
2019లో కాంగ్రెస్‌కు అధికారం ఖాయం
శాసనసభ పక్ష నేత జానారెడ్డి
మిర్యాలగూడ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా మాయమాటలతో కాలం వెల్లబుచ్చుతోందని మండిపడ్డారు.
గొర్రెలు, మేకలు ఇస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ .. మేపేందుకు భూమి లేదని, అందుకే ఇవ్వడం లేదని మరోసారి చెప్పే అవకాశం కూడా ఉందన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేక కొనుగోలు చేయడానికి భూమి లేనందున ఇవ్వడం లేదని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లోపంతో రాష్ట్రంలో పాలన సాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచన, ఆశించిన విధంగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని జానారెడ్డి భరోసా ఇచ్చారు.