
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్, రీ ఇంజనీరింగ్‌కు సంబంధించి విషయాలు సాంకేతికపరమైనవని, అందులో తామెలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. సాంకేతిక అంశాల వ్యవహారం పూర్తిగా నిపుణుల పరిధిలోనిదని మంగళవారం విచారణ సందర్భంగా తేల్చి చెప్పింది. ప్రాజెక్టు అంచనా నివేదికకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషనర్ చెప్పడంతో ఆ నివేదిక పూర్తి కాపీని తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్‌కు నీటి మళ్లింపు విషయంలో ప్రభుత్వం డిజైన్‌ను మార్చి రూ.2,281 కోట్లకు పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఇ.అనిల్‌కుమార్ కోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.