
సాక్షి నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభను నిర్వహించాలని నిర్ణయించిన అధికార పార్టీ టీఆర్‌ఎస్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన సభను రద్దు చేసుకుంది. ఏకంగా ఎన్నికల ప్రచార భారీ బహిరంగసభను ఈనెల 19న నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ సభలో ప్రసంగించనున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన ఆ పార్టీ సమావేశంలో ప్రకటించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన జిల్లాల ప్రచార సభలను కేసీఆర్ నిజామాబాద్ బహిరంగ సభతోనే శ్రీకారం చుట్టిన విషయం విదితమే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల తొలి ప్రచార సభను కరీంనగర్‌లో, రెండో సభను జిల్లాలో నిర్వహించనున్నారు. సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు సన్నాహాలు చేపట్టనున్నారు. సిట్టింగ్ ఎంపీ, సీఎం తనయ కవిత పోటీ చేసే స్థానం కావడంతో టీఆర్‌ఎస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
సన్నాహక సభ రద్దు..
టీఆర్‌ఎస్ ఎన్నికల సన్నాహక సభను ఈనెల 14న నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభలో పార్టీ శ్రేణులకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేయాలని భావించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు వేల చొప్పున క్రియాశీలక కార్యకర్తలను సభకు తరలించేందుకు సన్నాహాలు చేశారు. గ్రామస్థాయి పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, మండల, జిల్లా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రతి గ్రామంలో క్షేత్ర స్థాయి కార్యకర్తలకు ఎన్నికలకు సన్నాహాలు చేయాలని భావించారు.
ఇందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి క్రియా శీలక కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలో అన్ని మండలాలు, గ్రామ స్థాయిలో క్యాడర్‌తో కవిత మాట్లాడారు. అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి సమావేశాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి నివాసంలో కార్యకర్తలతో జరిపారు. మరోవైపు జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా సన్నాహక సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈలోగా ఆదివారం సాయంత్రం ఎన్నికల షెడ్యుల్ విడుదలైంది. పైగా మార్చి 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment