చేవెళ్ల: రుణ మాఫీ ప్రతిపాదిత జాబితా(ప్రపోజల్ లిస్ట్)పై పేర్లు లేని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హులమైనా.. తమ పేర్లు అందులో చేర్చలేదని మండిపడుతున్నారు. రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతుల జాబితాను అన్ని బ్యాంకుల నుంచి సేకరించిన రెవెన్యూ అధికారులు వాటిని గ్రామాల్లో ప్రదర్శించారు. దీంతో జాబితాలో పేర్లులేని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాల విషయంలో ఇప్పటికీ గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. పట్టాదారు పాసుపుస్తకం పెట్టి బ్యాంకులలో బంగారంపై రుణం తీసుకున్న వారికే రుణమాఫీ వర్తిస్తుందని కొన్ని బ్యాంకులు ప్రకటిస్తుండగా, పాస్ పుస్తకాలు లేకున్నా బంగారాన్ని తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలన్నీ మాఫీ అవుతాయని మరికొన్ని బ్యాంకులు ప్రకటిస్తుండడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బంగారం తాకట్టుపెట్టి పాస్‌పుస్తకం లేకుండా తీసుకున్న రుణాలన్నీ కమర్షియల్ లోన్ (వ్యాపార రుణం) కిందకు వస్తాయని కొన్ని బ్యాంకులు తెలియజేస్తుండగా, పాస్ పుస్తకంలేకున్నా రైతులు బంగారం తనఖా పెట్టి తీసుకున్న రూ.లక్షలోపు తీసుకున్న రుణాలన్నీ క్రాప్‌లోన్ కిందకే వస్తాయని మరికొన్ని బ్యాంకులు చెబుతున్నారు.
ఇందులో ఏది నిజమో తెలియక రైతులు తికమక పడుతున్నారు. దీంతో బుధవారం మండలంలోని ఆలూరు, చేవెళ్లలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో అధికారులతో పలు గ్రామాల రైతులు వాగ్వాదానికి దిగారు. ఆలూరు బ్యాంకు వద్ద ఆలూరు, ఖానాపూర్, వెంకన్నగూడ, రేగడిఘనాపూర్ తదితర గ్రామాలకు చెందిన పలువురు రైతులు రుణమాఫీ జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. తమను అర్హుల జాబితాలో చేర్చి సంబంధిత అధికారులకు లిస్టు పంపాలని, వారే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అదేవిధంగా మండలంలోని ముడిమ్యాల, కుమ్మెర, పలుగుట్ట తదితర గ్రామాల రైతులు మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు చేరుకుని పాస్ పుస్తకం పెట్టకుంగా బంగారంపై రుణం తీసుకున్న వారి పేర్లను కూడా అధికారులకు పంపాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రదర్శించినది తుది జాబితా కాదని, గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించిన అనంతరం అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను ప్రకటిస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. మరో నాలుగైదు రోజులలో తుది జాబితా విడులయ్యే అవకాశం ఉందని తెలిపారు. రుణమాఫీ విషయంలో అర్హులైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, నిజంగానే అర్హత ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని వారు పేర్కొంటున్నారు.
‘మాఫీ జాబితా’పై రైతుల్లో ఆందోళన
Published Wed, Sep 3 2014 10:46 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement