సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు వెళ్దామా అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపక్షాలకు విసిరిన సవాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది! ఇందుకు కాంగ్రెస్ తరఫున టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సై అనడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రధాని నరేంద్రమోదీ జమిలీ ఎన్నికలకు మొగ్గు చూపుతుండటం.. డిసెంబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం.. తాజాగా రాష్ట్రంలో అధికార–విపక్షాలు తొడగొడుతుండటం రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ప్రధాని మోదీని కలిసి వచ్చిన కేసీఆర్‌కు ‘ముందస్తు’ సంకేతాలు అందినందునే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది.
పార్టీ శ్రేణులు, నేతలు, ప్రజలను ఎన్నికలకు సిద్ధం చేయడంతోపాటు తానే ముందు ప్రతిపాదించడం ద్వారా విపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేయాలన్న వ్యూహంతోనే సీఎం ఈ సవాల్ చేశారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 100కు పైగా స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని చాలాకాలంగా సీఎం చెబుతున్నారు. తామే మళ్లీ అధికారంలోకి వస్తామన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రతిపక్షాలను నైతికంగా దెబ్బ తీసేందుకే సీఎం ‘ముందస్తు’ ప్రస్తావన చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మేం రె‘ఢీ: సీఎం విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ కూడా దీటుగానే స్పందించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తాము ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 2018 డిసెంబర్‌లో అయినా, 2019 మేలో అయినా, లేదంటే ఈ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సర్వం సిద్ధమై ఉందని, అవినీతి, అరాచక టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్నిగద్దె దించుతామని ఆయన పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలనేది రాష్ట్ర ప్రజలకు శుభవార్త అని, అదే జరిగితే కొద్ది నెలల ముందే ప్రజలు కేసీఆర్ నుంచి విముక్తి పొందుతారన్నారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలోనూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఉత్తమ్ సూచించారు. డిసెంబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తాను చాలా రోజుల నుంచే చెబుతున్నానని, అదే అంచనాతోనే ముందుకెళ్లాలని నేతలకు సూచించారు.
పేరు మార్చి యాత్రలా?
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ట్విటర్ వేదికగా బీజేపీపైనా విమర్శలు గుప్పించారు. బీజేపీది గేమ్‌ఛేంజ్ చేసే ప్రభుత్వం కాదని, పేర్లు మార్చేదంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు గతంలో యూపీఏ హయాంలో పథకాల పేర్లను మార్చి అమలు చేస్తుంటే.. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తాము చేపట్టిన బస్సుయాత్ర పేరు మార్చి యాత్ర ప్రారంభించారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment