క్షమాపణలు చెప్పింది. 'ద బోరింగ్ బాబు' అనే కథనంలో తాము ఎవరి పేర్లూ పేర్కొనలేదని, అయినా.. తమకు తెలంగాణ ప్రభుత్వంలోని ఓ అధికారి లీగల్ నోటీసులు పంపారంటూ కొన్ని వార్తా పత్రికలు, టీవీ న్యూస్ చానళ్లు, వెబ్ సైట్లు చెప్పాయని ఔట్లుక్ పేర్కొంది. అయితే, మీడియా గందరగోళం మొదలై 36 గంటలు దాటిపోయినా, తమకు మాత్రం ఎలాంటి నోటీసు రాలేదని తెలిపింది.
ప్రస్తుతం స్మితా సబర్వాల్ సీఎంవో కార్యాలయంలో అడిషనల్ కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేసి సమర్థురాలైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి అధికారిపై ఔట్‌లుక్ పత్రికలో వచ్చిన కథనాన్ని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండించాయి.