TPCC Chief Uttamkumar Reddy
-
‘కేసీఆర్‌కు మహిళల ఓట్లు అడిగే హక్కు ఉందా?’..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాలనలో డ్వాక్రా మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో కోటి 90లక్షల మంది మహిళలు ఉండగా.. ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్‌కు మహిళల ఓటు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పావలా వడ్డీ, తర్వాత వడ్డీలేని బుణాలు ఇచ్చిందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్! మహిళలకు లోన్లు ఇచ్చి, బిల్డింగులు కట్టించి మీటింగుల్లో పెట్టించారని, కానీ కేసీఆర్ దరిద్రపు పాలనలో లోన్లు, బిల్డింగులు లేవని అసలు మహిళలను పట్టించుకునే నాథుడే లేడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 6లక్షల మహిళా సంఘాలకు 100 రోజుల్లో రూ. లక్ష గ్రాంట్ ఇస్తామన్నారు. తెల్లకార్డు ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. మనిషికి ఏడు కిలోల సన్న బియ్యం రేషన్ ద్వారా ఇస్తామని, బియ్యంతో పాటు అమ్మహస్తం క్రింద ఇచ్చిన తొమ్మిది రకాల సరుకులు మళ్లీ ఇస్తామని చెప్పారు. దళితులకు, గిరిజనులకు రేషన్ ద్వారా బియ్యం, తొమ్మిది సరుకులు.. 200 యూనిట్లలోపు కరెంట్ ఉచితంగా ఇస్తామన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘1000రూపాయల పెన్షన్ 2వేలకు 1500 పెన్షన్ 3వేలకు పెంచుతాం. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్దాప్య పెన్షన్లు దంపతులిద్దరికీ, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఇస్తాం. స్వంత స్థలంలో డబుల్ బెడ్ రూం కట్టుకునేందుకు ఐదులక్షలు ఇస్తాం. మొదటి ఏడాది ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగాలు రాని మన పిల్లలకు నెలకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. ప్రజలను మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంద’’ని అన్నారు. -
టీఆర్ఎస్పై ఆగ్రహంతో ఉన్నారు : ఉత్తమ్
సాక్షి, నల్గొండ : తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టడానికి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలో జరిగిన పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, జానా రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ పద్మావతి, దామోదర్ రెడ్డి, మల్లు రవి, బూడిద బిక్షమయ్య గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తామన్నారు. బూత్ లెవల్ నుంచే పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయటానికి శక్తి యాప్‌లో రిజిస్టర్ చేస్తున్నామని తెలిపారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే నల్గొండ : టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్ రహస్య మిత్రులని ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ ఆరోపించారు. ఆదివారం నల్గొండలో జరిగిన పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను గెలుస్తామన్న నమ్మకం వచ్చింది. శక్తి యాప్ ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంఘటితం చేస్తాం. ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌లో చేరాలి. అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి కేసీఆర్, మోదీ అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో రాహూల్ గాంధీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం వస్తుంది. మా ఎమ్మెల్యేలను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య రాజకీయ హత్య’’ని అన్నారు. -
‘ముందస్తు’కు సై
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు వెళ్దామా అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపక్షాలకు విసిరిన సవాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది! ఇందుకు కాంగ్రెస్ తరఫున టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సై అనడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రధాని నరేంద్రమోదీ జమిలీ ఎన్నికలకు మొగ్గు చూపుతుండటం.. డిసెంబర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం.. తాజాగా రాష్ట్రంలో అధికార–విపక్షాలు తొడగొడుతుండటం రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ప్రధాని మోదీని కలిసి వచ్చిన కేసీఆర్‌కు ‘ముందస్తు’ సంకేతాలు అందినందునే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది. పార్టీ శ్రేణులు, నేతలు, ప్రజలను ఎన్నికలకు సిద్ధం చేయడంతోపాటు తానే ముందు ప్రతిపాదించడం ద్వారా విపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేయాలన్న వ్యూహంతోనే సీఎం ఈ సవాల్ చేశారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 100కు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని చాలాకాలంగా సీఎం చెబుతున్నారు. తామే మళ్లీ అధికారంలోకి వస్తామన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రతిపక్షాలను నైతికంగా దెబ్బ తీసేందుకే సీఎం ‘ముందస్తు’ ప్రస్తావన చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మేం రె‘ఢీ: సీఎం విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ కూడా దీటుగానే స్పందించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తాము ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 2018 డిసెంబర్లో అయినా, 2019 మేలో అయినా, లేదంటే ఈ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సర్వం సిద్ధమై ఉందని, అవినీతి, అరాచక టీఆర్ఎస్ ప్రభుత్వాన్నిగద్దె దించుతామని ఆయన పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలనేది రాష్ట్ర ప్రజలకు శుభవార్త అని, అదే జరిగితే కొద్ది నెలల ముందే ప్రజలు కేసీఆర్ నుంచి విముక్తి పొందుతారన్నారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలోనూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఉత్తమ్ సూచించారు. డిసెంబర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తాను చాలా రోజుల నుంచే చెబుతున్నానని, అదే అంచనాతోనే ముందుకెళ్లాలని నేతలకు సూచించారు. పేరు మార్చి యాత్రలా? టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ట్విటర్ వేదికగా బీజేపీపైనా విమర్శలు గుప్పించారు. బీజేపీది గేమ్‌ఛేంజ్ చేసే ప్రభుత్వం కాదని, పేర్లు మార్చేదంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు గతంలో యూపీఏ హయాంలో పథకాల పేర్లను మార్చి అమలు చేస్తుంటే.. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తాము చేపట్టిన బస్సుయాత్ర పేరు మార్చి యాత్ర ప్రారంభించారని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
నిర్మల్ : అన్నివర్గాల ప్రజలకు అభివృద్ధిని అందించిన ఘనత కాంగ్రెస్‌దేనని, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను ఇస్తామన్న కేసీఆర్ నాలుగేళ్లయినా ఇవ్వడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మైనార్టీలను మోసగించిన టీఆర్ఎస్ పార్టీకి వారిని ఓట్లడిగే హక్కు లేదన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో శుక్రవారం సాయంత్రం ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, స్థానిక రియల్టర్ సయ్యద్ అర్జుమంద్‌అలీ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు సీఎల్పీ, మండలి నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహేశ్వర్‌రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో హామీలు గుప్పించిన సీఎం కేసీఆర్ వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.ప్రధానంగా 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ మైనార్టీలను మోసగించారన్నారు. రిజర్వేషన్ల అమలుకు ప్రధానమంత్రి ఒప్పుకున్నారని, త్వరలో ఇవ్వనున్నామని కట్టుకథలు చెబుతూ తప్పించుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే ముస్లింమైనార్టీలకు నాలుగుశాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. జనాభా ఆధారంగా ముస్లింలకు 12శాతం రిజర్వేషను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో టీఆర్ఎస్కు మైనార్టీలను ఓట్లడిగే హక్కు లేదని చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతకలహాలు పెరిగాయని, మైనార్టీలలో అభద్రతాభావం పెరిగిందన్నారు. చాలాచోట్ల మైనార్టీలకు రక్షణ కొరవడిందని ఆందోళన వ్యక్తంచేశారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందముందని ఆరోపించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, నోట్లరద్దు, జీఎస్టీ అంశాల్లో కేంద్రానికి మద్దతునివ్వడమే తప్పా ఒక్క ఆరోపణ కూడా టీఆర్ఎస్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలకు ఓట్లు వేస్తే వృథా అవుతాయని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. తమ అధినేత రాహుల్‌గాంధీ నిర్మల్‌లో పాదయాత్ర చేశారని, ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్నారు. ఒకపూట విందు కాదు.. జీవితాంతం భరోసా కావాలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ ధనంతో రాష్ట్రంలో 800 చోట్ల మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇస్తున్నారని, ఇలాంటి ఒకపూట విందు ఇవ్వడం కాదని, జీవితాంతం ఉపయోగపడేలా ముస్లింమైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, దేశంలో మైనార్టీలకు ప్రాధాన్యత తగ్గుతోందన్నారు. ప్రభుత్వ పన్నుల ద్వారా వచ్చే డబ్బులతో తాను ఇఫ్తార్ విందు ఇవ్వనని చెప్పిన రాష్ట్రపతి కోవింద్ తన సంఘ్ మూలాల చాటుతూ తప్పించుకున్నారని అన్నారు. ఇందుకు తాము కూడా గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్‌ను బహిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ముస్లింలతో గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పాతబస్తీలో ఐదెకరాల బంగ్లాలో ఉండే ఓవైసీలకు గరీబుల కష్టాలు పట్టించుకునే తీరిక లేదన్నారు. కాంగ్రెస్ మాత్రమే అన్నివర్గాలకు సమన్యాయం చేస్తుందని చెప్పారు. అభద్రత, అసహనం పెరిగాయి.. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు మర్చిపోయాయని, వీళ్ల పాలనతో అభద్రత, అసహనం పెరిగాయని జానారెడ్డి అన్నారు. స్వతంత్రం కోసం పోరాడటంతో పాటు దేశాన్ని అభివృద్ధి చేసి, సామరస్యతను కాపాడుతున్న ఘనత ఒక్క కాంగ్రెస్‌దేనన్నారు. కేసీఆర్ రిజర్వేషన్లను ఇవ్వడం ఇక కల్లనేని, మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం స్థానిక ఆర్ఆర్ గార్డెన్లో రియల్టర్ అర్జుమంద్‌అలీ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ముఫ్తీ ఖలీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్‌మాసం గొప్పతనం, అందులోని విశేషాలను షబ్బీర్ అలీ వివరించారు. అనంతరం సామూహికంగా ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందు ఆరగించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా నాయకులు రామారావు పటేల్, భార్గవ్‌దేశ్‌పాండే, అనిల్‌జాదవ్, అజర్, హైదర్, రామలింగం, సత్యంచంద్రకాంత్, అయన్నగారి పోశెట్టి, జుట్టు దినేశ్, నాందేడపు చిన్ను, సంతోష్, సయ్యద్ అక్తర్, జునైద్ మెమన్, ఇమ్రానుద్దీన్, మోయిన్, అల్మాస్, ముత్యంరెడ్డి, బాపురెడ్డి, ఆయా జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
ఏపీలో బద్ధశత్రువులు కలిశారు.. తెలంగాణలో వద్దా?: రేవంత్
సాక్షి, హైదరాబాద్ : తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కేసీఆర్ కుటుంబం సాగిస్తోన్న దోపిడీకి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందనుకున్నవేళ.. అక్కడి రాజకీయ బద్ధశత్రువులు కలిసిపోయారని, అదే మాదిరిగా తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఆత్మీయులతో మాట-ముచ్చట’ సభలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 48 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి కేవలం 18 శాతం మాత్రమే పడ్డాయి. అయితే విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న భావన అందరిలో కలిగింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని చాలా మంది నేతలు తెలుగుదేశంలో చేరి ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావులు, జేసీ దివాకర్‌రెడ్డి లాంటివాళ్లు అలా వచ్చినవారే. టీడీపీకి వారు శత్రువులే అయినా, అందరితో మాట్లాడి చంద్రబాబు ఒప్పించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ అలాంటి పునరేకీకరణ జరగాలి. కేసీఆర్ కుటుంబం సాగిస్తోన్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సింది. అందుకే కాంగ్రెస్-టీడీపీ కలిసి పనిచేయాలని నేను కోరాను’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ జిందాబాద్ : రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. టీడీపీ కార్యకర్తలంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జాతీయ స్థాయిలో రాహుల్, సోనియా గాంధీల నాయకత్వంలో పనిచేద్దామని అభిమానులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం.. కేసీఆర్ కాళ్ల కింద పడి ఉండటంకాదు.. నిటారుగా నిలబడిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌కు ఆత్మీయుడిని : కాంగ్రెస్ పార్టీ నాయకులు జైపాల్ రెడ్డి, జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు తనకు బంధువులేనని, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుటుంబం ఎంతో ఆత్మీయంగా ఉండేదని రేవంత్ గుర్తుచేసుకున్నారు. 2006 నాటికి ఎంత అనుబంధం ఉన్నప్పటికీ అప్పట్లో తాను కాంగ్రెస్‌లోకి చేరలేదని, ప్రతిపక్ష టీడీపీలో చేరి ప్రజల కోసం పనిచేశానన్నారు. ఇప్పటి సందర్భంలో గురువులాంటి చంద్రబాబును వదిలిపెట్టి, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌లోనే చేరుతున్నానన్నారు. 14 ఏళ్లుగా ఏం చెప్పావ్?.. 40 నెలలుగా ఏం చేస్తున్నావ్? : ఆత్మీయ ముచ్చటలో రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రవిమర్శలు చేశారు. వేల మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని, హామీలు నమ్మి జనం టీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టారని గుర్తుచేశారు. అయితే ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చడం లేదని, కేవలం కుటుంబ ప్రయోజనాల కోసమే తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. ‘‘ఏదైనా అడిగితే, మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేస్తున్నాం’ అని టీఆర్ఎస్ నాయకులు అంటారు.. నేను అగిడేది అదే.. 14 ఏళ్ల ఉద్యమకాలంలో ఏమేం చెప్పారు.. అధికారంలోకి వచ్చిన 40 నెలల్లో ఏమేం చేశారు? అని! సామాజిక తెలంగాణ జాడ లేకుండా పోయింది. ప్రతిపక్షాల గొంతునొక్కడం కేసీఆర్‌కు అలవాటైంది. ఇకపై ఆయన ఆటలు సాగనివ్వబోము’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
ఆయనవి సంస్కారంలేని మాటలు..!
-
ఆయనది తుగ్లక్ పాలన.. సంస్కారంలేని మాటలు!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన హోదాను మరిచిపోయి..సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. తుగ్లక్ పాలనలా, పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్ పరిపాలన ఉందని ప్రజలు అనుకుంటున్నరని మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వీ హనుమంతరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజాధనాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. వాటర్ గ్రిడ్‌కు నిధులు ఉన్నాయి కానీ, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేవా? అని ప్రశ్నించారు. పంటలు నష్టపోయి రైతులు కష్టాల్లో ఉంటే.. వారు సంబురాలు చేసుకుంటున్నారని కేసీఆర్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒక జిల్లాలో 40 లక్షల జనాభా ఉంటే.. మరొక జిల్లాలలో కేవలం నాలుగు లక్షల జనాభా మాత్రమే ఉండటం శాస్త్రీయతనా? ప్రశ్నించారు. మరో నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సోయి ఉంది కాబట్టే.. తెలంగాణ ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆరే ఫామ్‌హౌజ్‌లో పడుకొని సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
'మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా'
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలను టీఆర్ఎస్లో చేర్చుకోవడంపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. మంత్రి హరీష్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిని చూసే ఇతర పార్టీ నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదా అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరికపై ఇప్పుడు మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. 'మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా' అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలపై మండిపడ్డారు. -
'రైతు ఆత్మహత్యలకు కేసీఆరే కారణం'
యాదగిరిగుట్ట (నల్లగొండ) : అన్నదాతల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రైతు బలవన్మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన దుయ్యబట్టారు. శనివారం సాయంత్రం ఆయన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం సాదువెల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మేకల కరుణాకర్ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవటం మాని, కేసీఆర్ విదేశాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు.